Apr 10,2021 07:16

  తిరుమల తిరుపతి దేవస్థానములు (టిటిడి) సంస్థ మరోమారు అప్రతిష్ట మూటగట్టుకుంది. తిరుమలలో ఉండే అంజనాద్రియే ఆంజనేయుడి జన్మస్థానమని పేర్కొనడమే గాకుండా దీనిని శాసనబద్ధంగా, శాస్త్రీయంగా రుజువు చేస్తూ ఈ నెల 13న తెలుగువారి కొత్త సంవత్సరమైన ఉగాది పండుగ రోజున ప్రకటన చేస్తామని టిటిడి అధికారికంగా ప్రకటన విడుదల చేయడం విస్మయకరం. చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం ఒక అనామక సంస్థకు అత్యంత విలువైన స్థలాన్ని ఇచ్చేందుకు ఒప్పందం చేసుకొని ఆ తర్వాత అది వివాదాలకు దారితీయడంతో వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆధారాలతో సహా ఆంజనేయుని జన్మస్థానాన్ని తిరుమల అని నిరూపిస్తామంటూ టిటిడి పేర్కొనడం మరో వివాదమే.
   ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో తిరుమల, తిరుపతి ప్రధానమైనదనడంలో సందేహం లేదు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా యాత్రికులతో విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి కానుకల రూపంలో నిత్యం కోట్లాది రూపాయల సంపద పోగుబడుతుండటం కూడా తెలిసిందే. తిరుమల, తిరుపతి నలువైపులా అటు కొండపైనా, ఇటు దిగువనా.. అనేక ఆలయాలతో పాటు కోనేరులు (తీర్థాలు), సెలయేళ్లు, జలపాతాలు, కొండలు, కోనలతో ప్రకృతి రమణీయత ఉట్టిపడుతుంది. ప్రధాన క్షేత్రానికి దారితీసే ఏడు కొండలకు పురాణాలు, ఇతిహాసాల్లో ఉండే కథలు, వాటి రూపురేఖలు మేళవించి శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకట్రాదిగా పిలుచుకుంటారు. ఆంజనేయుడు తిరుమలలోనే పుట్టాడంటూ, ఏడుకొండల్లో ఒక్కటిగా ఉన్న అంజనాద్రియే ఆయన జన్మస్థానమని నిరూపించేందుకు టిటిడి ఏకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయడం ఎందుకు? కర్ణాటకలోని హంపీలో ఉన్న ఆంజనేయాద్రి అనే కొండ ఆంజనేయుడి జన్మస్థానంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసం తప్పు అని, తిరుమలలోని అంజనాద్రియే ఆంజనేయుడి జన్మస్థానమని రుజువు చేసేందుకు టిటిడి పరిశోధనలు చేస్తోందట. తిరుమలలో ఉండే ఆకాశ గంగ తీర్థంలో అంజనా దేవి పవిత్ర స్నానమాచరించడంతో ఆంజనేయుడికి జన్మనిచ్చిందని టిటిడి విశ్వాసం. ఒక ఆధ్యాత్మిక సంస్థగా దాని విశ్వాసాన్ని ఎవ్వరూ తప్పుబట్టరు. అయితే అది విశ్వాసం వరకే పరిమితం కావాలి మినహా దానికి శాస్త్రీయ ఆధారాలున్నాయని నిరూపిస్తామనడం తగదు.
   గతేడాది డిసెంబరులోనే ఇందుకోసం ఏర్పాటు చేసిన 'నిపుణుల కమిటీ'లో శ్రీవేంకటేశ్వర వేదిక్‌ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్‌ సన్నిధానం సుదర్శన శర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ మురళీధర శర్మ తదితరులున్నారు. వీరిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త మూర్తీ రెమిల్లా, పురాతత్వ పరిశోధన సంస్థ (ఆర్కియాలజీ) ఉప సంచాలకులు విజరుకుమార్‌ కూడా సభ్యులుగా ఉండటం దురదృష్టకరం. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడాన్ని పాలకుల కర్తవ్యంగా మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. శాస్త్రీయ ఆలోచనలకు బీజాలు వేయాల్సిన శాస్త్రవేత్తలు ఇలాంటి అశాస్త్రీయ క్రతువుల్లో భాగస్వాములు కావడం సిగ్గుచేటు. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక ప్రచారం హోరుగా జరుగుతున్న నేపథ్యంలో టిటిడి చేసిన ఈ ప్రకటన వెనుక రాజకీయ ప్రయోజనాలనూ తోసిపుచ్చలేము.
   తిరుమలకు తరలివచ్చే యాత్రికులకు సదుపాయాలు కల్పించడంతో పాటు స్థానికంగా విద్యా వైద్య సేవలందించే సంకల్పంతో పురుడుపోసుకున్న టిటిడి సంస్థ అనేక అమూల్యమైన సేవలనందించింది. తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి మహిళల విద్యకు పట్టం కట్టింది. శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌), ఎముకల చికిత్స, వైద్యం కోసం నివారణ కోసం 'బర్డ్స్‌' వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహిస్తూ విద్యా, వైద్య రంగాల్లో విశేష కృషి చేస్తోంది. అలాంటి ప్రఖ్యాత ధార్మిక సేవా సంస్థ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం విచారకరం. విశ్వాసం వేరు. విజ్ఞానం వేరు. విశ్వాసం వ్యక్తిగతమైనది. విజ్ఞానం సార్వజనీనమైనది. ఈ తేడాను గుర్తెరిగి వివాదాస్పద అంశాలు మాని, ప్రజా శ్రేయస్సు కోసం టిటిడి పాటుపడాలి.