Apr 10,2021 07:08

   ఉపాధి సంక్షోభం కూడా పెరుగుతుండడంతో ఉపాధి హామీ పథకాన్ని ఏడాదిలో కనీసం 200 రోజులకు విస్తరించి, వేతనాలు పెంచాలి. అది జరిగేవరకు, రాష్ట్రాల్లో అమలు చేసిన పని దినాలకు చెల్లించే వేతనాలకు తగిన రీతిలో కేటాయింపులు వుండేలా చూడాలి. పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు కొంత ఉపశమనం కలిగించేలా పట్టణ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలి.
   కోవిడ్‌ రెండో దశ విజృంభిస్తుండడంతో భారత్‌ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఏప్రిల్‌ 4వ తేదీన రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు లక్ష దాటాయి. మొత్తంగా 1,03,709 కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల తర్వాత, ఏప్రిల్‌ 7వ తేదీన ఈ సంఖ్య ఇంకా పెరిగింది. 1,26,260 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది, ప్రపంచంలోనే రోజువారీ కేసుల్లో అత్యధికం.
   మరణాల రేటు కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితులకు ప్రభుత్వం ఏమాత్రమూ సన్నద్ధంగా లేదని చెప్పడం ఇక్కడ చాలా సర్వసాధారణమైన అంశం. ఇందుకు విరుద్ధంగా, మోడీ ప్రభుత్వం జనవరి లోనే అధ్వాన్న పరిస్థితులు ముగిసిపోయాయన్నట్లుగా వ్యవహరిస్తోంది. పైగా ఆర్థిక పునరుద్ధరణ బాగా జరుగుతోందనే నమ్మకంతో వుంది.
   ఆరోగ్య రంగంలో, ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రజలకు ఉపశమనం కల్పించడంలో రెండు రంగాల్లో కూడా మోడీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 2021-22 సంవత్సరానికి సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో ఈ విషయం స్పష్టమైంది. ఆరోగ్య రంగానికి కేటాయింపుల్లో కనీవినీ ఎరుగని రీతిలో 137 శాతం పెంచినట్లు బడ్జెట్‌లో చాలా అద్భుతంగా చెప్పుకుంది. కానీ వాస్తవానికి చూసినట్లైతే, బడ్జెట్‌లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ రంగానికి చేసిన కేటాయింపులు తగ్గాయి. 2020-21 సంవత్సరానికి జరిగిన వాస్తవ వ్యయంపై 9.6 శాతం తగ్గినట్లు చూపిస్తోంది.
   అలాగే ప్రభుత్వం రూపొందించిన వ్యాక్సినేషన్‌ విధానం కూడా చాలా గందరగోళంగా, పరస్పర విరుద్ధంగా వుంది. ఇప్పటివరకు అత్యవసర వినియోగం నిమిత్తం రెండు వ్యాక్సిన్లను ఆమోదించారు. అవి ఆస్ట్రాజెనికా కు చెందిన కోవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ కి చెందిన కోవాక్సిన్‌. మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా వినియోగించడానికి వివాదాస్పదమైన రీతిలో కోవాక్సిన్‌ను ఆమోదించినప్పటికీ... నియంత్రణా సంస్థ మాత్రం ఇంకా రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి కి అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం 35 దేశాల్లో దీన్ని ఉపయోగిస్తున్నా భారత్‌ కంపెనీ తయారు చేయడానికి ఇంకా ఆమోద ముద్ర పడాల్సి వుంది.
   కరోనా తీవ్రత ఎక్కువగా వున్న రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ నిల్వలు చాలా వేగంగా హరించుకుపోతుండడంతో వ్యాక్సిన్‌ సరఫరాలో ఇప్పటికే కొరత వుంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుండి 45 ఏళ్ళకు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే సమయంలోనే ఈ పరిస్థితి నెలకొంది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ముమ్మరం చేయడంలో, అమలు చేయడంలో వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
   స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను వెంటనే వినియోగించడానికి మాత్రమే ప్రభుత్వం చూడరాదు. కేవలం సింగిల్‌ డోసు మాత్రమే సరిపోయే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి లైసెన్స్‌ కూడా సంపాదించాలి. కోవోవాక్స్‌ మాదిరిగా భారత్‌లో సీరం ఇనిస్టిట్యూట్‌ రూపొందించే నోవావాక్స్‌ వ్యాక్సిన్‌ను వేగిరపరచాలి. కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ స్వస్థ్య భారత్‌ యోజనకు తక్షణమే నిధులను అందచేయాల్సి వుంది. ప్రాథమిక, మాధ్యమిక, ప్రాదేశిక ఆరోగ్య వ్యవస్థల్లో, ఇతర ప్రజారోగ్య కేంద్రాల్లో సామర్ధ్యాలను పెంపొందించేందుకు ఈ పథకం ఉద్దేశించింది. ఈ పథకం కింద ఆరేళ్ళలో రూ.64,180 కోట్లు ఖర్చు పెట్టాలని భావించారు. కానీ, బడ్జెట్‌లో అసలు కేటాయింపులే జరపలేదు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం ప్రాధాన్యతాంశమైనందున తక్షణమే ఈ పథకాన్ని అమలు చేయాల్సి వుంది.
   ఆర్థిక పునరుద్ధరణ బాగా జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్న దానికి విరుద్ధంగా అభివృద్ధి నిలిచిపోయిందని స్పష్టమైంది. ప్రతిష్టింభించే అవకాశం కూడా వుంది. ఆరు మాసాల్లో కీలక రంగం లోని ఆరు విభాగాలు తీవ్రంగా కుంచించుకుపోయాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభం కావడానికి ముందుగానే తయారీ రంగ ఉత్పత్తి ఏడు మాసాల దిగువ స్థాయికి పడిపోయింది. ఇప్పుడు కేసులు పెరుగుతుండడంతో రాత్రివేళల్లో కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లు, కదలికలపై ఆంక్షలు వంటి చర్యలతో ఆర్థిక కార్యకలాపాలు మరింతగా దెబ్బతిననున్నాయి. పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను నివారిస్తున్నప్పటికీ, పెరుగుతున్న కేసులు, పరిమిత ఆంక్షలతో ఇప్పటికే మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో రిటైల్‌ వాణిజ్యం, రెస్టారెంట్లు, హోటళ్ళు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. సేవా రంగంలో ఉద్యోగాలపై వేటు పడింది. వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్ళడం ఆరంభమైంది.
   కరోనా మహమ్మారి వ్యాపించిన తొలినాళ్ళలో నిరాశా నిస్పృహల్లో వున్న ప్రజల అవసరాలను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అదనపు వ్యయంలో చూసినట్లైతే ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ జిడిపిలో 1.5 శాతంగా వుంది. అమెరికా, బ్రిటన్‌, ఇ.యు దేశాల్లో అయితే ప్రజలకు గణనీయ మొత్తాల్లో నగదు సబ్సిడీలు అందచేశారు. మోడీ ప్రభుత్వం చాలా తక్కువ మొత్తంలో నగదు అందచేసింది, చిన్న వ్యాపారాలకు మద్దతివ్వడానికి నిరాకరించింది. గతేడాది లాక్‌డౌన్‌ విధించిన సమయంలో పురుషులు, మహిళలు, పిల్లలతో సహా లక్షలాదిమంది ఆహారం, ఆశ్రయం లేకుండా జాతీయ రహదారులపై నడుచుకుంటూ రావడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, అమానవీయ ధోరణిని ప్రతిబింబిస్తోంది.
   ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాల్సి వుంది. ఇందుకుగాను తీసుకోవాల్సిన మొదటి చర్య ప్రతి కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యం అందచేయడం, అందులో 10 కిలోలు ఉచితంగా ఇవ్వాలి. ఆహార భద్రతా చట్టం పరిధి లోకి వచ్చే 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, కిలో పప్పు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది, గతేడాది నవంబరు వరకు మాత్రమే కొనసాగింది.
   2021 మార్చి 1 నాటికి, దేశంలో పెద్ద మొత్తంలో 9.2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల (మిల్లు పట్టించని ధాన్యంతో సహా) నిల్వలున్నాయి. వుండాల్సిన నిల్వల కన్నా ఇవి మూడు రెట్లు ఎక్కువ. వచ్చే ఆరు మాసాల పాటు ఒక్కో కుటుంబానికి నెలకు 10 కిలోలు చొప్పున ఉచిత కోటాను ప్రభుత్వం పెంచాలి.
  ఆదాయ పన్ను పరిధికి వెలుపలగల కుటుంబాలన్నింటికీ రూ.7,500 నగదును చెల్లించాలని 2020 సెప్టెంబరులో అన్ని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. కానీ ప్రభుత్వం మహిళా జన్‌ ధన్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు మాత్రమే మూడు నెలవారీ వాయిదాల్లో రూ.1500 చెల్లించింది. కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతున్న వాస్తవాన్ని దృష్టిలో వుంచుకుంటే ప్రభుత్వం అన్ని కుటుంబాలకు నగదు సబ్సిడీని అందచేయాల్సి వుంటుంది.
   ఉపాధి సంక్షోభం కూడా పెరుగుతుండడంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) ఏడాదిలో కనీసం 200 రోజులకు విస్తరించి, వేతనాలు పెంచాలి. అది జరిగేవరకు, రాష్ట్రాల్లో అమలు చేసిన పని దినాలకు చెల్లించే వేతనాలకు తగిన రీతిలో కేటాయింపులు వుండేలా చూడాలి. పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు కొంత ఉపశమనం కలిగించేలా పట్టణ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలి.
   సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఇ) 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ కరోనాతో బాగా దెబ్బ తిన్న, ప్రభావం పడిన రంగం ఇదే. ఇప్పటి వరకు, తీసుకున్న చర్యలేవీ సరిపోవు. రుణాల చెల్లింపులపై మారటోరియం పొడిగించడంతో పాటుగా, పెండింగ్‌ రుణాలపై వడ్డీని మాఫీ చేయడం, ముడి పదార్ధాల కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వడం వంటి ఇతర తోడ్పాటు చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి.
   వీటన్నింటికీ ఇప్పుడు బడ్జెట్‌లో కేటాయించిన దానికన్నా చాలా ఎక్కువగా ప్రభుత్వ వ్యయం అవసరమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థిక లోటు పరిమితులకు కచ్చితంగా కట్టుబడి వుండరాదు. అలాగే ప్రభుత్వ వ్యయాన్ని పెంచేందుకు రుణాలపై ఆధారపడరాదు. ఇందుకు బదులుగా, కార్పొరేట్లపై, సుసంపన్నులపై పన్నులను మరింత పెంచాలి. సంపద పన్నును ప్రవేశ పెట్టాలి. అధిక ఆదాయం కోసం పెట్రోలియం ఉత్పత్తులపై అధిక పన్నులు విధించే హానికరమైన విధానాల స్థానంలో ఈ చర్యలు తీసుకోవాలి.
   కేరళ ప్రభుత్వం రెండు కీలక రంగాల్లో చేసిన పనులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్ష్యంగా చేసుకోవడం మంచిది. కేరళలో కోవిడ్‌ బారిన పడిన వారిలో 95 శాతం మందికి ప్రజారోగ్య వ్యవస్థలో ఉచిత చికిత్స లభించింది. కరోనా కల్లోల కాలంలో 88 లక్షల కుటుంబాలకు ఉచిత ఆహార కిట్‌లను ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అందచేసింది. ఈ కిట్‌లో పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు, ఖాద్య తైలాలు, మసాలాలు అన్నీ వున్నాయి.
   ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడంపై మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఆర్థిక సంక్షోభం నుండి ప్రజలను కాపాడేందుకు అవసరమైన ఆర్థిక విధాన చర్యలేవీ తీసుకోవడం లేదు. దానికి బదులుగా కార్పొరేట్ల, బడా బాబుల ప్రయోజనాలను పెంపొందించే నయా ఉదారవాద చర్యలను తీసుకోవడానికి ఈ సంక్షోభాన్ని ఉపయోగించుకుంటోంది. వ్యవసాయ చట్టాలు, కొత్త కార్మిక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి చర్యలు, విషపూరితమైన మత రాజకీయాలు జమిలిగా నడుస్తున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ హానికరమైన కార్యాచరణను తక్షణమే విరమించాలి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంపై, ప్రజా సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
 

/ 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం /