ప్రజాశక్తి -భీమునిపట్నం : ఎపి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడా జట్ల ఎంపికకు వివిధ పాఠశాలల విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించారు. శుక్రవారం స్థానిక సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిచిన కార్యక్రమంలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ రూరల్ మండలాలకు చెందిన సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడా జట్లు ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలి రోజు 14-17 ఏళ్ల లోపు బాలురకు, 29 న బాలికలకు పోటీలు నిర్వహిస్తారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, టెన్నీకాయిట్, బాల్ బ్యాడ్మింటన్, యోగా, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో జట్ట ఎంపిక జరగనుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. నాలుగు మండలాల ఎంఇఒలు, 50 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










