Nov 18,2022 22:28

ప్రజాశక్తి - ఏలూరు
             జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, కొత్తగా పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుపై పరిశీలనకు జిల్లాకు విచ్చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు ఉదిత ఖండపాల్‌, శివమ్‌ ఆరోరా శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ముసాయిదా ప్రచురణ పూర్తయ్యిందని, వాటిపై అభ్యంతరాల స్వీకరణకు డిసెంబర్‌ ఎనిమిదో తేదీ వరకు గడువు ఇచ్చామని తెలిపారు. అనంతరం ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా ముంపు ప్రాంతాల్లోని ఏడు పోలింగ్‌ స్టేషన్ల తొలగింపు, వాటి స్థానంలో కొత్తగా ఎనిమిది పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు అంశంపై ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్‌తో చర్చించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పోలవరం బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎవి.సత్యనారాయణమూర్తి, జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ ఝాన్సీరాణీ, రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయాధికారి ఎస్‌వి.మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.