Oct 21,2023 22:32

జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాపర్టీ షో ప్రారంభిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌



ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : నిర్మాణ రంగానికి సంబంధించి బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. విజయవాడ క్రెడారు (కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ) విజయవాడ ఛాప్టర్‌ ఆధ్వర్యంలో నగరంలోని ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోను శనివారం ఉదయం మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ద్వారా పట్టణీకరణ, పట్టణాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు నేడు ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారని అటువంటి సొంత ఇంటి నిర్మాణానికి క్రెడారు వంటి సంస్థలు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణాలను కట్టించి అందిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇంటికి అందించాలనే లక్ష్యంతో క్రెడారు సంస్థ బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను ఒకే చోటకు తీసుకువచ్చి ప్రాపర్టీ షో నిర్వహించి అందరికీ సహకారం అందిస్తుందన్నారు. అంతేకాకుండా బ్యాంకులు కూడా స్టాల్స్‌ను ఏర్పాటుచేసి ఇల్లును కావాలనుకునే వారికి లోన్‌ సదుపాయం కూడా కల్పిస్తుందని ఈ సందర్భంగా క్రెడారు విజయవాడ ఛాప్టర్‌ బృందానికి అభినందనలు తెలిపారు. క్రెడారు సంస్థ తన దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చిందని వాటిని పరిష్కరిస్తానని అన్నారు. క్రెడారు నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ జి.రామిరెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 230 నగరాల్లో, 21 రాష్ట్రాల్లో, 13500 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ప్రతి ఏటా నేషనల్‌ లెవన్‌లో అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని గత ఏడాది ఈజిప్టులో నిర్వహించామని మంచి స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌, క్రెడారు ఎపి అధ్యక్షులు వై.వి.రమణారావు, క్రెడారు ఎపి జనరల్‌ సెక్రటరీ బాయన శ్రీనివాస్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిజిఎం మనీష్‌ కుమార్‌, కె.రమేష్‌ అంకినీడు పాల్గొనగా తొలుత క్రెడారు విజయవాడ ఛాప్టర్‌ అధ్యక్షులు దాసరి రాంబాబు స్వాగతం పలుకగా విజయవాడ ఛాప్టర్‌ కార్యదర్శి వి.శ్రీదర్‌, తుమ్మల వంశీకృష్ణ, సి.హెచ్‌.సతీష్‌, కె.రఘురాం, జి.ఎస్‌. సాయిరాం పాల్గొన్నారు.