
శతజయంతి సభలో వక్తలు
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
శ్రామికవర్గ సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూనే సమాజంలోని వివిధ వర్గాలలో మానవతా విలువలను పెంపొందించేందుకు అమరజీవి కపర్ధీ కృషి చేశారని, కపర్ది ఆశయాలను అనుసరించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. కార్మికోద్యమ నిర్మాత, మార్క్సిస్టు మేధావి, ఆదర్శ కమ్యూనిస్టు అమరజీవి ఎంవిఎన్ కపర్ది శతజయంతి సభ మంగళవారం స్థానిక సుబ్బారావుపేటలో కపర్ది ఇంటి సమీపంలోని బుద్ధాల కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కతిక కళాపరిషత్తుల సమాఖ్య అధ్యక్షుడు బుద్ధాల వెంకట రామారావు మాట్లాడుతూ కపర్ది కార్మిక కమ్యూనిస్టు ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారని తెలిపారు. ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాధరాజు మాట్లాడుతూ కమ్యూనిస్టులు మాత్రమే నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాల్లో నీతి నిజాయతీలు పాటిస్తున్నారన్నారు. కమ్యూనిస్టుల వల్లే ప్రజల్లో ప్రశ్నించేతత్వం అలవడిందని తెలిపారు. రహస్య నాయకులను దాచి వారి ప్రాణాలను కాపాడిన కుటుంబాల్లో తమ కుటుంబం కూడా ఒకటని తెలిపారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్ర కార్మికోద్యమంలో శిఖర సమానులైన నేతల్లో కపర్ది ఒకరన్నారు. మార్క్సిస్టు మేధావి, 'దారిదీపం' మాసపత్రిక సంపాదకుడు డివివిఎస్.వర్మ మాట్లాడుతూ కార్మిక నేతలు చాలామంది ఉన్నా కపర్ది విలక్షణమైన నాయకుడని తెలిపారు. జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బొలిసెట్టి శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీస్ అధ్యక్షుడు యీతకోట తాతాజీ, వైసిపి యువనేత కొట్టు విశాల్ మాట్లాడారు. కార్మిక శ్రేయస్సు కోసం కపర్ది చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. మాజీ ఎంఎల్‌ఎ ఈలి నాని, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ గట్టిం మాణిక్యాలరావు, మానవత స్వచ్ఛంద సంస్థ విస్తరణ, అభివృద్ధి కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సాగిరాజు జానకిరామరాజు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మార్నీడి బాబ్జీ, టిడిపి పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు మాట్లాడారు.