Sep 24,2023 21:48

కొరటాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు తమ్మినేని, శంకర్రావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పేదల అభ్యున్నతికి, సమాజ మార్పునకు ఎనలేని కృషి చేసిన కమ్యూనిస్టు మేధావి,సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి కామ్రేడ్‌ కొరటాల సత్యన్నారాయణ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సిపిఎంజిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. కొరటాల సత్యన్నారాయణ శత జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక ఎల్‌బిజి భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి తమ్మినేని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంపన్న కుటుంబంలో జన్మించిన కొరటాల పేదల కోసం పని చేశారని అన్నారు. సిపిఎం అభ్యున్నతికి ఎనలేని కృషి చేయడంతో పాటు, దోపిడీ దారుల పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ప్రజాశక్తి పత్రిక అభివృద్ధిలో ఆయన కృషి ఎనలేనిదని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. రైతు సంఘం జాతీయ నాయకులుగా రైతులు, కూలీల కోసం పని చేశారని అన్నారు. తన యావదాస్తిని పార్టీకి ఇచ్చేసి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆప్యాయత, అనురాగాలకు కొరటాల ప్రతీక అన్నారు. ఉద్యమాలను బలోపేతం చేయడం ద్వారా అటువంటి స్ఫూర్తి ప్రదాత ఆశయాలను నెరవేర్చాలని పిలుపు నిచ్చారు. అనంతర రెడ్డి శంకరరావు, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు డి.రాము మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వి.లక్ష్మి పి.రమణమ్మ, కె.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.
కొరటాల ఉద్యమస్ఫూర్తిని యువతకు అందించాలి
విజయనగరం కోట : పేదల అభ్యున్నతికి కృషి చేసిన కమ్యూనిస్టు నాయకులు కొరటాల సత్యనారాయణ ఉద్యమస్ఫూర్తిని యువతకు అందించాలని ప్రజాశక్తి డెస్క్‌ ఇంఛార్జి పి.అప్పారావు అన్నారు. ప్రజాశక్తి కార్యాలయంలో కొరటాల చిత్రపటానికి సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌ కె.కృష్ణమూర్తి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అప్పారావు మాట్లాడుతూ ప్రజాశక్తి అభివృద్ధిలో కొరటాల కీలకపాత్ర పోషించారని, ఆయన ఆశయాలను పత్రిక ద్వారా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో కన్వీనర్‌ కె.రమేష్‌ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
రాజాం : మండలంలోని కంచరాం గ్రామంలో కొరటాల జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రామ్మూర్తినాయుడు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పేదల కోసం పోరాడిన మహానాయకుడని కొనియాడారు.