May 21,2023 20:30

నిరసన తెలియజేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీవీ, టిడిపి కార్యకర్తలు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
రాష్ట్రంలో కరెంట్‌ కోతలు కనపడడం లేదా అంటూ టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయనాగేశ్వర్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. కరెంట్‌ కోతల విషయంలో వైసిపి నాయకుల తీరుపై, సాక్షి పత్రిక కథనాలపై మండిపడ్డారు. ఆదివారం తన నివాసం ముందు ఇటీవల సాక్షి పత్రికలో ప్రచురితమైన కోతల్లేని కరెంట్‌ పేపర్‌ను చింపి తన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాక్షి పేపర్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి, వారి నాయకుల అబద్దాలను నిజాలుగా ప్రచారం చేసే టిష్యూ పేపర్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. సాక్షి పేపర్‌ పేరును నిస్సాక్షి పేపర్‌గా మార్చుకోవాలని సూచించారు. ఎన్నికల ముందు జగన్‌ రెడ్డి తాము అధికారంలోకి వచ్చాక కరెంట్‌ చార్జీలు పెంచబోమని, పూర్తిగా తగ్గిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు కరెంటు చార్జీలు పెంచారని తెలిపారు. రాష్ట్రంలో కరెంట్‌ కోతలతో, తీవ్ర ఉష్ణోగ్రతలతో, ఉక్కపోతలతో ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసి మిగులు విద్యుత్‌ ఉండేదని గుర్తు చేశారు.