Nov 18,2022 22:30

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
              ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకూ అస్సోం రాష్ట్రం గౌహతిలో నిర్వహించిన జాతీయస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో అద్భుత ప్రతిభను చాటి కాంస్య పతకం సాధించిన లక్కోజు డింపుల్‌ మహాశ్రీకి ఏలూరులో శుక్రవారం ఘనస్వాగతం లభించింది. సత్రంపాడు సమీపంలోని నెహ్రూకాలనీ 12వ రోడ్డుకు చెందిన డింపుల్‌ మహాశ్రీ శిక్షకుడు దేవరపల్లి ప్రసాద్‌ వద్ద కొంతకాలంగా అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందుతుంది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకూ నిర్వహించిన జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఆమె 60 మీటర్ల డాష్‌ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా ఆమె తల్లి ఝాన్సీ మాట్లాడుతూ కేవలం ఈ పతకంతో సరిపెట్టుకోకుండా అంతర్జాతీయస్థాయి పోటీల్లోనూ తమ కుమార్తె రాణించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.