Sep 03,2023 23:07

క్రీడా సౌకర్యాల మెరుగుకు కృషి

నైపుణ్యంతో ఖ్యాతినార్జిస్తున్న క్రీడాకారులు
* కోడి రామ్మూర్తి స్టేడియానికి కొత్తగా ప్రతిపాదనలు
* 'ప్రజాశక్తి'తో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ
సిఇఒ ప్రసాదరావు ముఖాముఖి
 క్రీడాకారుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ద్వారా కృషి చేస్తున్నామని సంస్థ సిఇఒ బి.వి.ప్రసాదరావు తెలిపారు. జిల్లాలోని క్రీడా మైదానాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెద్దఎత్తున నిధులు అవసరమున్న కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి కొత్త ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. జిల్లాలో క్రీడాకారులకు కొదవ లేదని, అన్ని రంగాల్లో రాణిస్తున్న వారికి ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. దాతల సహకారంతోనే క్రీడాకారులను పోటీలకు పంపిస్తున్నామని చెప్పారు. జిల్లాలో క్రీడల పరిస్థితి, క్రీడాకారులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆయన 'ప్రజాశక్తి'కి వివరించారు.
 ప్రజాశక్తి, శ్రీకాకుళం అర్బన్‌ : 
జిల్లాలో క్రీడల అభివృద్ధికి నిధుల విడుదలకు శాప్‌ సహకారం ఎలా ఉంది.?
జిల్లాలో వందల మంది క్రీడాకారులను డిఎస్‌ఎ శిక్షకులు తీర్చి దిద్దుతున్నారు. బాక్సింగ్‌, జూడో, వాలీబాల్‌, కబడ్డీ, హ్యాండ్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, తదితర ఆటల్లో నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. నిధుల కొరత వేధిస్తుండటంతో అవసరాల మేరకు సొంతంగా సమకూర్చి వారిని పోటీలకు పంపిస్తున్నాం. ప్రభుత్వం నుంచి క్రీఢలకు ప్రోత్సాహం ఉంది. శాప్‌ ద్వారా పూర్తి స్థాయి సహకారం అందుతోంది. ఉన్నత స్థాయి అధికారుల సూచనల మేరకు క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం.
కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవతాయి?
శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం అభివృద్ధి చేయాల్సి ఉంది. స్టేడియం కోసం ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వానికి నివేదించాం. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి హామీ మేరకు కొత్తగా ప్రస్తుత అంచనాలకు అనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేసి పంపాం. మైదానంలో ప్రస్తుతం ఇండోర్‌ క్రీడలకు కొంత భాగాన్ని వినియోగిస్తున్నాం. స్టేడియం పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడితే జాతీయ క్రీడల వరకు వేదికయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
సౌకర్యాల మెరుగుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులుగా ఇటీవల డాక్టర్‌ కల్లేపల్లి శ్రీధర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు క్రీడల పట్ల పూర్తి అవగాహన ఉంది. క్రీడాకారులకు ఏ సమయంలో ఏమి అవసరమన్నది తెలిసిన అధికారి రావడం అన్ని విధాలా డిఎస్‌ఎ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మూలన పడిన బాక్సింగ్‌ రింగ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రీడాకారులు వ్యాయామం చేసేందుకు ప్రత్యేకంగా ఓ గదిని సిద్ధం చేయిస్తున్నాం. జూడో, బాక్సింగ్‌, కబడ్డీ, తైక్వాండోలకు క్రీడా సామగ్రిని గుంటూరు నుంచి, అథ్లెటిక్స్‌, ఖోఖో పరికరాలను సొంత నిధులతో ఏలూరు నుంచి రప్పించారు. ఇలా క్రీడాకారులకు కావాల్సినవన్నీ ఒక్కొక్కటిగా సమకూరుస్తున్నాం.
వికాస కేంద్రాల నిర్వహణ ఎలా సాగుతోంది.?
జిల్లాలో క్రీడా వికాస కేంద్రాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. ప్రస్తుతం టెక్కలి, రణస్థలం, పాతపట్నం ప్రాంతాల్లో కేంద్రాలు వినియోగంలో ఉన్నాయి. ఆయా చోట్ల తైక్వాండో, వెయిట్‌ లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌ శిక్షకులను నియమించాం. పలాస, ఇచ్ఛాపురం, పాత్రునివలసలో కేంద్రాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నరసన్నపేటలో 60 శాతం వరకు పనులు జరిగాయి. వీటి పరిస్థితిపై ఇటీవల శాప్‌నకు నివేదిక పంపించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
'ఆడుదాం ఆంధ్ర' పోటీల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
అక్టోబరు 2 నుంచి 'ఆడుదాం ఆంధ్రా' క్రీడా పోటీలు మొదలవుతాయి. పోటీల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. అందులో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు జరగనున్నాయి. జిల్లాలోనూ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే కలెక్టర్‌ శ్రీకేశ్‌ లాఠకర్‌ మండలస్థాయి అధికార్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయి సూచనలు చేశారు. వారి ఆదేశాలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో ఈ ప్రక్రియ మొదలైంది.