ప్రజాశక్తి - ఆదోని
ఆదోనిలోని కొఠారి మిల్లు మూతబడి ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో కొఠారి మిల్లు కార్మికుల ఆకలి కేకలు వర్ణనాతీతమని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, మిల్లు యూనియన్ (సిఐటియు) నాయకులు ఈరన్న, ఉసేన్ తెలిపారు. సోమవారం ఆదోనిలోని కౌడల్ పేటకు చెందిన మిల్లు కార్మికుడు మంచానికి పరిమితమైన 78 ఏళ్ల వయస్సున్న వలీ, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారు మాట్లాడుతూ... వలీ కుటుంబ సభ్యులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని తెలిపారు. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందారని చెప్పారు. ఆదాయ వనరుల్లేక పూట గడవడమే కష్టంగా మారిందన్నారు. మిల్లు కార్మికుడు వలీ కనీసం తన కాల కృత్యాలను కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. 75 ఏళ్ల అతని భార్య అన్ని తానే చూసుకుంటూ బతుకుపై భరోసానిస్తున్నారని తెలిపారు. కోఠారి మిల్లుకు రూ.కోట్ల ఆస్తులున్నా కార్మికులు ఆకలి చావులు, అర్ధాకలితో అలమిటిస్తూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని కోర్టు తీర్పులు ఇచ్చినా యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా కొఠారి మిల్లు యాజమాన్యం కార్మికుల ఆకలి చావులను దృష్టిలో ఉంచుకొని కార్మికులకు బకాయిలు చెల్లించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
కార్మికుని పరామర్శిస్తున్న సిపిఎం నాయకులు










