
ప్రజాశక్తి- అనకాపల్లి
బదిలీల ప్రక్రియ పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ కొత్త స్థానాల్లో చేరిన ఉపాధ్యాయులకు జీతాలు అందక పోవడం అన్యాయమని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బారు అన్నారు. స్థానిక డిఇఓ కార్యాలయం ఎదుట శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ట్రాన్స్‌ఫర్ పొందిన ఉపాధ్యాయులను ఖజానా వెబ్ సైట్ లో ఆయా పాఠశాలల్లో ఉన్న ప్రస్తుత కేడర్ స్ట్రెంత్‌లో చేర్చాల్సి ఉందన్నారు. ఇందుకు ఉమ్మడి విశాఖ జిల్లా డీటీవో నుంచి మూడు జిల్లాల ఖజానా అధికారులకు కొత్త కేడర్ స్ట్రెంత్ వివరాలు లేఖ ద్వారా పంపినప్పటికీ, ఇంకా రాష్ట్ర స్థాయిలో డిటిఎ వద్ద ఈ ప్రక్రియ పెండింగ్లో ఉండడం శోచనీయమని వాపోయారు. దీనివల్ల ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు వెయ్యి మంది వరకూ జీతాలు రాని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఈ నెల 12వ తేదీ దాటితే బకాయి బిల్లులు పెట్టుకొనే అవకాశం కూడా ఉండదన్నారు. తత్ఫలితంగా అక్టోబర్ నెల వరకూ ఉపాధ్యాయులకు జీతాలు అందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని, వెంటనే కొత్త క్యాడర్ స్ట్రెంత్ వివరాలు ఖజానా వెబ్ సైట్ లో చేర్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చినబ్బారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ ఎల్లయ్యబాబు, సీనియర్ నాయకులు చిట్టయ్య, కామరాజు, శ్రీకాంత్, బాలరాజు, శంకర్, మామిడి అరుణ,రవి పాల్గొన్నారు.