Sep 24,2023 21:21

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ కుమార్‌

కొరటాల ఆశయాలను సాధించాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ కుమార్‌
ప్రజాశక్తి - ఆత్మకూరు

     సిపిఎం అగ్ర నాయకుల్లో ఒకరైన కొరటాల సత్యనారాయణ ఆశయాలను నాయకులు, కార్యకర్తలు ముందుకు తీసుకువెళ్లాలని పార్టీ జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని డాక్టర్‌ ఏ ధనుంజయ మీటింగ్‌ హాల్‌లో కామ్రేడ్‌ కొరటాల సత్యనారాయణ శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపరు గ్రామంలో పిచ్చయ్య, శేషమ్మలకు కొరటాల సత్యనారాయణ జన్మించారన్నారు. ఆయన పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనైనా ప్రజల మధ్య పెరిగారని, శ్రామిక జనం కోసం పని చేశారని తెలిపారు. హైస్కూల్లో డి టెన్షన్‌ విధానానికి వ్యతిరేకంగా 11 రోజులు విద్యార్థుల సమ్మెకు నాయకత్వం వహించారని చెప్పారు. ఆయన వయస్సు రిత్యా పెద్ద వారైనా, సీనియర్‌ కమ్యూనిస్టు అయినా జూనియర్లతో, యువతీ యువకులతో కలిసిపోయేవారని తెలిపారు. ఆయన క్షేత్రస్థాయి నుంచి పైకి ఎదిగి వచ్చిన నాయకుడని చెప్పారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని కమ్యూనిస్టు పార్టీ వైపు, రాజకీయాల వైపు ఆకర్షితులై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని రైతు, చేనేత రంగాల్లో పోరాట యోధుడిగా ఎనలేని కృషి చేశారని అన్నారు. 1952లో తెనాలి ఎంపీగా పోటీ చేసి కేవలం 1100 స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయారని, ఆ తరువాత 1962, 1978లో రేపల్లె శాసనసభ్యులుగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలోని కష్టజీవుల సమస్యలపై చట్టసభలో గళం విప్పారని తెలిపారు. విప్లవోద్యమానికి అంకితమై పని చేసిన ఆయన స్ఫూర్తి ఈ తరానికి ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు ఎ.రాజశేఖర్‌, పట్టణ కార్యదర్శి ఏ.రణధీర్‌, మండల కార్యదర్శి నరసింహ నాయక్‌, నాయకులు ఎం.రజాక్‌, డి.రామ్‌ నాయక్‌, ఎ.సురేంద్ర, ఎన్‌.స్వాములు, సద్దాం హుసేన్‌, దినేష్‌, మాబాష, వీరన్న, పాల శివుడు, గణపతి, రఫీ, రవి, రైట్‌ బాషా, రాంబాబు, సిలార్‌ తదితరులు పాల్గొన్నారు.