జలపాతం వద్ద పర్యాటకులు
ప్రజాశక్తి-జి.మాడుగుల: మండలంలో కొత్తపల్లి జలపాతం ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం, క్రిస్మస్ పండగ కావడంతో పలు జిల్లాల నుండి పర్యాటకులు భారీగా తరలి వచ్చారు. ఆదివారం ఒక్క రోజు 2800 మంది కొత్తపల్లి జలపాతాన్ని సందర్శించినట్టు మేనేజర్ నవీన్, సూపర్వైజర్ వి.అభి తెలిపారు. ఇదిలా ఉండగా పర్యాటకులు అధిక స్థాయిలో వస్తుంగా ఇక్కడ సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేక పోవడం వల్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకోవడానికి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని పర్యాటకులు కోరారు.










