
ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి : కామ్రెడ్ కొరటాల సత్యనారాయణ జీవితం నేటి తరానికి ఆదర్శమని , ఆయన ఆశయాల సాధనకు కృషి చేద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు అన్నారు. కొరటాల శతజయంతి కార్యక్రమాన్ని ఆదివారం మచిలీపట్నం జోతిబాపూలే విజ్ఞానకేరద్రంలో నిర్వహంచారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బి.సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సభలో నరసింహారావు మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా కొరటాల పని చేశారని గుర్తు చేశారు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో జైలు జీవితం గడిపారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతు, వ్యవసాయ, చేనేత కార్మికుల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడంతోపాటు, ఆయా సంఘాల నిర్మాణంలోనూ కొరటాల కీలకపాత్ర పోషించారన్నారు. రైతాంగ ఆత్మహత్యలపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి సరళీకరణ విధానాలకు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించారన్నారు. నగర కమిటీ సభ్యులు టి.చంద్రపాల్ మాట్లాడుతూ కొరటాల రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారని, ఎంతో నిరాడర జీవనం సాగించారని తెలిపారు. తొలుత నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజానాట్యమండలి నాయకులు నాగయ్య, సిఐటియు నగర కార్యదర్శి జయరావు, ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ విజయలక్ష్మి, కె.సుజాత , కమిటీ సభ్యులు బి.భవానీ, ఎం. పద్మావతి తదితరులు కొరటాల శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.