Dec 27,2022 23:38

సమీక్షిస్తున్న విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబు

ఏర్పాట్లపై మాక్‌డ్రిల్‌ : పర్యవేక్షించిన విమ్స్‌ డైరెక్టర్‌
వంద పడకలతో వార్డులు సిద్ధం
సాధారణ రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బ్లాక్‌
ప్రజాశక్తి - ఆరిలోవ :
చైనాను అతలాకుతలం చేస్తున్న కోవిడ్‌ బిఎఫ్‌-7 మన దేశంలోనూ ప్రభావం చూపే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు అంచనాల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ వైద్యసేవల సన్నద్ధతపై అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి, రెండో వేవ్‌ కరోనా విజృంభణ సమయంలో డెడికేటెడ్‌ కోవిడ్‌ ఆసుపత్రిగా నిలిచిన విమ్స్‌లోనూ తాజా సన్నద్థత చర్యల్లో భాగంగా 100 పడకలను సిద్ధం చేశారు. మంగళవారం దీనికి సంబంధించిన మాక్‌ డ్రిల్‌ను విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె. రాంబాబు పర్యవేక్షణలో నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్‌ రాంబాబు మాట్లాడుతూ కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే చర్యల్లో బాగంగా మందులు, ఆక్సిజన్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు సరిపడా నిల్వలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతానికి వంద పడకలను కేటాయించామని, అవసరాన్ని బట్టి వాటిని 600 పడకల వరకు పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి పడకకు ఆక్సిజన్‌ సదుపాయంతోపాటు 200 ఐసియు పడకలకు అందుబాటులోకి తీసుకురాగల సామర్థ్యం విమ్స్‌ ఆస్పత్రికి ఉందన్నారు. విమ్స్‌లో అందుబాటులో ఉన్న రెండు ఆక్సిజన్‌ ట్యాంకులు, రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు పరిశీలించి పని తీరును గమనించామన్నారు. వైద్యులు, అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో రోగులకు ఉత్తమ వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
కోవిడ్‌ జ్వరాలకు ప్రత్యేక బ్లాకు
ప్రస్తుతం సాధారణ రోగులకు ఉత్తమ వైద్యం అందించడంలో నిమగమైన విమ్స్‌ ఆస్పత్రిలో కోవిడ్‌ లక్షణాలతో కూడిన జ్వరాలకు ప్రత్యేక బ్లాక్‌లో ఒపిని నిర్వహించి, అక్కడ వ్యాధి నిర్థారణ పరీక్షలు అనంతరం కోవిడ్‌ అయితే సంబంధిత వార్డుకు, లేకుంటే సాదారణ జ్వరాల వార్డుకు తరలించి వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు విమ్స్‌ డైరెక్టర్‌ రాంబాబు వెల్లడించారు.