Feb 09,2023 23:59

చిన్నారికి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ హిమబిందు

ప్రజాశక్తి -సీలేరు
గిరిజనులు జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి సోకిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకొని మెరుగైన వైద్యసేవలు పొందాలని దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి హిమబిందు అన్నారు. జీకే వీధి మండలం కొత్తూరు కోట గ్రామంలో బుధవారం సాయంత్రం జ్వరాలతో బాధపడుతున్న మూడేళ్ల బాలిక పాంగితులసీకి ఆశా కార్యకర్తలు కిట్లు ద్వారా రక్త పరీక్షలు నిర్వహించగా మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సమాచారం తెలుసుకున్న డాక్టర్‌ హిమబిందు గురువారం కొత్తూరు కోటలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది మాదిగ మల్లు గ్రామం వరకు వాహనంలో వెళ్లి అక్కడ నుంచి వాగులు దాటుకుంటూ కాలినడకన కొత్తూరుకోటకు చేరుకున్నారు. మలేరియా పాజిటివ్‌ వచ్చిన బాలిక కుటుంబ సభ్యులతో పాటు, గ్రామంలో ఉన్న గిరిజనులందరికీ వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ హిమబిందు మాట్లాడుతూ గ్రామంలో మలేరియా పాజిటివ్‌ కేసు నమోదైన బాలిక మినహా ఆదివాసీ గిరిజనులందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. గిరిజనులు కాచి చల్లార్చిన నీళ్లు తాగాలని, ప్రభుత్వం పంపిణీ చేసిన దోమతెరలను ప్రతి ఒక్కరూ ఉపయోగించాలని సూచించారు. గ్రామం మొత్తం ప్రతి ఇంటికి దోమల నివారణ మందుల్ని పిచికారి చేస్తామని తెలిపారు. ఎవరికైనా జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం గుమ్మరేవుల గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 54 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఈఓ పోతురాజు, హెచ్‌ఎస్‌లు గోవిందు, అప్పారావు, ఏఎన్‌ఎంలు మత్స్య కొండ, సీత పాల్గొన్నారు.