ప్రజాశక్తి- అరకులోయ /అరకు రూరల్ : అనుక్షణం కళ్ళముందే తిరుగుతూ ఉండే వార్డెన్ దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందడం పై కొత్త భల్లుగుడ హాస్టల్ శోకసద్రమైంది. అటు విద్యార్థుల్లో, ఇటు బంధువుల అర్థనాధాలతో నిండి పోయింది. ఎటు చూసినా గుండె పగిలేలా విలపించారు. బంధువులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. పాఠశాల ప్రాంగణం అంతా జన సందోహంతో నిండిపోయింది.. కొత్త భల్లుగుడ హాస్టల్‌లో వార్డెన్ దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారన్న విషయం తెలుసుకున్న అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ హుటాహుటిన హాస్టల్‌ను సందర్శించి మృతదేహాలను చూసి చలించి పోయారు.ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి ఎవరైనా బాధ్యులు ఉంటే కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వపరంగా రావలసిన అన్ని రకాల బెనిఫిట్స్ అందే విధంగా చూస్తానని తెలిపారు. బాధిత పిల్లల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఏపి గిరిజన సంఘం నాయకుడు పొద్దు బాల దేవ్, తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు, కొత్తభల్లుగుడ సర్పంచ్ రాధిక, శెట్టి అప్పాలు, వైసీపీ నాయకులు శెట్టి అశోక్, దురియా ఆనంద్ కుమార్, షేక్ యాసిన్, సాంబయ్య తదితరులు హాస్టల్‌లో సందర్శించి కుటుంబాన్ని పరామర్శించారు.
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు
అరకులోయ రూరల్: మండలంలోని కొత్త బల్లుగూడ గిరిజన ఆశ్రమ ఉన్నత బాలికల హాస్టల్ డిప్యూటీ వార్డెన్ దంపతుల మృతిపై హెచ్‌ఎం ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఆర్.సంతోష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్వాటర్స్‌లో నివాసం ఉంటున్న గదిని పరిశీలించారు.భార్యభర్తల మృతదేహాలను అరకులోయ ఏరియా ఆస్పత్రికి పోస్టమార్టం నిమిత్తం తరలించారు. ఫుడ్ పాయిజన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.










