ఆరు రుచులను ఆరుకాలాలను
అరవై వత్సరాల నుంచి
ఉగాది తెస్తూనే ఉంది
ఏటికేడాది శుభం జరగాలని
పంతుళ్ల దీవెనలతో..
ద్వాదశ రాశుల చక్రభ్రమణాలతో
నక్షత్ర గమనాల గణాంకాలే కానీ
సామాన్యుని వాశిలో దశ మారలేదు
కామపిశాచులకు స్వస్తి పలికే
మంచిరోజులు..
అబలపై జరిగే అరాచకాల రాహుకాలం
సమసిపోయే రక్షణాయనాలు
ప్రకృతి వైపరీత్యాలతో పాటు
మనిషి విపరీతపైత్యాల పులుపు తగ్గే
ఫలితాలనిచ్చే మాసాలు..
ఏ దుష్టగ్రహాల (వి)కారపు చూపులు
పడని పసిపాపలు
యథేచ్ఛగా వీధిలో ఆడుకోవచ్చని చెప్పే
వర్జ్యాలు లేని క్యాలెండర్లు..
మృగాళ్ల బుద్ధులు మారి బుద్ధుని బాటలో
నడవడానికి చేసే శాంతి పూజలు
తీయతేనెల తెలుగు పదాలు పలికే
చిన్నారుల నోట పలికే శుభతరుణాలు
దేశానికి ఆకలి తీర్చే అన్నదాతలకు
యమగండాలు లేని రోజులు
వాట్సాప్, ఫేస్‌బుక్ ఆంగ్ల శుభాకాంక్షలతో
ఛాటింగ్‌ల పరామర్శలు తప్ప
ఆత్మీయ స్పర్శలు ఎరుగని యువతలో
పొగరు వగరు తగ్గే అమృత ఘడియలు
అంతర్జాల బూటకపు పరిచయాలతో
సెల్ బందీలై సెల్ఫీ, టిక్‌టాక్‌ల ఉచ్చు నుంచి
తెలుగు సంస్కృతి, సంప్రదాయాల
ఉప్పందించే... ముహూర్తాలు
పర్యావరణ కాలుష్యకోరల్లో చిక్కి
విలవిలలాడే కోయిల గొంతులో
చేదు మరిపించి..
తీయదనం అందించే
మధురమైన వసంతం చిగురించే
శుభ తరుణాలు
కనబడని వైరస్‌తో
పరోక్ష యుద్ధం చేస్తున్నా..
కనిపించే వైరితో
ప్రత్యక్ష భీకర సంగ్రామం
చేస్తున్న విషమ పరిస్థితులకు
భీతి చెందిన ప్రజలు
ప్రశాంతమైన జీవితం గడిపే
ఉషోదయాలు
పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ
ఊసులు పంచుకునే
గోధూళి వేళలతో
శ్రీకరమైన శుభకృత్
నవ్య వత్సరానికి
ఆహ్వానం పలుకుతున్నా
కొత్తగా సరికొత్తగా రాసిన
నూతన పంచాంగ శ్రవణం వినాలనుకుంటున్నా!!
ములుగు లక్ష్మీ మైథిలి
94400 88482