కరెంటు బిల్లులు సాధారణ ప్రజలకు షాక్ ఇస్తున్నాయి. ఒక్కసారిగా బిల్లు పెరిగిపోవడంతో పేద ప్రజలు బిల్లులు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సాధారణ పేద ఇంటికి రూ. 100 నుంచి రూ. 150 వరకూ వచ్చే కరెంటు బిల్లు ఒక్కసారిగా రూ. 1000 నుంచి రూ. 4వేల వరకూ రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి బిల్లులో ఇంత తేడా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు అధికంగా రావడంతో కొంత మంది చెల్లించేందుకు నిరాకరించారు. దీనికి విద్యుత్తు శాఖ అధికారులు బిల్లులు చెల్లించని వారి ఇంటికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఆదివారం ఆందోళనకు దిగారు.
ప్రజాశక్తి- వేపాడ : మండల కేంద్రంలో నివాసముంటున్న ప్రజలకు విదుత్తు బిల్లులు షాక్ ఇచ్చాయి. ఒక్కసారిగా బిల్లులు పెరగడంతో గ్రామస్తులు ఆందోళణ చెందుతున్నారు. అదనంగా వచ్చిన బిల్లులు కట్టాలని విద్యుత్తు శాఖ అధికారులు ఒత్తిడి చేయడంతో పాటు ఇంటి యజమాలు లేని సమయం చూసి ఇంటికి వచ్చి అదనంగా వచ్చిన విద్యుత్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. బలవంతంగా పిల్లలు, వృద్దులు చేతిల్లో నోటీసులు పెట్టి వెళ్లిపోతున్నారు. ఇంటి పెద్ద లేకపోయినా పిల్లలు చేత బలవంతంగా సంతకాలు పెట్టించుకుని వెళ్లిపోతున్నారని వాపోతున్నారు. కాగా కొంత మంది నోటీసులు తీసుకోవడానికి నిరాకరించడంతో ఇంటి బయట గోడలకు నోటీసులు అతికించి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వేపాడలో ఆదివారం కరెంటు బిల్లులు అధికంగా రావడాన్ని నిరసిస్తూ మహిళలు ఆందోళన చేపట్టారు. ఉన్నటుండి కరెంటు బిల్లులు ఎంతుకు ఇంత ఎక్కువుగా వస్తున్నాయని జొన్నాడ కృష్ణమ్మ, జొన్నాడ లక్ష్మి, భోజనంకి మాధవి, నాగలక్ష్మి, సుర్ల ఈశ్వరమ్మ, ఆదపురెడ్డి పార్వతి, చీపురుపల్లి రాములు ప్రశ్నించారు. విద్యుత్‌శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అదనంగా వచ్చిన బిల్లులను రద్దు చేసి తిరిగి పాత పద్ధతిలో వారికి వచ్చే బిల్లులు మాదిరిగానే తక్కువ మొత్తంలో బిల్లులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి
మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గతం కంటే అదనంగా కరెంటు బిల్లులు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రూ.200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు కనీసం రూ. 500కు పైగా వస్తుందని ప్రజలు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా కరెంటు బిల్లులు పెంచితే సాధారణ ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రమాణ స్వీకారం చేసిన రోజే విద్యుత్తు బిల్లులు పూర్తిగా తగ్గించేస్తామన్న సిఎం జగన్మోహన్‌రెడ్డి మాటలు నీటిమూటలయ్యాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్తు భారాలను తగ్గించాలని కోరుతున్నారు.
ఒక నెల కరెంటు బిల్లు రూ. 4వేలు
విద్యుత్ మీటర్ వేసినప్పటి నుంచి ఇంత వరకూ రూ. 150 నుంచి రూ. 250 వరకే కరెంటు బిల్లు వచ్చేది. చాలా కాలంగా మా ఇంట్లో ఫ్రిడ్జ్, ఫ్యాను మిక్సీ ఉంది. ఈ నెల మాత్రం రూ. 4వేలు కరెంటు బిల్లు రావడం దారుణం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి ఇప్పుడు ఇష్టానుసారం ప్రజలపై భారం మోపడం, విద్యుత్ చార్జీలు పెంచడం రాక్షస పాలనకు నిదర్శనం.
భోజనంకి మాధవి, వేపాడ
నోటీసులు ఇచ్చారు
విద్యుత్తు శాఖ అధికారులు దొంగల్లా ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి అదనంగా వచ్చిన కరెంటు బిల్లులు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. తీసుకోవడానికి నిరాకరిస్తే ఇంటి గోడకు అతికించి వెళ్తామని హెచ్చరించారు. దీంతో ఏం చేయాలో తెలియక సంతకం పెట్టాను. ఇంట్లో ఏఏ సామాన్లు వాడుతున్నామో రాసుకుని వెళ్లారు. అదనంగా వచ్చిన కరెంటు బిల్లులు కట్టాలని బెదిరిస్తున్నారు.
నాగలక్ష్మి, గృహిణి, వేపాడ
ప్రభుత్వ ఆదేశాలు మేరకే..
ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ వినియోగదారులకు అదనపు చార్జీలు చెల్లించాలని నోటీసులు ఇచ్చాం. అంతే తప్ప నా సొంత నిర్ణయం కాదు. పెరిగిన అదనపు విద్యుత్ చార్జీలపై కొంతమంది వినియోగదారులు కోర్టుకు కూడా వెళ్లారు.
సూర్యనారాయణ, ఎలక్రికల్ ఎఇ, వేపాడ










