రేషన్ పంపిణీలో ఇబ్బందులు తొలగిస్తున్నాం
ఎప్పటికప్పుడు కమిషనర్ పర్యవేక్షణ
పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి సత్యనారాయణరాజు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
కొత్తగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నూతన సంవత్సరంలో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి ఆర్‌ఎస్‌ఎస్.సత్యనారాయణరాజు తెలిపారు. జిల్లాలో రేషన్‌కార్డుల పంపిణీ విషయంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా రేషన్ పంపిణీ సక్రమంగా సాగేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది ఎదురైనా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఆయన ప్రజాశక్తి 'ముఖాముఖి'లో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
ప్రశ్న: కొత్త ఏడాదిలో ఎన్ని కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నారు?
కొత్త సంవత్సరంలో జిల్లాలో 2,419 కార్డులు కొత్తగా మంజూరయ్యాయి. వాటిని పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేశాం. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సచివాలయాల వ్యవస్థ ద్వారా వాటిని పరిశీలించి అందులో అర్హులైనవారికి కార్డులను పంపిణీ చేయడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కొత్త కార్డులను కూడా ఈ నెల 27వ తేదీలోగా ఇచ్చేందుకు ఏర్పాట్లను చేస్తున్నాం. 2020 ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచే సచివాలయాల ద్వారా రేషన్‌కార్డుల పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఆ విధంగానే పంపిణీ చేస్తున్నాం.
ప్రశ్న: కొత్తకార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందా? మార్పులు చేశారా?
కొంతకాలం క్రితం వరకూ కొత్తకార్డుల దరఖాస్తుల స్వీకరణ, జారీ నిరంతరాయంగా సాగేది. అయితే అందులో ప్రభుత్వం కొన్ని మార్పులను చేసింది. కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు మాత్రం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని పరిశీలించి ప్రతి ఆరు నెలలకోసారి కొత్త కార్డులను జారీ చేస్తున్నాం. దీనివల్ల నిజమైన అర్హులను గుర్తించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.
ప్రశ్న: జిల్లాలో ఎంతమందికి ఉచిత రేషన్ ఇస్తున్నారు?
జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన వారికి మాత్రం ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నాం. జాతీయ ఆహారభద్రతా ప్రమాణాల మేరకు ఈ పంపిణీ కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో అందరికీ ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నాం. నాన్ ఏజెన్సీలో మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకు పంపిణీ జరుగుతుంది. జిల్లావ్యాప్తంగా 6.39 లక్షల రేషన్‌కార్డులుండగా అందులో 2.10 లక్షల కార్డులకు ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం.
ప్రశ్న: రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఏమైనా గుర్తించారా?
జిల్లాలో ప్రస్తుతానికి రేషన్ పంపిణీ వ్యవస్థలో ఎక్కడా ఇబ్బందులు లేవు. ఎక్కడైనా చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి పరిష్కరిస్తున్నాం. 6.20 లక్షల యూనిట్ల బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నాం. కమిషనర్ ఈ విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.










