Nov 01,2022 23:45

డిపో మేనేజర్‌కు సమ్మె నోటీసు ఇస్తున్న హమాలీలు

ప్రజాశక్తి-అనకాపల్లి : ఐఎంఎఫ్‌ఎల్‌ బేవరేజెస్‌ హమాలీలకు అగ్రిమెంట్‌ ప్రకారం కొత్త వేతనాలు ఇవ్వాలని, లేకుంటే ఈనెల 15 నుంచి నిరవధిక సమ్మె తప్పదని ఎపిబిసిఎల్‌, ఐఎంఎఫ్‌ఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎల్‌ డిపో హమాలీల యూనియన్‌ జిల్లా ఎక్సైజ్‌ డిపో మేనేజర్‌ ఎన్‌వి రమణకు మంగళవారం సమ్మె నోటీసు అందజేసింది. ఈ సందర్భంగా యూనియన్‌ గౌరవ అధ్యక్షులు గంట శ్రీరామ్‌, అధ్యక్ష కార్యదర్శులు జీరు కనక రమణ, కరణం కొండలరావు మాట్లాడుతూ ఎగుమతి కూలి రేట్ల ఒప్పందం గతేడాది అక్టోబర్‌ నెలాఖరుతో ముగిసిందని, తర్వాత కొత్త కూలిరేట్ల ఒప్పందం జరిగి అమలు చేయాల్సి ఉన్నా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఈ ఏడాది జులై 18 నుంచి సమ్మెకు సిద్ధమైతే, మూడు నెలల గడువు కోరిందన్నారు .గడువు పూర్తయినా వేతన ఒప్పందం చేయకపోవడంతో అనివార్యంగా సమ్మెకు వెళుతున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు టి రాజు, బి శ్రీను, సూరి నాయుడు, రాజేష్‌, ఎస్‌ ప్రసాదు పాల్గొన్నారు.