Sep 22,2023 00:11

కొత్త వ్యక్తులను నమ్మి మోసపోవద్దు: సిఐ

కొత్త వ్యక్తులను నమ్మి మోసపోవద్దు: సిఐ
ప్రజాశక్తి - గూడూరు: ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి కొత్త అవతారమెత్తి హై క్యాటగిరిలో ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికి లక్షలకు వసూల వసూలుకు పాల్పడుతున్న మాయగాళ్లను నమ్మి మోసపోవద్దని ప్రజలకు గూడూరు వన్‌ టౌన్‌ సర్కిల్‌ సిఐ జి హజరత్‌ బాబు పేర్కొన్నారు. గురువారం గూడూరు పట్టణంలో వన్‌ టౌన్‌ సిఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణాల్లో కొందరు అజ్ఞాత వ్యక్తులు పోలీస్‌, డాక్టర్లు, లేబర్‌ ఆఫీసర్లు, వివిధ ఉద్యోగాల పేరుతో ప్రజలను బురిడీ కొట్టించి అనేక మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలు అలాంటి వారిపై అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించి బెడద నుంచి రక్షించుకోవాలని సూచించారు. రోడ్లపై పోలీసుల మారువేషాల్లో వాహనాలను ఆపి కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై ఉక్కు పాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచి అజ్ఞాత వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసు శాఖ పలు జాగ్రత్తలు తీసుకుందని ఆయన తెలిపారు. అలాంటి వ్యక్తులను పట్టు కోవాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని ప్రజలు పోలీసులు సమన్వయంతో ఉన్నప్పుడే ఇలాంటి ఆకత్యాలను అరికట్ట వచ్చని తెలిపారు. గతంలో మారు వేషాల్లో వచ్చి పల్లెల్లో, పట్టణాల్లో , అజ్ఞాత వ్యక్తులు సంచరిస్తూ ఎన్నో దోపిడీలకు పాల్పడి ప్రజలను బురిడీ కొట్టించినసందర్భాలు ఉన్నాయని ముఖ్యంగా గొలుసు దొంగలు, ఇతర వాహనాల దొంగలు, రైల్వే డిఎస్పి మారువేషంలో ప్రజలను బెదిరించి మారువేషంలో వచ్చి లక్షల వసూళ్లకు పాల్పడి పోలీసులకు చిక్కిన సందర్భాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే 100 డయల్‌ యువర్‌ పోలీస్‌ నంబరుకు సమాచారం అందిస్తే అలాంటి వారిని వారి భరతం పడతామని ఆయన హెచ్చరించారు.