
ప్రజాశక్తి - గణపవరం
మండలంలో కొత్తపల్లి రహదారిని వెంటనే నిర్మించాలని తహశీల్దార్ పి.లక్ష్మి తెలిపారు. బుధవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి మండల పరిషత్ అధ్యక్షులు దండు వెంకటరామరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ మండలంలో నెల రోజులుగా జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం జయప్రదం అయ్యిందన్నారు. కొత్తపల్లిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్లడానికి కొత్తపల్లి రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో ఇబ్బందులు పడ్డామన్నారు. వెంటనే రోడ్డు నిర్మించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎఒ ప్రసాద్ మాట్లాడుతూ వర్షాల వల్ల 232 ఎకరాలు మునిగిపోయాయన్నారు. రైతులు ఇ-పంట నమోదు, ఇకెవైసి చేసుకోవాలని చెప్పారు. ఆర్‌డబ్ల్యూఎస్ జెఇ కె.హరినాథ్ రాజు మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో జనజీవని పనులు జరుగుతున్నట్లు చెప్పారు. పనుల నిమిత్తం రూ.3.50 కోట్లు మంజూరయ్యాయన్నారు. జెఇ శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదు గ్రామాల్లో పూర్తయిన ఆర్‌బికెలను ఆగస్టు 15న ప్రారంభిస్తామని తెలిపారు. ఎంఇఒ పి.శేషు మాట్లాడుతూ అమ్మఒడి మండలంలో 4,981 మందికి అందించినట్లు చెప్పారు. ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి మాట్లాడుతూ15వ ఆర్థిక సంఘం రూ.37 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఐసిడిఎస్ సూపర్ వైజర్ తులసి మాట్లాడారు. ఈ సమావేశంలో ఇఒపిఆర్‌డి పి.సత్యనారాయణ, సూర్యబలిజ రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ శెట్టి అనంతలక్ష్మి, మండల ఉపాధ్యక్షురాలు సలాది రత్నదుర్గాకుమారి, వైసిపి నాయకులు పాల్గొన్నారు.