కోవిడ్ వలన ఉపాధి అవకాశాలు పోవడంతో ప్రపంచ వ్యాప్తంగా నిరుపేదల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గతంలో యుద్ధాలు, పర్యావరణ మార్పులు, ప్రపంచీకరణ వలన పేదరికం పెరిగేది. కోవిడ్ మహమ్మారి 2020లో ప్రపంచ వ్యాపితంగా వున్న నిరుపేదలను 8.8 కోట్ల నుంచి 11.5 కోట్లకు పెంచేసింది. 2021 నాటికి 15 కోట్లకు చేరుకునే సంకేతాలు కనబడుతున్నాయి. రోజుకు రూ.150 ఆదాయం గలవారిని నిరుపేదలుగా గుర్తిస్తున్నారని అమెరికన్ పరిశోధనా సంస్థ 'పూ' వెల్లడించింది. లాక్‌డౌన్లు, కర్ఫ్యూలలో పేదరికం మరింత పెరిగే అవకాశం ఉన్నది.
ఆఫ్రికా లో ప్రపంచం లోని 87 శాతం నిరుపేదలు ఉంటున్నారు. భారత్‌లో కూడా పేదరికం బాగా పెరిగిపోయింది. కరోనా రాకముందు కంటే నిరుపేదల సంఖ్య 7.5 కోట్లు పెరిగి మొత్తం 13.5 కోట్లకు చేరింది. ఇక్కడ అభివృద్ధి -11 శాతానికి పడిపోవడం దానికి తాజా ఉదాహరణ. ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసి లోని గ్రామీణ ప్రాంతంలో పిల్లలు గడ్డి తిని కడుపు నింపుకుంటున్న ఫొటోలు వెలుగు చూశాయి. నైజీరియా, ఇథియోపియా, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, ఇండొనేషియా, కాంగో, పాకిస్తాన్, కెన్యా, ఉగాండా లాంటి దేశాలు దారిద్య్రంలో ముందు వరుసలో ఉండే దేశాలు. అక్కడ కోవిడ్ వల్ల పేదరికం మరింత తీవ్రంగా పెరిగిపోయింది.
యునిసెఫ్ లెక్కల ప్రకారం 1.2 మిలియన్ల మంది పిల్లలు అనేక సమస్యలతో దారిద్య్రం కోరల్లో చిక్కుకున్నారు. ఒకవైపు పౌష్టికాహార లోపం. మరోవైపు సరైన వైద్యం అందదు. ప్రధానంగా విద్యకు దూరమై వారి భవిష్యత్ ఛిద్రం అవుతున్నది. బాలల పేదరికం 70 దేశాలలో 15 శాతం పెరిగింది. మహిళలు, ఆడపిల్లల్లో 47 మిలియన్ల మంది నిరుపేదలుగా మారినట్టు అంచనా. కరోనా కారణంగా మహిళలలో 9.1 శాతం పేదరికం పెరిగింది. కోవిడ్ ప్రస్తావన లేకుండానే 2019-2021 మధ్య కాలంలో మహిళల్లో పేదరికం 2.7 శాతం పెరుగుతుందని భావించారు. కానీ కోవిడ్ వల్ల అది 9.1 శాతం పెరిగిపోయింది.
పట్టణ పేదలు ఎక్కువ మంది నిరుపేదలుగా మారితే దీని ప్రభావం గామీణ ప్రాంతాల మీద తీవ్రంగా పడుతున్నది. పట్టణాలలో అసంఘటిత రంగంలో పని చేసే వారికి పనులు వుండటం లేదు. ఉన్నా కూలీ బాగా తగ్గించడంతో ఆదాయాలు దిగజారిపోతున్నాయి. గ్రామాలకు తిరిగి వెళ్లిపోతున్న పరిస్థితి. దీనితో గ్రామాలలో పరిమితంగా వుండే కూలీ పనులు పట్టణాల నుంచి వచ్చిన వారి ప్రభావంతో పోటీ ఏర్పడి వేతనాలు తగ్గిపోయి మరింత కష్టతరంగా మారుతున్నది. ఈ సంవత్సరం మార్చిలో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్థికాభివృద్ధి రేటు 4.3 శాతం పడిపోయింది. ఇది 2007-2008 సంక్షోభ కాలం కంటే ఎక్కువ పతనం. పెట్టుబడిదారీ ప్రపంచీకరణ వైఫల్యం నిరుపేదల సంఖ్య పెరుగుదలకు ఒక కారణం. పదే పదే వచ్చిన ఆర్థిక సంక్షోభాలను తేలిక చేసి చూడకూడదు. దానికి కోవిడ్ మహమ్మారి ఇప్పుడు తోడైంది. పెట్టుబడిదారీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం సహస్రాబ్ది సూత్రాలు, సుస్థిరాభివృద్ధి అంటూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. పేదరిక నిర్మూలనకు గడువులు ప్రకటిస్తున్నారు తప్ప వ్యవస్థలో ఉన్న కీలక సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు.
ముందు నుంచే ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనకు పూనుకుని ఉంటే ఇప్పుడు మహమ్మారి నుంచి వచ్చే ఆర్థిక సమస్యల ప్రభావం తక్కువగా ఉండేది. చైనా దానికి ఉదాహరణ. చైనా లక్షణాలు కలిగిన సోషలిస్టు ఆర్థిక విధానంతో పేదరికాన్ని నిర్మూలించామని ప్రకటించిందా దేశం. వారు కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొని... దానివల్ల పేదలు పెరిగే అవకాశం లేకుండా చేశారు. అదే ప్రపంచ మార్గం కావాలి!
- టి.ఎన్.వి. రమణ, సెల్:89856 28662










