Jun 24,2023 21:51

ఫొటో : ట్రాన్స్‌కో ఈ.ఈ. కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వామపక్ష నాయకులు

కరెంటు ఛార్జీలను తగ్గించాలి
- ట్రాన్స్‌కో ఈఈ కార్యాలయం వామపక్ష పార్టీల ధర్నా
ప్రజాశక్తి-కావలి : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు, ట్రూ అప్‌, సర్దుబాటు ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్‌ మీటర్లు పెట్టే విధానాన్ని విరమించుకోవాలని శనివారం వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్‌), ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్యాంక్‌ పార్టీల ఆధ్వర్యంలో కరెంటు డివిజనల్‌ ఈ.ఈ.ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఈ టెక్నికల్‌ యస్థాని బాషాకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి పి.పెంచలయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అధికారంలోకి వస్తే, పేదలకు మంచి పరిపాలనను అందిస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల కాలంలో ఇప్పటికే సుమారు 8సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను అమలు చేస్తూ ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం జరిగిందని ఇప్పుడు ట్రూ అప్‌ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోపిందన్నారు. అంతేకాకుండా మళ్లీ స్మార్ట్‌ మీటర్లు పెట్టే విధానం తీసుకొచ్చి, వేల రూపాయలు భారాన్ని ప్రజలపై మోపాలని చూస్తున్నదన్నారు. ఇది సరైన విధానం కాదని ఈ పరిపాలన చూస్తుంటే అదాని పరిపాలన అనిపిస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల కరెంటు ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్‌ మీటర్లు పెట్టే విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కరెంటు ఛార్జీలను తగ్గించేంత వరకు ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. సిపిఐ నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజలపై అనేక రకాలుగా భారాలను మోపుతుందన్నారు. ప్రస్తుత రోజుల్లో నిత్యావసర వస్తువులు కొని తినలేని పరిస్థితుల్లో ఉన్నారని గతంలో రూ.450 గ్యాస్‌ ఉంటే ఇప్పుడు రూ.1150 అయిందన్నారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో విపరీతంగా అన్ని రకాల నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగాయని దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కరెంటు ఛార్జీలు పెంచడం ఏ మేరకు సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో స్త్రీ విముక్తి సంఘటన నాయకురాలు ఎల్‌.శ్యామల, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకులు పి.మహేష్‌ మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి.మధుసూదన్‌ రావు, పి.తిరుపాలు, బి.కృష్ణయ్య, సిపిఐ కార్యదర్శి కె.నాగరాజు, నరసింహారావు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకులు రవికాంత్‌, సిఐటియు నాయకులు వై.కృష్ణమోహన్‌, టి.రత్నం, ఎఐటియుసి నాయకులు మల్లి అంకయ్య, గుంజి కిషోర్‌, డివైఎఫ్‌ఐ నాయకులు పి.పెంచల నరసింహం, కె. చెన్నయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.