Nov 22,2022 22:39

ధాన్యం కొనుగోలుపై రైతుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం
వాహనాల్లేక ఎక్కడి ధాన్యం అక్కడే
వెంటాడుతున్న వర్షాలు
రోడ్లపై, కల్లాల్లోనే ధాన్యపురాసులు
60 శాతంపైగా మాసూలు పూర్తి
ఇప్పటి వరకు ఏడుశాతమే కొనుగోలు
బిల్లుపై ట్రక్కుషీట్‌ ఇవ్వకపోడంతో రైతుల్లో అయోమయం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

               ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం తెచ్చిన కొత్తవిధానం తమ కొంపముంచిందంటూ రెండు జిల్లాల రైతాంగం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఆరుగాలం పండించిన పంటంతా కల్లాల్లోనూ, రోడ్లపైనే ఉండిపోవడం, అల్పపీడన ప్రభావంతో వెంటాడుతున్న వర్షాలు అన్నదాతకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వరిసాగులో ఉభయగోదావరి జిల్లాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలవ్యాప్తంగా ఖరీఫ్‌లో దాదాపు 4.50 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. మండలాల్లోని అధికారులు, రైతుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ దాదాపు 60 శాతం వరకూ మాసూలు పూర్తయ్యాయి. రైతులు ధాన్యం అరబెట్టి రోడ్లపైనా, కల్లాలోనే రాసులు చేసి ఉంచారు. ధాన్యం మాత్రం కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. గతంలో కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ కమీషన్‌ వ్యాపారులు కూడా ధాన్యం కొనుగోలు చేసేవారు. ప్రభుత్వం ఈసారి ధాన్యం కొనుగోలులో నూతన విధానం తెచ్చింది. కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే ధాన్యం కొనుగోలు జరగాలని నిర్ణయించింది. కానీ అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు రైతులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వతీరుతో వరిరైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏలూరు జిల్లాలో 3.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన ధాన్యం కేవలం 26 వేల టన్నులు మాత్రమే. అంటే ఏడుశాతం మాత్రమే ధాన్యం కొనుగోలు జరిగింది. మిగిలిన ధాన్యం ఎప్పటికి కొనుగోలు చేస్తారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ధాన్యం కొనుగోలు మందకొడిగానే సాగుతున్న పరిస్థితి ఉంది.
లారీల ఏర్పాటులో విఫలం
రైతులు ధాన్యం ఒబ్బిడిచేసి, ఆరబెట్టి సిద్ధంగా ఉంచినప్పటికీ రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయలేకపోతున్నారు. గతేడాది వరకూ రైతులు ధాన్యం ఆరబెట్టి రాసులు చేసిన తర్వాత వ్యాపారులే జట్టు, లారీలను పంపించి ధాన్యం కొనుగోలు చేసేవారు. కొత్తవిధానంలో అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. రైతులు కల్లాలో ధాన్యం అమ్ముకునే పరిస్థితి నుంచి లారీల కోసం, జట్టుకోసం, అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది, రైతు తనపొలం మాసూలు చేసి ధాన్యం అరబెట్టిన తర్వాత తొలుత రైతుభరోసా కేంద్రంలో కలవాలి. తర్వాత టెక్నికల్‌ అసిస్టెంట్‌, వాలంటీర్‌ వెళ్లి తేమశాతం పరిశీలిస్తారు. తర్వాత ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేసేది యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. రైతుకు ఎకరాకు 40 కిలోలు తూగే 65 సంచులు ఇస్తారు. ఎక్కువ ధాన్యం పండితే ఏంచేయాలో ఇప్పటికీ తేల్చలేదు. తర్వాత జట్టును రైతే చూసుకోవాలి. ఇవి పూర్తయిన తర్వాత రైతుభరోసా కేంద్రం అధికారులు లారీ పంపిస్తారు. ధాన్యం లోడు చేసి వేబ్రిడ్జిపై తూకం తూసిన తర్వాత ట్రక్కుషీట్‌ తీస్తారు. అప్పటి వరకూ ఏ మిల్లుకు ధాన్యం వెళ్తుందో కూడా రైతులకుగానీ, అధికారులకుగానీ తెలీదు. ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన రైతులకు జట్టు కూలీలు దొరుకుతున్నారు. తక్కువ విస్తీర్ణం సాగుచేసిన రైతులకు జట్టు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రైతులు ధాన్యం ఆరబెట్టి సిద్ధంగా ఉన్నారు. లారీలు సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. దీంతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. వర్షానికి ధాన్యం తడిసిపోతుందని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లారీలు ఏర్పాటు చేయడం, సంచులు అందించడంలో సరైన చర్యలు లేకపోవడంతో రైతులు నలిగిపోతున్నారు. దీంతో కొత్తవిధానం తమకొంప ముంచిందంటూ రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
జట్టు బిల్లు ఎప్పుడిస్తారు..!
గతంలో ధాన్యం విక్రయించడం వరకే రైతు బాధ్యత ఉండేది. సంచులు, జట్టు బిల్లు, లారీలు అన్నీ మిల్లర్లు చూసుకునేవారు. ఇప్పుడు అన్నీ రైతులే చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జట్టు బిల్లు, లారీ మామూలు రూ.1300 కలిపి మొత్తం 75 కిలోల బస్తాకు రూ.22 వరకూ ఖర్చవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఖర్చులను ప్రభుత్వం ఇస్తుందని చెబుతున్నప్పటికీ ఎప్పుడిస్తారనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ధాన్యం సొమ్ముకు ట్రక్కుషీటు తీస్తున్న అధికారులు, ఖర్చులకు సంబంధించి మాత్రం ట్రక్కుషీటు ఇవ్వడంలేదని రైతులు చెబుతున్నారు. దీంతో ఇస్తారా.. ఇవ్వరా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. దీనిపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సొంతంగా వాహనాలు పెట్టుకుని ధాన్యం తీసుకొచ్చే రైతులకు కిరాయి సొమ్ము ఎప్పుడిస్తారో కూడా రైతులకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
అధికారుల స్పందన కరువు
ధాన్యం కొనుగోలులో ఇబ్బందులతో రెండు జిల్లాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన ఆ శాఖ అధికారుల నుంచి సరైన స్పందన లేకుండా పోయింది. ఏలూరు జిల్లా కేంద్రంలోని వ్యవసాయశాఖ అదికారులుగానీ, పశ్చిమగోదావరి జిల్లా పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారులు గానీ ధాన్యం కొనుగోలుపై స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జిల్లాకలెక్టర్లు, జెసిలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ ఆ శాఖ అధికారుల్లో మాత్రం స్పందన లేకపోవడం ఏమిటో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇచ్చి రైతులకు భరోసా కల్పించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
లారీల్లేక ధాన్యం కొనగోలు జరగడం లేదు
లంకా వెంకటేశ్వరరావు, బొమ్మిడి
20 ఎకరాల్లో వరిసాగుచేశాను. ధాన్యం రాసులు చేసి ఉంచాం. ఒకపక్కవర్షం వెంటాడుతోంది. లారీలు లేకపోవడంతో ధాన్యం కొనుగోలు జరగడంలేదు. జట్టు సైతం దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీలు ఏర్పాటు చేయకపోతే రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు.
జట్టు బిల్లుపై స్పష్టత లేదు
దూడే కేశవ, రైతు, బొమ్మిడి
15 ఎకరాల్లో వరి సాగు చేశాను. మాసూలు చేసి ఆరబెట్టి 40 కిలోల బరువుగలవి 900 బస్తాలు విక్రయించాను. ధాన్యం సొమ్ముకు సంబంధించి ట్రక్కుషీటు ఇచ్చారు. జట్టు కూలీల ఖర్చు 75 కిలోల బస్తాకు రూ.22 వరకూ అయ్యింది. ట్రక్కుషీట్‌లో చూపలేదు. ఎవరిని అడిగినా సరైనా సమాధానం రావడం లేదు. లారీ మామూలు రూ.1300 సైతం రైతులే చెల్లిస్తున్నారు.