కొత్తగా ఏమీ లేదు..!
- ఫ్యామిలీ డాక్టర్‌లో 104 సేవలే
- జిల్లాలో 26 ప్రాంతాల్లో ప్రారంభం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
''ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకొచ్చాం..ఇంటి వద్దకే వైద్య సేవలు అందుతాయి..'' ఇదీ అధికారపక్ష నాయకులు ఊదరగొడుతోంది. కానీ ఆ విధానంలో కొత్తగా ఏమీ లేదు. గతంలో 104 ద్వారా అందుతున్న సేవలే ఈ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో అందుతాయి. జిల్లాలో 26 ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభించారు..
ప్రజలకు ఇంటి వద్దకే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకొచ్చామని అధికార పార్టీ నాయకులు, అధికారులు చెబుతున్నారు. ఈ విధానం ద్వారా 104 వాహనం ద్వారా వైద్యుడు, వైద్య సిబ్బంది రోజుకో గ్రామానికి వెళ్లి వైద్య సేవలను అందిస్తారు. వైద్యులను పరీక్షించి మందులను అందిస్తారు. పిహెచ్‌సి పరిధిలో ఇద్దరు వైద్యులను నియమించి ఒకరు పిహెచ్‌సిలో, మరొకరు ఈ 104 వాహనంలో గ్రామాలకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. నంద్యాల జిల్లాలో ప్రస్తుతం 26 ప్రాంతాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించారు. ఈ విధానం కొత్తగా తీసుకొచ్చిందేమీ కాదు. గతంలో నుంచే అమలవుతోంది. 104 పేరుతో గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించేవారు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో అదే విధంగా వైద్య సేవలను అందిస్తున్నారు. నూతన విధానం కోసం 26 మంది వైద్యులను కొత్తగా నియమించారు. ఈ విధానం కోసం కొత్తగా వైద్య సిబ్బందిని ఎవరినీ నియమించలేదు. గతంలో 104 వాహనంలో పని చేస్తున్న డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సేవలను యథావిధంగా ఉపయోగించుకుంటున్నారు. గతంలో 104 ద్వారా అందుతున్న సేవలకే పేరు మార్చి ప్రచార ఆర్భాటం ప్రదర్శించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫ్యామిలీ డాక్టర్ అంటే..
ఫ్యామిలీ డాక్టర్ అంటే కుటుంబ వైద్యుడు అని అర్థం. ఒక కుటుంబానికి ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆ వైద్యుడిని సంప్రదించాలి. ఆ వైద్యుడు వారికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఆ ఊరిలోనే నివాసం ఉండాలి. ఒక వేళ ఊరిలో లేకపోయినా ఫోన్ ద్వారా అయినా అందుబాటులో ఉండాలి. అవసరమైన వైద్య సలహాలు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్ విధానంలో వైద్యుడు గ్రామంలో అందుబాటులో ఉండరు. వాహనంలో వచ్చి వైద్య సేవలు అందించి వెళ్లిపోతారు.
గ్రామాల్లో వైద్య సేవలు
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా వైద్యులు గ్రామాల్లో వైద్య సేవలను అందిస్తారు. ప్రతి పిహెచ్‌సి పరిధిలో ఇద్దరు వైద్యులు ఉంటారు. ఒకరు పిహెచ్‌సిలో ఒపి చూస్తారు. మరొకరు 104 వాహనంలో వెళ్లి గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తారు. గ్రామంలో ఎవరైనా రాలేని పరిస్థితిలో ఉంటే వారి ఇంటికే వెళ్లి వైద్య సేవలను అందిస్తారు.
- వెంకటరమణ, డిఎంహెచ్‌ఒ.
ఆత్మకూరు మండలంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం కింద 104 వాహనాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం (ఫైల్)










