Sep 27,2023 21:20

తిరుపతి కలెక్టరేట్‌ ఎదుట వామపక్షాల నిరసన

కరెంట్‌ ఛార్జీల భారం రద్దు చేయకుంటే...
ప్రభుత్వానికి షాక్‌ తప్పదు
బషీర్‌బాగ్‌ ఉద్యమ స్ఫూర్తి రగిలిస్తాం
జిల్లావ్యాప్తంగా వామపక్షాల నిరసనలు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో, చిత్తూరు అర్బన్‌, నగరి
పెంచిన కరెంటు చార్జీలు రద్దు చేయాలని, ప్రజా ఉద్యమాలపై నిర్బంధానికి నిరసనగా బుధవారం తిరుపతి కలెక్టరేట్‌ వద్ద వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ప్రజల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి 'షాక్‌' ఇస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌) జిల్లా కార్యదర్శులు వందవాసి నాగరాజు, పి. మురళి, ఆర్‌ హరికష్ణ మాట్లాడుతూ బిజెపి షరతులకు తలొగ్గి రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణలను అమలు చేస్తూ ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాలను వేయడాన్ని తప్పుపట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరెంట్‌ చార్జీలను పెంచితే వామపక్షాలు పెద్ద ఎత్తున మిలటెంట్‌ ఉద్యమాల చేపట్టి గద్దె దించారని గుర్తు చేశారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరల వల్ల, ఇంటి పన్నుల భారాలు వల్ల, చెత్త పన్ను భారాలు వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజా ఉద్యమాలపై తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని, రాష్ట్రంలో ప్రజా పరిపాలన లేదని విమర్శించారు. విద్యుత్‌ చార్జీల భారాలను తగ్గించకపోతే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని ప్రజలు ఇంటికి సాగనంపుతారని అన్నారు. విద్యుత్‌ చార్జీల భారాలు తగ్గించే వరకు రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, నాయకులు టి సుబ్రహ్మణ్యం, జయచంద్ర, సాయి లక్ష్మి, హేమలత, బుజ్జి, జయంతి, రాధా, వేణు, ముని రాజా, చిన్న, మల్లికార్జున రావు, ఎన్‌ డి శ్రీను, రమేషు, ఓవి రమణ, హరినాథ్‌, వెంకటేశు, పార్థసారధి, రఘు, శివానందం, సిపిఐ నాయకులు రాధాక్రిష్ణ, ఎండి రవి, శ్రీరాములు, రామకృష్ణ, సిపిఐఎంఎల్‌ న్యూడెమెక్రసీ నాయకులు అంకయ్య, వెంకటరత్నం పాల్గొన్నారు.
గూడూరులో... పెంచిన ట్రూఅప్‌ ఛార్జీలను తగ్గించాలని ఆర్డీవో కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించరాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోగి శివకుమార్‌, ఎస్‌.సురేష్‌, అడపాల ప్రసాద్‌, పుట్టా శంకరయ్య, ఎంబేటి చంద్రయ్య, ధనమ్మ, యశోదమ్మ పాల్గొన్నారు.
మరమగ్గాలకు 500యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి
నగరిలో.. మరమగ్గాలకు 500య ఊనిట్ల వరకు ఉచితంగా కరెంట్‌ ఇవ్వాలని, పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాయి. సిపిఎం, సిపిఐ కార్యదర్శులు పెరుమాళ్‌, కోదండయ్య మాట్లాడుతూ ట్రూఅప్‌, సర్‌ఛార్జీల పేరుతో వినియోగదారులపై భారాలు మోపడం సరికాదన్నారు. తమిళనాడులో వలెనే 500 యూనిట్లు వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గాలి భానుప్రకాష్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలన్‌, బాషా, మురళి, జగదీష్‌, దేశప్ప, వెంకటేష్‌, రాజేశ్వరి పాల్గొన్నారు.
మరో బషీర్‌బాగ్‌ ఉద్యమం తప్పదు
చిత్తూరు అర్బన్‌ : .రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కి విద్యుత్తు చార్జీలు విపరీతంగా పెంచి ప్రజలపై పెను భారం మోపడాన్ని నిరసిస్తూ బుధవారం సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి యస్‌.నాగరాజు అధ్యక్షతన వహించారు.. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా విద్యుత్‌ చార్జీలను పెంచబోనని హామీ ఇచ్చి ఇప్పుటికి ఐదుసార్లు పెంచారన్నారు. పేదలకు 200యూనిట్లు వరకు ఉచితమని చేసిన ప్రకటన సైతం బూటకమని అన్నారు.. రైతాంగానికి స్మార్ట్‌ మీటర్లు పెట్టి విద్యుత్‌ వినియోగం ఆడిట్‌ పేరున ఉచిత విద్యుత్‌ కు మంగళం పాడ బోతున్నారని విమర్శిం చారు. సిపియం జిల్లా కార్యదర్శ వాడ గంగరాజు మాట్లాడుతూ గతంలో విద్యుత్‌ చార్జీలను పెంచిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా కూల్చి వేశారో జగన్‌ గుర్తుంచు కోవాలని అన్నారు. నాడు బషీర్‌ బాగ్‌ అమరుల త్యాగం మరువ లేమని వారి స్పూర్తితో విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో సిపిఐ నాయకులు మణి, విజయ గౌరి, జయలక్ష్మి, రఘ, జయకుమారి, రమాదేవి, జమిలాబి, కుమారి, కోమల, లత, సిపిఎం నేతలు చైతన్య, ఓబుల్‌ రాజు, గిరిధర గుప్తా, భువనేశ్వరి, మురళి, జ్యోతి ఈశ్వరయ్య , జయంతి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి కలెక్టరేట్‌ ఎదుట వామపక్షాల నిరసన