ప్రజాశక్తి - కలెక్టరేట్ : పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లిఖార్జున ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇండిస్టియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఔత్సాహిక పారిశ్రామివేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలని అన్నారు. ఈ నెల 11వ తేదీ నాటికి సింగిల్ డెస్క్ పోర్టల్‌లో 82 దరఖాస్తులురాగా అందులో 38 దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా ఆమోదించామని, ఒక దరఖాస్తును తిరస్కరించామని, మిగిలిన 43 ఎస్‌ఎల్‌ఎ పరిధిలో ఉన్నాయని వివరించారు. అప్లికేషన్లు పెండింగ్ లేకుండా చూడాలని పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారిని ఆదేశించారు. గాజువాకలో నిర్మిస్తున్న కార్మిక రాజ్య బీమా ఆసుపత్రికి సంబంధించి అన్ని అనుమతులనూ సత్వరం మంజూరు చేయాలని జివిఎంసి, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టి ఔత్సాహికులకు గతంలో కేటాయించి తిరిగి తీసుకున్న ఐలా భూములలో 72 మందికిగాను 54 మందికి తిరిగి కేటాయించామని తెలిపారు. మిగిలిన వాటిని కూడా పరిశీలించి ఇవ్వనున్నట్టు తెలిపారు. 25 పరిశ్రమలకు రూ.4 కోట్లు ప్రోత్సాహకాలు అందించినట్లు వెల్లడించారు. జివిఎంసి పరిధిలో ఉన్న పరిశ్రమల పార్కులలో ఘన వ్యర్థాల నిర్వహణపై తీసుకున్న చర్యల గురించి చర్చించారు. గాజువాక, ఆటోనగర్‌లలో నీటి సరఫరాను జివిఎంసి ఇంజినీరింగ్ సిబ్బంది వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. గాజువాకలోని ఆటోనగర్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులు త్వరగా ప్రారంభించాలని ఎపిఐఐసి, ఐలా అధికారులను ఆదేశించారు. జిల్లా ఎగుమతి కార్యాచరణ ప్రణాళిక 2022కుగానూ సముద్ర ఉత్పత్తులు, ఇంజినీరింగ్ గూడ్స్, హెల్త్ సర్వీసెస్ విభాగాలలో ఎంపిక చేసినట్లు తెలిపారు. మధురవాడ ఐటి సెజ్ ఉద్యోగులకు బస్సు సదుపాయం ఏర్పాటు చేయాలని ఆర్‌టిసి అధికారులను ఆదేశించారు. కొత్తగా పిఎస్‌యుల కోసం భూమి సేకరణ, అభివృద్ధికి ప్రతిపాదనలు చేయాలని తెలిపారు. ఎపిఐఐసికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రామలింగేశ్వరరాజు, ఎపిఐఐసి జెడ్‌ఎం రంగయ్య, ఐలా చైర్మన్ రఘు, ఎపి ట్రాన్స్‌కో, జివిఎంసి, వ్యవసాయ, మత్స్యశాఖ, అగ్ని మాపక, టౌన్ ప్లానింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.










