Jul 17,2023 21:04

క్రీడా పాఠశాల నిర్వహిస్తున్న గురుకుల పాఠశాల ఇదే

ప్రజాశక్తి-సీతంపేట :  క్రీడలకు పెద్దపీట వేస్తాం. ఏజెన్సీలోని మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం. గిరిజన క్రీడాకారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. సకల సదుపాయాలు కల్పించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారు రాణించేలా తోడ్పాటు అందిస్తాం.
ఇవీ ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రసంగాల్లో తరచూ వినిపించే హామీలు. ఏదో క్రీడా పోటీల ప్రారంభ సభలో, బహుమతుల ప్రదానోత్సవంలో ఆ హామీలివ్వడం ఆనవాయితీగా వస్తోంది. అంతే తప్ప కార్యరూపం దాల్చడమన్న ప్రశ్నే లేదు. అందుకు నిదర్శనమే సీతంపేట క్రీడా పాఠశాలపై శీతకన్ను వేయడాన్ని చెప్పొచ్చు. వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రయివేటు స్పోర్ట్స్‌ స్కూళ్లలో చేరుతున్న ప్రస్తుత తరుణంలో, ఉచితంగా, అందుబాటులో క్రీడా పాఠశాల ఉన్నా ప్రవేశాలకు విద్యార్థులు వెనక్కి జంకుతున్నారంటే అక్కడ సదుపాయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
గిరిజన విద్యార్థులు విద్యతోపాటు ఆట, పాటలు, క్రీడలపై మొగ్గు చూపుతారని, వారి నైపుణ్యం వెలికి తీయడానికి 2021లో సీతంపేటకు క్రీడా పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎటువంటి నిధులు, పరికరాలు మంజూరు చేయలేదు. దీంతో విద్యార్థులు క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఆసక్తి చూపడం లేదు. 2021-22 విద్యా సంవత్సరంలో సీతంపేటకు క్రీడా పాఠశాల మంజూరు చేసి, ఐటిడిఎ సమీపంలో ఉన్న బాలుర గురుకుల పాఠశాలలో ఆదరాబాదరాగా అప్పటి గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ చినవీరభద్రుడు ప్రారంభించారు. అప్పటినుండి ఇప్పటివరకు 32 విద్యార్థులు మాత్రమే ప్రవేశించారు.
వసతులు కరువు
క్రీడా పాఠశాలకు ప్రత్యేకమైన వసతులుండాలి. కానీ, సీతంపేట బాలుర గురుకుల భవనంలోనే క్రీడా పాఠశాల నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాల భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. దాంతోపాటు క్రీడా పాఠశాలకు విద్యార్థులకు సంబంధించి జావెలిన్‌త్రో, ఫుట్‌బాల్‌, తదితర క్రీడా పరికరాలు సరఫరా చేయాలి. క్రీడా యూనిఫాం ఉండాలి. ఇవేవీ ఇంతవరకు మంజూరు చేయలేదు. వీరికి ప్రత్యేకమైన భోజనం.. రోజుకు 125 రూపాయలు విలువ చేసే ఆహారం అందించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో గురుకుల విద్యార్థులకు అందించే ఆహారాన్నే అందిస్తున్నారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం కోసం 46 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. క్రీడాపాఠశాలకు కోచ్‌లు ఐదుగురు ఉండాల్సి ఉన్నప్పటికీ ముగ్గురు ఉన్నారు. క్రీడా పాఠశాలలో ఆరో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు పాఠశాల ఉంటుంది. గురుకుల ఉపాధ్యాయులతోనే దీనిని నెట్టుకొస్తున్నారు. సీతంపేట క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు తాజాగా సోమవారం గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలకు జోనల్‌ స్కూల్‌గా సీతంపేట ఉండటంతో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి విద్యార్థులు హాజరుకావచ్చు. కానీ 88 సీట్లకు 75 మంది మాత్రమే వచ్చారు. అందులో సీతంపేట గురుకుల పాఠశాల నుంచి 73 మంది హాజరయ్యారు. గుమ్మలకీëపురం నుంచి ఒకరు, శ్రీకాకుళం జిల్లా పెద్దమడి పాఠశాల నుంచి ఒకరు హాజరుకాగా, విజయనగరం జిల్లా పూర్తిగా విద్యార్థులు హాజరుకాలేదు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో వారిని చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు.
ప్రిన్సిపల్‌ వివరణ
ఈ విషయాన్ని క్రీడా పాఠశాల ప్రిన్సిపల్‌ తిరుపతిరాజు వద్ద ప్రస్తావించగా, ప్రస్తుతం క్రీడా పరికరాలు రాలేదని చెప్పారు. గురుకులం మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నామని సమాధానం ఇచ్చారు.
క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపికలు
సీతంపేట : మండలంలో ఐటిడిఎ సమీపంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం గురుకులాల నోడల్‌ కన్వీనర్‌ పి.నాగభూషణం ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జోనల్‌కు సంబంధించి 75 మంది విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ఎస్‌.తిరుపతిరాజు, ఐటిడిఎ స్పోర్ట్స్‌ ఇన్‌ఛార్జి ఎన్‌.జాకబ్‌ దయానంద్‌ పాల్గొన్నారు.