ప్రజాశక్తి - భీమడోలు
కొల్లేరు లంక గ్రామాల్లో క్రీడాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు తెలిపారు. ఆగడాలలంకలో గ్రామ సర్పంచి భలే రాంబాబు, భీమడోలు ఎంపిపి కనుమాల రామయ్య చొరవతో దాతలు స్పందించి ఆగడాలలంకలో అన్ని సౌకర్యాలతో కూడిన వాలీబాల్ మినీస్టేడియం ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఆట స్థలానికి ఎనిమిది సెంట్లు భూమిని రైతులు సమకూర్చగా, మినీ స్టేడియంలో రాత్రి సమయాలలో సైతం క్రీడలు నిర్వహించేందుకు రూ.ఏడు లక్షల విరాళాన్ని ఆక్వారంగ ప్రముఖులు ఇందుకూరి కృష్ణంరాజు (అర్దవరం కృష్ణంరాజు) అందజేశారు. వాలీబాల్ మినీ స్టేడియంను ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు శనివారం ప్రారంభించారు. లాంఛనంగా వాలీబాల్ సర్వీస్ చేసి ఆటలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. నూతనంగా నిర్మించిన మినీ స్టేడియం అభివృద్ధికి తనవంతు సహకారం అందజేస్తానని ఎంఎల్‌ఎ హామీ ఇచ్చారు. ఎంపిపి కనుమాల రామయ్య మాట్లాడుతూ కొల్లేరు గ్రామాల్లో వాలీబాల్ క్రీడకు మంచి ఆదరణ ఉందన్నారు. సర్పంచి సహకారంతో దాతలను సంప్రదించి వారి సహకారంతో వాలీబాల్ మినీ స్టేడియం ఆగడాలలంకలో ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో భీమడోలు సొసైటీ అధ్యక్షులు రాయపాటి సత్యశ్రీనివాస్, వైసిపి ప్రముఖులు డాక్టర్ పి.మాన్‌సింగ్, రామకుర్తి నాగేశ్వరరావు, భీమడోలు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఇంజేటి నీలిమ, ఎంపిటిసిలు ముళ్లగిరి జాన్సన్, ఇంజేటి జూనియర్, గ్రామ సర్పంచి భలే రాంబాబు పాల్గొన్నారు.










