ప్రజాశక్తి - కలెక్టరేట్ : పాడైన వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రైతులు స్థానిక విద్యుత్ పంపిణీ సంస్థ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బివి రమణ, కరణం రవీంద్ర మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురయ్యాయని, వీటిని పునరుద్ధరించేందుకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుకు కనీసం చర్యలు చేపట్టకపోవడం విచారకరమని అన్నారు. గరుగుబిల్లి మండలంలో సుమారు 10 చోట్ల వ్యవసాయ విద్యుత్ ట్రాన్సాఫార్మర్లు కాలిపోయాయని, వీటి పునరుద్ధరణకు అనేక దఫాలుగా విద్యుత్ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జిల్లాస్థాయి అధికారుల వద్దకు వచ్చి రైతుల పరిస్థితిని తెలియజేస్తున్నామని అన్నారు. వర్షాభావ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తక్షణమే పంట పొలాలకు సాగు నీరందించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా సమస్య పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం విద్యుత్ శాఖ డిఇ ఆఫీసు సూపరింటెండెంట్‌కు వినతిని అందజేశారు. కార్యక్రమంలో రైతులు కరణం సింహాచలం, పోలినాయుడు, అప్పలస్వామి పాల్గొన్నారు.










