Sep 17,2023 22:04

ఆచంట ఎంవిఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల ఉమ్మడి ఆటల మైదానం దుస్థితి
ప్రజాశక్తి - ఆచంట

          వర్షం కురిస్తే ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానం చెరువును తలపిస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని ఆచంట ఎంవిఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉమ్మడి ఆటల మైదానం అధ్వానంగా తయారవ్వడంతో విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. క్రీడాస్థలం పల్లంగా ఉండటం, వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికి మైదానం నీటమునగడం పరిపాటిగా మారింది. మైదానంలో సుమారు రెండు అడుగుల లోతు వర్షపు నీరు నిలిచిపోతుంది. వర్షాకాలం వచ్చేసరికి రోజులు తరబడి నీరు నిలిచిపోవడంతో మైదానం మొత్తం బురదమయంగా మారుతుంది. దీంతో సుమారు 1300 మంది విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రీడా మైదానాల్లో నిలిచిన నీరు పూర్తిస్థాయిలో తగ్గడానికి సుమారు 20 రోజుల వరకు పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మైదానాన్ని మెరక చేసి వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో, మానసిక ఉల్లాసానికి ఆటలు అంత ముఖ్యమే. ఆడుకోవడానికి అవకాశం లేకపోవడంతో తరగతి గదులకు పరిమితం అవుతున్నారు. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ సమస్య అలాగే కొనసాగుతుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
       చినుకు పడితే చిత్తడిగా మైదానం
పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేనంత ఆటస్థలం ఈ పాఠశాలకు ఉంది. అయితే కొంతమేర నిరూపయంగా ఉన్న మైదానం మధ్యలో ఎంవిఆర్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన అదనపు తరగతి గదులు అదనపు భవన నిర్మాణంతో విశాలమైన ఆటస్థలం కాస్త కుషించిపోయింది. చినుకు పడితే చాలు మైదానమంతా వర్షపు నీటిలో మునిగిపోతుంది. దీంతో విశాలమైన మైదానం ఉన్న నిరుపయోగంగా మారింది. ఈ నేపథ్యంలో వర్షపు నీరు బయటకు వెళ్లే విధంగా తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతుందని విద్యార్థులు వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ పాఠశాలలో మౌలిక సదుపాయాలతో పాటు క్రీడా మైదానం అభివృద్ధి చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు ముక్తకంఠంతో కోరుతున్నారు.