ప్రజాశక్తి -కొత్తకోట:రావికమతం మండలం మేజర్ పంచాయతీ కొత్తకోటలో రహదారి విస్తరణకు ప్రభుత్వ నిబంధనలు సడలించి, విస్తరణ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టికి కొత్తకోట గ్రామ సర్పంచ్ కోన లోవరాజు, ఉప సర్పంచ్ పందల దేవా తదితరులు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు మంగళవారం రావికమతం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో రహదారి విస్తరణతో గృహ యజమానులకు భారీ నష్టం జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనలను సడలించాలని కోరారు. గ్రామంలో సుమారు రూ. 7 కోట్ల నిధులతో చేపట్టిన జల జీవన్ మిషన్ తాగు నీటి పధకంలో భాగంగా రక్షిత తాగునీటి పధకం, మరో రెండు భారీ ట్యాంకర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు.గ్రామంలో పశు వైద్యశాలలో వైద్యాధికారితో పాటు తగు సిబ్బందిని తక్షణమే నియామకాలు చేపట్టాలన్నారు. స్పందించిన కలెక్టర్ రవి పఠాన్ శెట్టి మాట్లాడుతూ ఆర్‌అండ్‌బి అధికారులతో చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వరరావు, ఎంపిడిఓ వెంకన్న బాబు, పిఆర్ డిఇ ప్రసాద్ పాల్గొన్నారు.










