- ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : కొత్త ఐటి నిబంధనలను సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ప్రాథమికంగా పాటించిందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇందులో భాగంగా ఆ సంస్థ శాశ్వత ప్రాతిపదికన చీఫ్ కంప్లయిన్స్ ఆఫీసర్ (సిసిఒ), రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ (ఆర్‌జిఒ), నోడల్ కాంటాక్టు పర్సన్ (ఎన్‌సిపి)లను నియమించిందని పేర్కొంది. నూతన ఐటి నిబంధనలను ట్విటర్ పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజా స్పందన నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రెండు వారాల్లోగా అఫిడవిట్ సమర్పించాలని న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది. మంగళవారం జరిగిన విచారణలో ట్విట్టర్ తరపు న్యాయవాది సంజన్ పూవయ్య వాదనలు వినిపించారు. కొత్త రూల్స్‌కు అనుగణంగా నియామకాలు చేపట్టామని కోర్టుకు తెలిపారు.