ప్రజాశక్తి-రేపల్లె: సీపీఎం అగ్రనాయకులు, రేపల్లె నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కామ్రేడ్ కోరటాల సత్యనారాయణ 17 వర్థంతి సభ స్థానిక రేపల్లె సీపీఎం కార్యాలయంలో కొరటాల మీటింగ్ హాల్లో జరిగింది. ముందుగా సీపీఎం సీనియర్ నాయకులు బిఎల్‌కె ప్రసాద్ కొరటాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఉద్యమాల్లో పాల్గొన్న నేత కొరటాల సత్యనారాయణ రేపల్లె డివిజన్ సీపీఎం నాయకులుగా, కేంద్ర కమిటీ సభ్యులుగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా అంచెలంచెలుగా ఎదిగిన ప్రజా నాయకుడని అన్నారు. రేపల్లె ఏరియాలో చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం అలుపెరగని కృషి చేశారు. చేనేత కార్మికులు కొరటాలను తమ వాడిగా చెప్పుకున్నారంటే వారి సమస్యలపై ఆయన చేసిన కృషి అర్డం చేసుకోవచ్చని అన్నారు. లంక భూముల సమస్యపై నిరంతరం పోరాటాలు నడిపి పేద ప్రజలను సొసైటీలుగా ఏర్పాటు చేసి భూస్వాముల అధీనంలో లంక భూములను పేదలు సాగుచేసుకునేందుకు అనేక పొరాటాల ద్వారా సాధ్యం చేశారు. గుంటూరు జిల్లాలో రైతాంగ ఉద్యమ నాయకులుగా పేద రైతుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు. నాగార్జునసాగర్ నిర్మాణానికై కమ్యూనిస్టు పార్టీలోని ఇతర నాయుకలతో కలసి పనుచేశారు. రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1962, 1978లలో రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై అనర్గళంగా మాట్లాడేవారు. ఈ వర్థంతి సభలో సిపిఎం, ప్రజా సంఘాలు నేతలు కె ఆశీర్వాదం, జి దానియేలు, డి శ్రీనివాసరావు, యూ రామకృష్ణ, ఆగస్టిన్, వై నవీన్ తదితరులు పాల్గొన్నారు.










