Jul 04,2021 10:14

    డోర్‌ బెల్‌ పదే పదే మోగడంతో నీరసంగా లేచి తలుపు తీసింది వసుంధర. పనిమనిషి రాములమ్మ 'ఏం రాత్రి ఎక్కువసేపు మేలుకున్నారా అమ్మా! పొద్దునే లేవలేదు?' అంటూ లోపలకు వచ్చింది. ఆమెకి సమాధానం చెప్పకుండా రెండు అడుగులు వేసి, సోఫాలో కూలబడిపోయింది వసుంధర. 'అమ్మగారూ.. అమ్మగారూ..' అంటూ కంగారుగా పిలిచింది రాములమ్మ. వసుంధర పలకలేదు.
రాములమ్మకు ఆందోళన పెరిగింది. గబ గబా మేడ మీదకు వెళ్లి, జయంతిని పిలుచుకు వచ్చింది. జయంతి వసుంధర చేయి పట్టుకుని చూసింది. వేడిగా ఉంది. బహుశా జ్వరం వచ్చి ఉంటుందని భావించింది.
రాములమ్మ సాయంతో వసుంధరని బెడ్‌రూమ్‌లోకి తీసుకొచ్చి, మంచం మీద పడుకోబెట్టింది.
'రాములమ్మా, నువ్వు ఇక్కడే వుండు. నేను పైకి వెళ్లి వస్తాను' అని మేడమీదకు వెళ్ళింది జయంతి. 'ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే అమ్మగారు ఇలా ఉన్నారేంటి?' అని బాధపడుతూ నేలమీద కూర్చుంది రాములమ్మ.
కొద్దిసేపటికే భర్తతో కలిసి వసుంధర గదిలోకి వచ్చింది జయంతి. థర్మామీటర్‌తో వసుంధరకి జ్వరం చూసింది. నూట రెండు డిగ్రీలు ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. రాములమ్మకేసి తిరిగి 'నువ్వు గిన్నెలు తోమేసి రా!' అంది జయంతి.
అలాగే అన్నట్టు తలూపి బయటకు వెళ్ళింది రాములమ్మ.
'ఏం చేదాం?' భార్య కేసి తిరిగి అన్నాడు శ్రీధర్‌.
'వాళ్ళ అమ్మాయికి ఫోన్‌ చేస్తాను' అని ఫోన్‌ చేసింది జయంతి. అవతలి నుంచి 'హలో' అనగానే 'రమణి గారూ, నేను జయంతిని మాట్లాడుతున్నాను. మీ అమ్మగారికి జ్వరం వచ్చింది. నూట రెండు వుంది. మీరు ఒకసారి రండి' అంది జయంతి.
రమణి రెండు క్షణాలు ఆగింది. తర్వాత 'మామూలు జ్వరమే అయివుంటుంది. పారాసిటమాల్‌ టాబ్లెట్‌ వెయ్యండి, తగ్గిపోతుంది. సాయంత్రం నాకు ఫోన్‌ చేయండి.' అని ఫోన్‌ పెట్టేసింది.
జయంతికి చాలా బాధ కలిగింది రమణి సమాధానానికి. భర్తని అక్కడే ఉండమని చెప్పి.. మేడ మీదకు వెళ్లి, పాలు వేడిచేసి, ఇంట్లో వున్న పారాసిటమాల్‌ టాబ్లెట్‌ తీసుకుని కిందకు వచ్చింది. అప్పటికి రాములమ్మ గిన్నెలు తోమి వచ్చింది. ఇద్దరూ కలిసి వసుంధరని లేపి కూర్చోబెట్టి టాబ్లెట్‌ వేసి, పాలు తాగించారు. వసుంధర కళ్ళు తెరిచి 'మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను' అని మళ్ళీ కళ్ళు మూసుకుంది.
జ్వర తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ఆమె మాట్లాడలేకపోతోంది. జాగ్రత్తగా ఆమెని పడుకోబెట్టి, 'నువ్వు ఇక్కడే వుండు. నేను అరగంటలో మళ్ళీ వస్తాను' అని రాములమ్మతో చెప్పి భర్తతో కలిసి వెళ్ళింది జయంతి.
టిఫిన్‌ తిని శ్రీధర్‌ బ్యాంకుకి వెళ్లిపోయాడు. తను కూడా టిఫిన్‌ తిని, కొడుకు చరణ్‌కి జాగ్రత్తలు చెప్పి ఫోన్‌, పుస్తకం తీసుకుని వసుంధర దగ్గరకు వచ్చింది జయంతి. రాములమ్మ సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. జయంతి కుర్చీ తెచ్చుకుని వసుంధర మంచం పక్కనే వేసుకుని, పుస్తకం తీసి చదువుకోసాగింది. గంట గడిచేసరికి వసుంధర బాధగా మూలగడం వినబడింది. జయంతి ఆమె నుదురు మీద చేయి వేసి చూసింది. బాగా వేడిగా వుంది. కర్చీఫ్‌ తడిపి తీసుకుని వచ్చి, వసుంధర నుదిటి మీద వేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు కొడుకు చరణ్‌కి ఫోన్‌ చేసి కిందకు రమ్మనమని చెప్పి, వాడిని వసుంధర దగ్గర కాపలాగా ఉంచింది. తను పైకి వెళ్లి భోజనం చేసి వచ్చింది జయంతి. మరలా ఇంకోసారి వసుంధరకి పాలు తాగించింది. భర్తకు ఫోన్‌ చేసి 'మేడంకి జ్వరం తగ్గలేదు. తెలిసున్న డాక్టర్‌ ఎవరినైనా తీసుకొస్తారా?' అని అడిగింది. అలాగే అన్నాడు శ్రీధర్‌.
సాయంత్రం రమణికి ఫోన్‌ చేసి 'మీ అమ్మగారికి జ్వరం తగ్గలేదు. ఒకసారి రండి దగ్గరే కదా!' అంది జయంతి. 'మీరు కంగారుపడి, మమ్మల్ని కంగారు పెట్టకండి. ఇవాళ కాకపొతే, రేపు తగ్గుతుంది జ్వరం. మా అబ్బాయికి ఆన్‌లైన్‌ క్లాసులు. వాడిని ఒక్కడినే వదిలి రావడానికి కుదరదు. రాత్రి పనిమనిషిని తోడు పడుకోమని చెప్పండి!' అని ఫోన్‌ పెట్టేసింది రమణి.
ఆమె తీరుకి విస్తుపోయింది జయంతి. రమణి ఇంటి దగ్గర నుంచి ఇక్కడకు రావడానికి ఇరవై నిముషాల సమయం పడుతుంది. తల్లిని చూడటానికి ఆమాత్రం తీరిక కూడా లేదని రమణి చెప్పడం ఆమెని బాధించింది. వసుంధర కొడుకు మహేష్‌ ఢిల్లీలో ఉంటాడు. తల్లిని చూడటానికి ఏడాది కోసారి వస్తాడు. ఒక పూట వుండి, వెళ్ళిపోతాడు. వసుంధర భర్త మురళీధర్‌ చనిపోయి మూడేళ్ళు గడిచాయి. అప్పటి నుంచి వసుంధర ఒక్కతే ఉంటోంది. మేడ మీద వాటాలో నాలుగు సంవత్సరాల నుండి శ్రీధర్‌, జయంతి ఉంటున్నారు. వాళ్లు అద్దెకు వచ్చేటప్పటికి మురళీధర్‌ బతికే ఉన్నాడు.
సాయంత్రం బ్యాంకు నుంచి వచ్చేటప్పుడు తెలుసున్న డాక్టర్‌ని తీసుకువచ్చి వసుంధరని చూపించాడు శ్రీధర్‌. వైరల్‌ ఫీవర్‌ అని, తగ్గడానికి రెండు మూడు రోజులు పడుతుందని చెప్పి, ఇంజక్షన్‌ చేసి, మందులు రాసిచ్చారు డాక్టర్‌. శ్రీధర్‌ మందులు తెచ్చి, జయంతికి ఇచ్చాడు. శ్రీధర్‌ని వసుంధరకు కాపలాగా ఉంచి, పైకి వెళ్లి వంట చేసి వచ్చింది జయంతి. సాయంత్రం వస్తానన్న రాములమ్మ రాలేదు.
జయంతే టాబ్లెట్లు వేయడం, పాలు తాగించడం చేసింది. రాత్రి భోజనం చేసి వచ్చి, వసుంధర మంచం పక్కనే చాప వేసుకుని, పడుకుంది జయంతి.

                                                                                  ***

   మర్నాడు ఉదయం రమణి, జయంతికి ఫోన్‌ చేసింది. 'మా అమ్మకి ఎలా ఉంది?' అని అడిగింది. 'ఇంకా తగ్గలేదు' అని చెప్పింది జయంతి.
'మీరు మా అమ్మ జ్వరం గురించి కంగారుపడి, కార్పొరేట్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్ళకండి. వాళ్లు లక్షలు.. లక్షలు.. బిల్లు వేస్తారు. మీకు నేను వాట్సప్‌లో మెసేజ్‌ పంపాను. ఆ లిస్టు ప్రకారం మందులు వాడండి. నేను వీలు చూసుకుని సాయంత్రం వస్తాను!' అని ఫోన్‌ పెట్టేసింది రమణి.
ఆమె ధోరణికి మరోసారి విస్తుపోయింది జయంతి. వాట్సప్‌లో రమణి పంపిన మెసేజ్‌ చూసింది. అది కరోన పాజిటివ్‌ వచ్చిన వారు వాడవలసిన మందుల లిస్టు. చిన్నగా నిట్టూర్చింది జయంతి.
జయంతి, శ్రీధర్‌, చరణ్‌ వంతుల వారీగా వసుంధరకి కాపలాగా ఉంటూ మూడు రోజులు ఆమెని కనిపెట్టుకుని, ఉంటూ సేవలు చేశారు. నాల్గవరోజుకి వసుంధర తేరుకుంది. మూడురోజులూ జయంతే రాత్రిళ్లు ఆమె గదిలోనే పడుకోవడం, బాత్‌రూమ్‌కి చేయి పట్టుకుని, తీసుకుని వెళ్ళడం చూసి వసుంధర చలించిపోయింది.
తన కన్న కూతురు ఈ మూడు రోజుల్లో కనీసం తనని చూడటానికీ రాలేదు. వస్తే ఒకవేళ ఆమెకి రోగం వస్తుందేమోనని భయం. కానీ జయంతి, కన్న కూతురు కన్నా ఎక్కువగా సేవలు చేసింది. తన రోగం గురించి భయపడలేదు. ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో ప్రవర్తించి, తనని మళ్ళీ మనిషిని చేసింది. మానవత్వం చూపింది. మనసున్న మనిషిలా వ్యవహరించింది. జయంతిలో తన అమ్మను చూసుకుంది వసుంధర. గ్లాసులో పాలు చల్లారపెడుతున్న జయంతిని దగ్గరగా రమ్మనమని పిలిచింది.
ఆమె రెండు చేతులూ పట్టుకుని కళ్ళకద్దుకుంది వసుంధర. చప్పున తన చేతులు వెనక్కి తీసుకుంది జయంతి.
'మేడం, మీరు పెద్దవారు. ఇలా చేసి నన్ను చిన్నబుచ్చవద్దు!' అంది వినయంగా.
'జయంతి, నేను వయసులో పెద్ద కావచ్చు. కానీ మానవత్వం చూపించి, మా అమ్మలా నన్ను కంటికి రెప్పలా కాపాడి, నా ప్రాణాలు నిలబెట్టావ్‌. నీ పరోపకారానికి, నీ విశాల హృదయానికి, నా కృతజ్ఞతలు. కన్న కూతురు నన్ను చూడటానికి రాలేదు, కొడుకు కనీసం 'ఎలా ఉన్నావు అమ్మా?' అని ఫోన్‌ కూడా చేయలేదు. రక్తబంధం కన్నా మానవత్వం మిన్న అని మీ కుటుంబం అంతా నిరూపించారు.
'మీకు నేను కృతజ్ఞతలు చెప్పడం కూడా తప్పు అంటావా?' బాధగా అంది వసుంధర. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదలాడింది. అది చూసి జయంతి, ఆమె చేతి మీద చేయివేసి, అనునయించింది.
'మేడం ఈ రోజు మీకు భోజనం పెట్టమన్నారు డాక్టర్‌ గారు. బీరకాయ కూర వండి, చారు పెడదామనుకున్నా. ఏమైనా మార్చమంటారా?' నవ్వుతూ అడిగింది జయంతి.
'ఏం మార్చక్కరలేదు. నువ్వు అనుకున్నట్టే చెయ్యి' అంది వసుంధర. జయంతి ఇచ్చిన పాలు తాగి గ్లాసు టీపాయి మీద పెట్టింది. గ్లాసు తీసుకుని వంట చేయడానికి మేడ మీదకి వెళ్ళింది జయంతి.
శ్రీధర్‌ బ్యాంకుకి వెళ్లేముందు వసుంధర దగ్గరకు వచ్చి, పలకరించి వెళ్ళాడు.
రెండు రోజులు గడిచేసరికి వసుంధర లేచి, తన పనులు తను చేసుకోసాగింది. రమణి ఒకరోజు తల్లికి ఫోన్‌ చేసి, 'ఒంట్లో ఎలా ఉంది?' అని అడిగింది.
'బాగానే ఉంది, జ్వరం తగ్గింది!' అని చెప్పింది వసుంధర.
'ఆ.. నీకు వాడవలసిన మందుల గురించి జయంతికి నేనే చెప్పాను. ఆవిడకి కొంచెం కంగారు ఎక్కువనుకుంటాను. సరే ఏమైతేనే.. నీకు తగ్గిపోయిందిగా.. జాగ్రత్తగా ఉండు. ఒక వారం పోయాక వస్తాను. బిజీగా ఉన్నాను' అని ఫోన్‌ పెట్టేసింది రమణి.
కూతురు మాటలకు నవ్వుకుంది వసుంధర. అంటే తనకు కరోనా వచ్చిందని భావిస్తోందన్న మాట. అందుకే వారం రోజులకి గానీ తన దగ్గరకు రాదన్నమాట.
'మనుషులు ఎలా మారిపోతున్నారు. ఎవరి ప్రాణం వారికి తీపి అయిందా? కన్న తల్లితండ్రుల్ని కూడా చూడరన్న మాట. మరి జయంతికి ప్రాణ భయం లేదా? తనకి ఎందుకు సేవలు చేసింది? మొత్తం ఆమె కుటుంబం అంతా తన ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపారు? తను వారికి బంధువు కాదే? మరి.. అంటే వారు మనసున్న మనుషులు. మానవత్వం మూర్తీభవించిన మహనీయులు. అదీ తన కన్నబిడ్డలకు వారికీ తేడా!' అనుకుంది.
వసుంధర పరి పరి విధాల అలోచించి, ఒక నిర్ణయానికి వచ్చింది. ఫోన్‌ తీసుకుని ఇద్దరు, ముగ్గురికి ఫోన్‌ చేసి మాట్లాడింది.
మర్నాడు ఒకాయన కార్లో వచ్చి, వసుంధరని కలిసి మాట్లాడాడు. ఆ సాయంత్రం ఇద్దరు మోటార్‌ సైకిల్‌ మీద వచ్చి, ఆమెతో మాట్లాడి వెళ్ళడం జయంతి మేడ మీద నుంచి చూసింది. వసుంధర రాష్ట్ర ప్రభుత్వంలో గెజిటెడ్‌ ఆఫీసర్‌గా పనిచేసి, రిటైర్‌ అయ్యింది. ఆమెతో పనిచేసిన వాళ్ళు ఎవరో వస్తున్నారని భావించింది. రోజూ ఎవరో ఒకరిద్దరు రావడం, వసుంధరతో మాట్లాడి వెళ్ళడం జరుగుతోంది.
వారం రోజులు గడిచాయి. వసుంధర ఆరోగ్యం కుదుటపడింది. జయంతికి ఫోన్‌ చేసి 'ఈ రోజు కొంచెం పని ఉండి బయటకు వెళ్తున్నాను. ఆలస్యం అవుతుంది. నువ్వు కంగారు పడకు' అంది నవ్వుతూ వసుంధర.
'అలాగే మేడం' అంది జయంతి.
ఉదయం వెళ్ళిన వసుంధర మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చింది. సాయంత్రం జయంతిని ఒకసారి రమ్మనమని ఫోన్‌ చేసింది. ఐదు నిముషాల్లో కిందకు వచ్చింది జయంతి.
'జయంతీ, రేపు మీవారు బ్యాంకుకి వెళ్ళాకా మనం ఇద్దరం ఒక చోటికి వెళ్ళాలి. వస్తావా?' అడిగింది వసుంధర.
'అలాగే తప్పకుండా వస్తాను మేడం' అంది జయంతి. కాసేపు కబుర్లు చెప్పుకున్నాకా మేడమీదకు వెళ్ళిపోయింది జయంతి.
మర్నాడు ఉదయం పది గంటలకు వసుంధర, జయంతిని తీసుకుని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్ళింది. ఆఫీసర్‌ కాత్యాయిని వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది.
తర్వాత బెల్‌ కొట్టి ఒకామెని పిలిచి 'నిన్న నీకు చెప్పిన ఇద్దరు పిల్లల్ని తీసుకురా' అంది కాత్యాయిని. కొద్దిసేపటికి ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకు వచ్చింది ఆవిడ.
'మేడం, ఈ పెద్దమ్మాయి పేరు తేజస్విని, వయసు ఏడేళ్లు, చిన్న అమ్మాయి పేరు కిరణ్మయి, వయసు ఆరేళ్లు. గత నెలలోనే వీరి తల్లిదండ్రులు కోవిడ్‌ బారినపడి మరణించారు. వీరి బాధ్యత తీసుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం మా దగ్గరే ఉంటున్నారు. వీళ్లు మీకు ఓకేనా?' నవ్వుతూ అడిగింది కాత్యాయిని. పిల్లలిద్దరూ చక్కగా ఉన్నారు. వాళ్లు ఇద్దరికీ తను తెచ్చిన చాక్లెట్‌ బార్లు ఇచ్చింది వసుంధర. చాక్లెట్లు తీసుకుని, 'థాంక్స్‌ మేడం' అన్నారు పిల్లలు.
'మేడం కాదు. ''అమ్మా!'' అని పిలవాలి. మిమ్మల్ని ఇద్దర్నీ పెంచుకుంటారు. బాగా చూసుకుంటారు. పెద్ద చదువులు చెప్పిస్తారు. సరేనా?!' అంది నవ్వుతూ కాత్యాయిని.
పిల్లలు ఇద్దరూ అంగీకారంగా తలూపారు.
'సుశీలా! వాళ్ళ బట్టలు బ్యాగులో సర్ది తీసుకురా!' అని పిల్లలు ఇద్దర్నీ ఆమెతో పంపించింది కాత్యాయిని.
ఈలోగా దత్తతకి కావాల్సిన పేపర్ల మీద వసుంధర చేత సంతకాలు తీసుకుంది కాత్యాయిని. కాసేపటికి సుశీల పిల్లలు ఇద్దర్నీ తీసుకొచ్చింది. ఆటోలో పిల్లల్ని తీసుకుని, జయంతితో కలిసి ఇంటికి వచ్చింది వసుంధర.
పిల్లలు ఇద్దరికీ వసుంధర ఇల్లు బాగా నచ్చింది. ఇంటిముందు పూల మొక్కలు, చిన్న ఉయ్యాల వారిని బాగా ఆకర్షించాయి. జయంతిని వారికి పరిచయం చేసింది. '
ఈమె జయంతి ఆంటీ. మన మేడమీద ఉంటారు. వాళ్ళ ఇంట్లో కూడా చాలా బొమ్మలు ఉన్నాయి. మీరు ఎప్పుడు వెళ్లి ఆడుకున్నా ఆంటీ కాదనరు. సరేనా' నవ్వుతూ అంది వసుంధర.
బొమ్మలన్న మాట వినగానే పిల్లల మొహాలు సంతోషంతో వెలిగాయి. రెండు రోజులకే తేజస్విని, కిరణ్మయి వసుంధరకి బాగా చేరువయ్యారు.
''అమ్మా.. అమ్మా..'' అంటూ పిలుస్తుంటే వసుంధర హృదయం పులకించిపోయింది.
రెండు నెలలు గడిచాయి. వసుంధర, జయంతి చెప్పే కబుర్లు, కథలు వింటూ పిల్లలు వారి బాధలు చాలా వరకూ మరిచిపోయారు. ఒకరోజు రాత్రి పిల్లలు భోజనం చేసి పడుకున్నాక జయంతిని రమ్మనమని ఫోన్‌ చేసింది వసుంధర. ఐదు నిముషాల్లో జయంతి వచ్చింది. ఇద్దరూ హాలులో కూర్చున్నారు. 'జయంతీ, ఇన్నాళ్లు నేను నాకోసం, నా కుటుంబం కోసం జీవించాను. ఇక నుండీ సమాజం కోసం జీవించాలని నిర్ణయించుకున్నాను. మా వారు ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేసి, రిటైర్‌ అయ్యారు. నేను గవర్నమెంట్‌ ఆఫీసర్‌గా పనిచేసి, రిటైర్‌ అయ్యాను. అబ్బాయికి, అమ్మాయికి మంచి చదువులు చెప్పించి, వారికి తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాం. మా వారు రిటైర్‌ అయ్యాక పిల్లలకు చెరో ఫ్లాట్‌ కొని ఇచ్చారు. నేను నా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ నుంచి చెరో ఇరవై లక్షలు ఇచ్చాను. మా వారు చనిపోయాక నన్ను ఈ ఇంటికి పరిమితం చేశారే కానీ, వారి ఇంట్లో ఉండటానికి అంగీకరించలేదు. మొన్న జ్వరం వచ్చినప్పుడు నా పట్ల నా పిల్లలు ఎలా ప్రవర్తించారో నువ్వే చూశావు. వారికి నా ఆస్తి కావాలి. నేను అక్కరలేదు. అందుకే తేజస్విని, కిరణ్మయిని దత్తత తీసుకున్నాను. నాకు యాభైౖవేలు పెన్షన్‌ వస్తోంది. వాళ్ళను పెంచడానికి ఏ విధమైన ఇబ్బందీ ఉండదు.
మా పిల్లలకు తెలియకుండా చాలా ఏళ్ళ క్రితం ఒక స్థలం కొన్నాను. నా డెబ్భై ఏట వారికి సర్ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకున్నాను. కానీ నా నిర్ణయం మార్చుకుని, ఆ స్థలం అరవై లక్షలకు అమ్మేశాను. తేజస్విని, కిరణ్మయి పేరు మీద ఈ డబ్బు డిపాజిట్‌ చేశాను. వారికి నిన్ను గార్డియన్‌గా నియమించాను.' అని వసుంధర డిపాజిట్‌ పేపర్లు జయంతికి చూపించింది.
జయంతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. 'మేడం, ఇప్పుడు ఇవన్నీ ఏమిటి? నా మీద ఇంత భారం పెడుతున్నారు!' అంది ఆందోళనగా. జయంతి భుజం మీద చేయి వేసింది వసుంధర.
'ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పలేకపోతున్నాం, నా వయసు అరవై ఐదు. నాకు జరగరానిది జరిగితే తేజస్విని, కిరణ్మయి చదువు ఆగిపోకూడదు. అందుకే ఈ ఏర్పాటు. నువ్వు సమర్ధు రాలివి. వారిని తీర్చిదిద్దే ప్రజ్ఞాశాలివి. అనాథలైన ఆ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న నా కల మధ్యలో ఆగిపోకూడదు. వారికి ఒక కొత్త జీవితం ఇవ్వాలి. వారు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలి. నువ్వు నాకు సహకరించాలి. తప్పదు'. అకస్మాత్తుగా వసుంధర కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.
జయంతి ఆమె కన్నీళ్ళు తుడిచింది. 'మేడం, మీరు చేసే ఈ మహత్కార్యంలో నేనూ పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు వారి ఉన్నతిని మీ కళ్ళతోనే చూస్తారు. ఆ నమ్మకం నాకుంది' అంది వసుంధర చేతిలో చేయి వేసి.
జయంతి భరోసాకి వసుంధర కళ్లు సంతోషంగా మెరిశాయి. ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది.

ఏం.ఆర్‌.వి. సత్యనారాయణ మూర్తి
98486 63735