విజేతలకు ప్రోత్సాహకాలు, ఆర్థిక సాయమే
2023-28 క్రీడా పాలసీలో కసరత్తు
జిల్లాలో 50 వేల మంది క్రీడాకారుల్లో ఆందోళన
ప్రభుత్వ యోచనపై పెదవి విరుపు
ప్రజాశక్తి - భీమవరం
ఉద్యోగాల భర్తీలో ఇప్పటి వరకు అమలు చేస్తున్న స్పోర్ట్స్ కోటాను రద్దు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ సాధించిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల ఎంతోమంది ఆటగాళ్లు క్రీడా కోటాలో పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొంది పని చేస్తున్నారు. అయితే ఇకపై ఆ విధానం రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో క్రీడాకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
దేశ పేరు ప్రఖ్యాతులను ప్రపంచ దేశాల ముందు నిలపడంలో క్రీడారంగం ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ రంగంలో క్రీడాకారులు ఇతర దేశాలను తలదన్నేలా రాణిస్తూ ప్రపంచం నలుమూలల కీర్తి ప్రతిష్టలను చాటుతున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు ప్రభుత్వశాఖల్లో ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తూ వస్తోంది. జిల్లాలో సుమారు 50 వేల మంది క్రీడాకారులు ఉన్నారు. వివిధ క్రీడల్లో వీరు రాణిస్తున్నారు. ఇప్పటికే క్రీడల్లో రాణించిన వారు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పొంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అయితే ప్రభుత్వం క్రీడా పాలసీలో మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే ఉద్యోగాల్లో క్రీడా కోటాను రద్దు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పుడున్న క్రీడా విధానంలో మార్పులు చేసి క్రీడల్లో రాణించిన వారికి కేవలం ప్రోత్సాహకాలు, ఆర్థిక సాయం అందించి చేతులు దులుపుకునేలా కొత్తగా 2023-28 క్రీడా పాలసీని ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులు, క్రీడా నిపుణులతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇదే సమయంలో ఆటగాళ్లకు ఉద్యోగావకాశాలపైనా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెడల్స్ సాధించిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. రానున్న కాలంలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ సాధించిన వారికి కేవలం ప్రోత్సాహకాలు, ఆర్థిక సాయం మాత్రమే అందించాలని నిర్ణయించారు.
క్రీడారంగంపై నీలినీడలు.. క్రీడాకారుల పరిస్థితి ప్రశ్నార్థకం
ఇప్పటి వరకు మెడల్స్ సాధించిన వారికి అనేక రాష్ట్రాల్లో గౌరవ సూచకంగా ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆటగాళ్లకు ఉద్యోగావకాశాల్లోనూ ఎక్కువగా పోలీస్, రెవెన్యూ శాఖల్లో లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా గణనీయంగా రాణించిన వారికి సర్వీసెస్, రైల్వే వంటి వాటిలో ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోటాలో ఉద్యోగాలు రద్దు చేయడానికి అడుగులు వేస్తోంది. తాజాగా 'ఆడుదాం ఆంధ్రా' నిర్వహణ నేపథ్యంలో ఉన్నతాధికారుల కమిటీ నిర్వహిస్తున్న భేటీల్లో స్పోర్ట్స్ పాలసీపై కొంతమంది మాజీ సీనియర్ ఆటగాళ్లు, క్రీడా నిపుణుల నుంచి సూచనలు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో క్రీడారంగం నిర్వీర్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు క్రీడారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ యోచనపై క్రీడాకారులు, క్రీడారంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం అమలైతే క్రీడాకారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది.










