పుట్టపర్తి అర్బన్ : జిల్లా వ్యాప్తంగా క్రీడ స్ఫూర్తిని పెంపొందించే విధంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విష్ణు, డిఆర్‌ఒ కొండయ్య, చీఫ్‌కోచ్ ఉదరు భాస్కర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి ప్రతిష్టాత్మకంగా సచివాలయాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రీడలు నిర్వహించాలని ఆదేశించిందన్నారు. ఆడుదాం ఆంధ్ర కోసం మస్కట్ లోగోను ఉత్సాహం ఉన్నవారు ప్రతిపాదనలు పంపితే రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తారన్నారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా సచివాలయ, మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలలో వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్ క్రీడలు నిర్వహించాలన్నారు. అక్టోబర్ 2 నుంచి 45 రోజులు పాటు వీటిని నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారన్నారు. పోటీలు మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్వహించాలన్నారు. దీనిపై అధికారులు విస్తత స్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. మొదటి, ద్వితీయ, తతీయ బహుమతులు 50 వేలు, 30, వేలు, 20, వేలు అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల వారు ఈనెల 10 లోగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
9 నుంచి 20 వరకు నా భూమి నా దేశం కార్యక్రమం
జిల్లా వ్యాప్తంగా ఈనెల 9 నుంచి 20 వరకు నా భూమి, నా దేశం కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమత్ మహోత్సవంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలు మండల, పట్టణ కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈనెల 10న పంచప్రాణ ప్రతిజ్ఞ చేసి 75 మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రామాంజనేయులు, సిపిఒ విజరు కుమార్, గహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.










