Aug 06,2023 21:09

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
సామాన్యుడు సైతం తక్కువ ఖర్చుతో ఎక్కువ కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం మన భారత రైల్వేకి మాత్రమే ఉందని, కొత్త జిల్లాలో రూ.73.05 కోట్లతో మూడు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం అభినందనీయమని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు అన్నారు. ప్రధాన నరేంద్ర మోడీ చేతుల మీదుగా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశ వ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధికి లాంఛనంగా శంకుస్థాపన వర్చువల్‌గా చేశారు. ఆదివారం భీమవరం టౌన్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని తిలకించడానికి శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు, శాసనసభ్యులు మంతెన రామ రాజు, రైల్వేశాఖ అధికారులు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోషేనురాజు మాట్లాడుతూ జిల్లాలో మూడు రైల్వే స్టేషన్ల అభివృద్ధి చాలా సంతోషించాల్సిన విషయం అన్నారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో రూ.73.05 కోట్లతో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం స్టేషన్లలో పార్కింగ్‌, విశ్రాంతి మందిరాలు, స్టాల్స్‌ ఆధునిక సౌకర్యాలతో సుందరవదనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాకు ప్రధాన కేంద్రం భీమవరం కావడంతో ప్రయాణికుల తాగిడి ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా స్టేషన్లు అభివృద్ధి చేయడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో మొత్తం 18 స్టేషన్లు ఎంపికకాగా అందులో పశ్చిమలో మూడు స్టేషన్లు ఉండటం విశేషం అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమృత్‌ భారత్‌లో భాగంగా స్టేషన్లు అభివృద్ధి శిలాఫలకాన్ని మోషేనురాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, డిఆర్‌ఒ కె.కృష్ణవేణి, మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ), బిజెపి నాయకులు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్‌ : స్థానిక రైల్వేస్టేషన్లో ఆదివారం జరిగిన అమృత్‌ భారత్‌ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు పాల్గొని ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్‌ పద్ధతిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న కార్యక్రమాన్ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నిర్వహిస్తున్న అమృత్‌ భారత్‌లో పశ్చిమగోదావరి జిల్లా దేశంలోనే రికార్డుగా నిలిచిందన్నారు. మరెక్కడా లేని విధంగా జిల్లాలో ఈ పథకం కింద మూడు రైల్వే స్టేషన్లు ఎంపికవడం మంచి తరుణం అన్నారు. రాష్ట్రంలో మొత్తం 18 స్టేషన్లు ఎంపికకాగా అందులో పశ్చిమలో మూడు స్టేషన్లు ఉండటం విశేషమన్నారు. ఈ మూడు స్టేషన్లకు సుమారు రూ.73.05 కోట్లు కేటాయించారని తెలిపారు. నరసాపురం స్టేషన్‌కు రూ.25.7 కోట్లు, తాడేపల్లిగూడెం స్టేషన్‌కు రూ.27.13 కోట్లు, భీమవరం స్టేషన్‌కు రూ.22.13 కోట్లు చొప్పున మంజూరయ్యాయన్నారు. ఇందుకు రాష్ట్రంలో 18 స్టేషన్లకు సుమారు రూ.454 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నారని తెలిపారు. కోనసీమ పశ్చిమగోదావరి జిల్లాను కలుపుతూ వశిష్ట వారధి వంతెన నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలో నరసాపురం రైల్వే స్టేషన్‌ రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి కవురు శ్రీను, రైల్వే అడ్వయిజరీ కమిటీ బోర్డు సభ్యులు జక్కంపూడి కుమార్‌ విజయవాడ, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బర్రె శ్రీవెంకటరమణ, ఎఎంసి ఛైర్మన్‌ గుబ్బల రాధాకృష్ణ పాల్గొన్నారు.