రిమ్స్‌లో బ్రెడ్లు పంపిణీ
ప్రజాశక్తి - కడప అర్బన్
సిపిఎం పోలిట్ బ్యూరో మాజీ సభ్యులు కొరటాల సత్యనారాయణ జీవితం ఆదర్శనీయమని జెవివి రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్ రాహుల్ అన్నారు. ఆదివారం కొరటాల శత జయంతి సందర్భంగా జెవివి ఆధ్వర్యంలో రిమ్స్ బాలింతల వార్డులో బ్రెడ్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా రాజశేఖర్ రాహుల్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొరటాల 1923, సెప్టెంబర్ 24న గంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో బుచ్చయ్య, వేషమ్మ దంపతులకు జన్మించారని తెలిపారు. పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనైనా పెరిగింది ప్రజల మధ్య అన్నారు. మార్క్సిస్టు, లెనినిస్టు సిద్దాంతంపై అత్యంత విశ్వాసంతో ఉంటూ చివరి వరకు సిపిఎంలో పని చేశారని చెప్పారు. 1946-48 మధ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగుతున్న రోజుల్లో ఆంధ్ర ప్రాంతంలో దానికి మద్దతుగా నిలబడి జైలుపాలయ్యారని పేర్కొన్నారు. గంటూరు జిల్లాలో బంజరు భూములు, లంక భూముల కోసం పేదలను కదిలించి పోరాటాలు నిర్వహించారని తెలిపారు. వ్యవసాయ కూలీల వేతనాల పెంపు కోసం పోరాడారని చెప్పారు. 196 2లో మొదటిసారి వేమూరు నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎగా గెలిచారన్నారు. 1978లో రేపల్లె నుంచి శాసనసభకు ఎన్నికయ్యారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా, పోరాటయోధుడిగా ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కొరటాల శత జయంతి రోజు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో జెవివి నాయకులు వెంకటేశ్వర్లు, షామీర్‌బాష, ప్రజాశక్తి సిబ్బంది సిద్దయ్య, నారాయణ, నూర్‌బాష, బాలకృష్ణ, రాఘవ, సుదర్శన్, రమ్యకృష్ణ, కె.జయ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. బాలింతకు బ్రెడ్డు పంపిణీ చేస్తున్న ప్రజాశక్తి సిబ్బంది, జెవివి నాయకులు










