ప్రకతి మనకు ప్రసాదించిన అపురూప కానుకల్లో వనాలు ఒకటి. జీవులకు మొక్కల సౌందర్యం, ఆహ్లాదం, ఆరోగ్యం, ఔషధం, ఆహారం ప్రాణప్రదం. మొక్కలు కోకొల్లలు, మనం కనీవినీ ఎరుగని ఇంకా ఎన్నో మొక్కలు ఈ భూమి నిండా ఉన్నాయి. కొత్త ప్రాంతం మొక్కలు మరోచోటకి వస్తే అవి ఎప్పుడూ నవ్యతే. ప్రపంచంలో ఏ మారుమూలైనా ఓ కొత్త మొక్క ఊపిరి పోసుకుందంటే అది ఆగమేఘాల మీద కడియం నర్సరీల్లో వాలిపోవాల్సిందే! అందుకు నర్సరీ రైతులు ఎంత ఖర్చైనా వెనుకాడరు. ఇక్కడకు తీసుకొచ్చి, ఈ వాతావరణానికి తట్టుకునేట్టు చేసి, ఆ కొత్త మొక్కలను విరివిగా ఉత్పత్తి చేస్తారు. కడియం విరివనంలో బుర్రిలంక సప్తగిరి నర్సరీలో కొలువైన నవ్య వనాలను ఓసారి పలకరించేద్దాం! ఫిలిప్పీన్స్ నేరేడు, తెల్ల నేరేడు, అడవి మామిడి, తీయని వాటర్ ఆపిల్, సిమ్లా యాపిల్ రేగు, ఎర్ర గోంగూర, ఫ్లోరిడా మామిడి వంటి సరికొత్త రకాల మొక్కలు అబ్బురపరుస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ఎర్ర గోంగూర..
విటమిన్-ఎ, ఐరన్, పీచు పదార్థము, గోంగూరలో మెండుగా ఉంటాయని మనందరికీ తెలుసు. గోంగూర ఆకులు, కాడలు ఆకుపచ్చగా ఉంటాయి. కానీ ఈ వింత గోంగూర ఆపాదమస్తకంగా అంతా ఎరుపే. మామూలు గోంగూరతో పోలిస్తే ఎర్ర గోంగూరలో జిగురు, కాండ్రా కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే వీటి ఆకులను కూరలో కాకుండా వట్టిగానే తినవచ్చు. విదేశాల స్టార్ హోటల్స్‌లో సూప్స్‌తో పాటు, సలాడ్స్‌గానూ ఈ ఎర్ర గోంగూర ఆకులను వాడతారు. ఎర్ర గోంగూర తక్కువ కాలంలో పంట రావడమే కాకుండా.. దీంతో చేసిన కూర, పచ్చడి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. విత్తనాలు జల్లిన 40 రోజుల్లో మొక్క పెరిగి, గోంగూర కోతకు వస్తుంది. వీటి కాడలను తుంచి, మట్టిలో గుచ్చితే కొత్త మొక్కలు విచ్చుకుంటాయి.
అడవి మామిడి..
కాయలు చిన్నగా, కాస్త పుల్లగా, ఇంకాస్త వగరుగా ఉండేది అడవి మామిడి. ఆకులు కూడా చిన్నగా వేపాకులు పోలి ఉంటాయి. ఈ మామిడి ఎన్నో ఔషధాల గని. ఎన్నో ఆయుర్వేద మందులు తయారు చేయడానికి ఈ అడవి మామిడిని ఉపయోగిస్తారు. అడవుల్లో గిరిజనులు నేటికీ ఈ మామిడినే ఉపయోగిస్తుంటారు. ఈ పురాతన అడవి మామిడి మళ్లీ కొత్త రకమైన కడియం నర్సరీల్లో కనువిందు చేస్తోంది.
తెల్ల నేరేడు..
నేరేడు కాయలు నల్లగా ఉంటాయని మనకి తెలుసు. కానీ తెల్లగా, చాలా మధురంగా ఉంటుంది ఈ సరికొత్త తైవాన్ వెరైటీ. పొట్టి పొట్టి చెట్లు పుంఖాను పుంఖాలుగా కాయలు కాస్తోంది. నాటిన ఏడాదికే రెండు, మూడు అడుగుల పొడవు నుంచే ఈ తెల్ల నేరేడు కాయలు కాస్తాయి. ఈ మొక్క పెరట్లో ఉంటే వేసవి అంతా ఇంట్లో నేరేడు పళ్ళ వినోదమే. విదేశాల్లో ఈ పండ్ల గుజ్జు నుంచి ఐస్‌క్రీమ్‌లు తయారుచేస్తారు. తుమ్మెదలు, తూనీగలు వంటి పక్షులు, ఉడుతలు ఈ పండ్ల మొక్కల చుట్టూ నిరంతరం విహారం చేస్తుంటాయి. ప్రత్యేకమైన ఎరువులు అవసరం లేదు. దాదాపుగా అన్ని నేలల్లోనూ పెరుగుతాయి. సమానంగా నీటివనరు అందిస్తే సరిపోతుంది. కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. చిన్న మొక్కలైతే రూ 150, కాయలతో సిద్ధంగా ఉన్న మొక్కలైతే రూ 750 చొప్పున నర్సరీలో అమ్ముతున్నారు.
ఫ్లోరిడా మామిడి..
రంగు, ఆకారం, పరిమాణం, రుచి అన్నీ వినూత్నంగా ఉండేది ఫ్లోరిడా మామిడి. కాస్త పెద్ద పరిమాణంలో గుండ్రంగా ఉంటుంది. దీని శాస్త్రీయ నామం టామీ ఎట్కిన్స్. ఫ్లోరిడా మామిడి తొక్క మేలిమి ఛాయలో మెరుస్తూ ఉంటుంది. చిన్నపాటి మొక్కే పెద్దపెద్ద కాయలను గుత్తులు గుత్తులుగా కాస్తోంది. కాయి, పండు కూడా మహా మధురం. కాయ ఎక్కువ రోజులు పాడవకుండా నిలువ ఉండటం దీని ప్రత్యేకత. నాటిన 3 లేదా 4 సంవత్సరాలకి మొక్క కాపుకొస్తుంది. ఈ పండులో పీచు ఎక్కువగా ఉంటుంది. కాయి మహారుచిగా ఉండటంతో పురుగులు, చీడ దీని మీద దాడి చేస్తూ ఉంటాయి. అందువల్ల కాయలకు పిందెగా ఉన్నప్పుడే సంచులు తొడిగి, రక్షణ కల్పించాలి. ఈ మొక్కలకు సేంద్రియ ఎరువులు అందిస్తూ నిరంతరము నీటి వసతి కల్పించాలి. కుండీల్లోనూ నేల మీద కూడా పెంచుకోవచ్చు.
సిమ్లా రేగు..
చూడ్డానికి గుండ్రంగా ఆపిల్ పండు ఆకారములో, నిమ్మకాయ పరిమాణంలో చెట్టు నిండుగా కాయలు కాస్తుంది సిమ్లా యాపిల్ రేగు. 'ఏ చెట్టు కాయలు ఆ చెట్టుకి బరువా?' అంటారు. కానీ ఈ హైబ్రీడ్ రేగు విషయంలో మాత్రం ఆ నానుడి తప్పే. వేసవి వచ్చేసరికి విపరీతమైన కాపుతో కాయల బరువుకి కొమ్మలు ఒరిగి పోతుంటాయి. వాటికి కర్రలు నిలబెట్టి, దాపుగా కట్టాలి. కాయలు ఎంతో తీయగా ఉండే ఈ మొక్క థాయిలాండ్ దేశ రకం. కుండీల్లో కూడా చక్కగా పెరిగి, ఎంతో ఘనంగా కాపు కాస్తుంది. ఈ సరికొత్త రకానికి ముళ్ళు కూడా ఉండవు. పెద్దగా నీటివనరు కూడా అవసరం లేదు. అన్ని నేలల్లో పెరిగినప్పటికీ గరప, ఎరుపు ఇసుక, రాతి నేలల్లో బాగా పెరుగుతుంది. ఈ మొక్క కూడా 150 నుంచి 200 రూపాయల వరకు ధర ఉంటుంది.
థాయిలాండ్ జంబూఫలం..
వాటర్ యాపిల్స్‌గా పిలిచే ఈ సరికొత్త థాయిలాండ్ జంబూ ఫలం భలే రుచిగా ఉంటుంది. కాయలు మహా మధురం. కుండీల్లోనూ పెంచుకోవచ్చు. నాటిన ఏడాదికే కాపు మొదలవుతుంది. నేల మీద నాటితే కాస్త పెద్దగా పెరిగి, వేల సంఖ్యలో కాయలు కాస్తుంది. ఎరుపు, గోధుమ, తెలుపు రంగుల కలబోతతో కాస్త చిన్నగా ఉన్నా.. కాయలు నిగనిగలాడుతూ భలే కనువిందు చేస్తాయి.