Sep 13,2023 22:34

క్రీడా పతాకాన్ని ఆవిష్కరిస్తున్న రఘువీరారెడ్డి, తదితరులు

ప్రజాశక్తి మడకశిర : విద్యార్థులు విద్యతోపాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా స్పోర్ట్స్‌ డెవలప్మెంట్‌ ఆఫీసర్‌ ఉదయ భాస్కర్‌, సిడబ్ల్యూసి మెంబర్‌ రఘువీరారెడ్డి సూచించారు. శ్రీరామి రెడ్డి 118వ జయంతి సందర్భంగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన తాలుకా స్థాయి క్రీడా పోటీలను మండలంలోని నీలకంఠాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులతో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు నీలకంఠాపురంలో ఇలాంటి టోర్నమెంట్‌ నిర్వహించడం వల్ల క్రీడాకారుల దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. నియోజకవర్గంలోని 64 పాఠశాల నుండి విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొంటారని తెలియజేశారు. దాదాపు 15 రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని గెలుపొందిన విద్యార్థులకు అక్టోబర్‌ ఆరవ తేదీన బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి బ్యాటింగ్‌ చేయగా క్రీడల అధికారి ఉదయభాస్కర్‌ బౌలింగ్‌ చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు శ్రీధర్‌, మందలపల్లి నాగరాజు, సర్పంచులు కళావతి, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ నరసింహమూర్తి, ప్రభాకర్‌ రెడ్డి, శంకర్‌ రెడ్డి, హెడ్మాస్టర్లు చంద్రమౌళి, రంగస్వామి, రామకృష్ణ నియోజకవర్గంలోని పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.