వంద అడుగుల విస్తరణకు అధికారుల సన్నాహాలు
ఇప్పటికే ప్రారంభమైన పనులు
రోడ్డుకిరువైపులా చెట్లు తొలగింపు
పనులకు సహకరించాలని అధికారుల వినతి
ప్రజాశక్తి -కొత్తకోట : భీమునిపట్నం -నర్సీపట్నం (బిఎన్ రోడ్డు )రహదారి విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇవ్వడంతో కొత్తకోటలో బిఎన్ రహదారికి ఇరువైపులా ఉన్న నివాసితుల్లో గుబులు మొదలైంది. ఎప్పటి నుంచో ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులుకు తీపి కబురు వచ్చింది. నర్సీపట్నం నుంచి సబ్బవరం వరకూ రహదారి విస్తరణకు ఆర్‌అండ్‌బి అధికారులు ఇప్పటికే సర్వే పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ప్రభుత్వం న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు(ఎన్‌డిబి) నుంచి రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు చేశారు. దీంతో విస్తరణ పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు ఇప్పటికే సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగానే రహదారికి రెండు వైపులా ఉన్న ఏళ్లనాటి చెట్లను ఇప్పటికే తొలగిస్తున్నారు. శిధిలమైన మదుముల నిర్మాణం చేపట్టారు . రహదారి విస్తరణకు సహకరించాలని పలు గ్రామాలలోఆర్‌అండ్‌బి శాఖ అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మేజర్ పంచాయతీ కొత్తకోటలో గత 20 ఏళ్లుగా రహదారి విస్తరణ జరగలేదు. 20 ఏళ్ళు కిందట ఆర్ అండ్ బి శాఖ అధికారులు రహదారి అభివృద్ధికి ం సర్వే చేసి మార్కింగ్ చేశారు. రావికమతం, మేడివాడ, దొండపూడి, రోలుగుంట గ్రామాలలో రెండు పర్యాయాలు విస్తరణ పనులు జరిగినా, కొత్తకోటలో మాత్రం పలు కారణాలతో ఇప్పటివరకు జరగలేదు. విస్తరణ పనులు ఇకపై జరగవు అంటూ వదంతులు వ్యాపించడంతో ధీమా పడిన గ్రామస్తులు, విస్తరణ కోసం మార్కింగ్ చేసినప్పటికీ పట్టించుకోకుండా రహదారికి ఇరువైపులా స్థలాలను కొనుగోలు చేసి కొత్తగా దుకాణ సముదాయలు , నూతన గృహాలు నిర్మాణాలను లక్షలు వెచ్చించి చేపట్టారు.
ఇప్పుడు పూర్వపు మార్కింగ్‌కు లోబడి కొత్తకోటలో వంద అడుగులు విస్తరణకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు..ఈ నేపథ్యంలోనే నర్సీపట్నం ఆర్‌అండ్‌బి డిఇఇ వేణుగోపాలరావు, మండల తహసీల్దార్ మహేశ్వరరావు ఇటీవల గ్రామ పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రహదారి విస్తరణ అవసరాన్ని వివరించి, గ్రామస్తులు సహకరించాలని కోరారు. అయితే 100 అడుగులు కాకుండా, కొత్తకోటలో 80 అడుగులకు పరిమితం చేయాలనీ స్థానికులు గ్రామ పెద్దల ద్వారా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పై ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు జరుగుతుందో చూడాలి.










