Mar 07,2021 07:02

కోవిడ్‌-19 కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న వేళ ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోనున్నాం. ఈ సందర్భంగా ఓ కఠోర వాస్తవాన్ని ప్రస్తావించుకోవాలి. కోవిడ్‌ సంక్షోభం ప్రత్యేకంగా మహిళలకు తీవ్ర హాని కలిగించింది.
మహిళలు, బాలికలు ఇప్పటికే ఎదుర్కొంటున్న లోతైన అసమానతలను కోవిడ్‌ మహమ్మారి మరింత తీవ్రతరం చేస్తోంది. లింగ సమానత్వ దిశగా కొద్ది సంవత్సరాలుగా సాధించిన పురోగతిని అది చెరిపివేస్తోంది. మహమ్మారి వల్ల బాగా దెబ్బతిన్న రంగాలలో మహిళలు ఎక్కువగా పని చేసే అవకాశముంది. అత్యంత ముఖ్యమైన ఫ్రంట్‌లైన్‌ కార్మికులు మహిళలే. వీరిలో అత్యధికులు అట్టడుగు వర్గాలకు చెందినవారు. ఆర్థిక నిచ్చెనలో అత్యంత కింది భాగాన వుండేవారు.
కోవిడ్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయాలు విపరీతంగా పడిపోవడం అనేది మహిళల్లో 24 శాతం అధికంగా వుంది. ఆరోగ్య రంగంతో సహా అన్ని చోట్లా ఇప్పటికే హెచ్చుగా వున్న వేతన అసమానతలు ఈ సమయంలో మరింత పెరిగిపోయాయి. ఇంటి నుంచే పని చేయాలన్న ఉత్తర్వులు వెలువడడంతో...స్కూళ్లు, పిల్లల సంరక్షణా కేంద్రాలు మూతబడడంతో... మహిళలకు వేతనం లేని సంరక్షణ చాకిరీ పెరిగింది. లక్షలాది మంది బాలికలు ఎప్పటికీ స్కూళ్లకు తిరిగి రాకపోవచ్చు. తల్లులు...మరీ ముఖ్యంగా ఒంటరి తల్లులు...తీవ్రమైన ప్రతికూలతను, ఆందోళనను ఎదుర్కొన్నారు.
కోవిడ్‌ కాలంలో బాల్య వివాహాలు, లైంగిక దోపిడీ, అక్రమ రవాణా, గృహ హింస ఎక్కువైంది. ఇలా వుండగా, ఆరోగ్య సంరక్షణ కార్మికులలో మహిళలు అధికంగా వున్నప్పటికీ, 3.5 శాతం 'కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్సు'లలో మాత్రమే స్త్రీపురుషులు సమానంగా వున్నారు. ఈ మహమ్మారికి సంబంధించిన ప్రపంచవ్యాప్త వార్తల కవరేజీకి ఐదుగురు నిపుణులకుగాను ఒక్క మహిళ మాత్రమే వున్నారు.
ఈ విధమైన మినహాయింపును ఒక అత్యవసర పరిస్థితిగా పరిగణించవచ్చు. మహిళా నాయకత్వం, భాగస్వామ్యం పెంచేందుకుగాను ప్రపంచ వ్యాప్తంగా ఒక కొత్త ప్రయత్నం చేయాల్సిన అవసరముంది. అది అందరికీ ప్రయోజనం చేకూరుస్తుందన్నది స్పష్టం. కోవిడ్‌ని ఎదుర్కోవడంలో మహిళా నాయకత్వ శక్తి, ప్రభావం కీలకంగా నిలబడింది. ఈ ఏడాదిలో గమనించినట్లయితే...మహిళా నాయకత్వం వున్న దేశాలలో కోవిడ్‌ వ్యాప్తి తక్కువగా వుంది. స్వస్థత పొందడంలో కూడా ఆ దేశాలు మెరుగ్గా వున్నాయి. ముఖ్యంగా కమ్యూనిటీ స్థాయిలో అత్యవసర సేవలు అందించడంలోను, సమాచారాన్ని చేరవేయడంలోనూ మహిళా నాయకత్వం చక్కటి కృషి చేసింది.
ప్రభుత్వంలో మహిళా నేతలు వున్నచోట సామాజిక భద్రతకు, పేదరికాన్ని రూపుమాపేందుకు కేటాయింపులు భారీగా చేయడం చూశాం. మహిళలు పార్లమెంట్‌లో వున్నప్పుడు ఆయా దేశాలు వాతావరణ మార్పులపై కఠినమైన విధానాలను అవలంభిస్తాయి. మహిళలు శాంతి చర్చలలో వున్నప్పుడు చేసుకునే ఒప్పందాలు మరింత మెరుగ్గా వుంటాయి.
అయినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మహిళలు జాతీయ శాసనసభల్లో నాలుగింట ఒక వంతు, క్యాబినెట్‌ మంత్రులలో ఐదవ వంతు మాత్రమే వున్నారు. ఈ పరిస్థితుల్లో స్త్రీ పురుష సమానత్వ సాధన 2063 సంవత్సరానికి ముందు సాధ్యం కాదు. ప్రభుత్వాధినేతల విషయంలో సమానత్వం సాధించాలంటే ఒక శతాబ్దానికి పైగా పడుతుంది.
అధికారపరమైన ఈ అసమతుల్యతను పరిష్కరించడం మీదనే మెరుగైన భవిష్యత్‌ ఆధారపడి వుంది. తమ జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలపై పూర్తి అధికారికంగా మాట్లాడే సమానమైన హక్కు మహిళలకూ వుంది. ఐక్యరాజ్య సమితి నాయకత్వ స్థాయిలో ఈ సమానతను సాధించగలిగినందుకు నేను గర్విస్తున్నాను.
కోవిడ్‌-19 నుంచి కోలుకునే క్రమంలో సమానత్వంతో కూడిన నూతన మార్గాన్ని రూపొందించుకునేందుకు మనకో అవకాశం లభించింది. మహిళలు, బాలికలను దృష్టిలో వుంచుకొని ఉద్దీపన పథకాలను రూపొందించాలి. చిన్నారులు, వృద్ధుల సంరక్షణకుగాను మహిళలకు ఎలాంటి చెల్లింపులు లేకుండానే సాధారణ ఆర్థిక వ్యవస్థ నడిచిపోతుంటుంది. సంరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కేటాయింపులు పెంచాలి.
ఈ సంక్షోభం నుంచి కోలుకున్నప్పుడు...పర్యావరణ హిత, ఆనందదాయక భవిష్యత్తు కోసం ఒక మార్గాన్ని రూపొందించుకోవాలి. అందుకుగాను, ఈ కింది ఆరు కీలకాంశాల సాధనకు కృషి చేయాల్సిందిగా ప్రపంచ నేతలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
మొదటిది - కంపెనీ బోర్డు నుంచి పార్లమెంటు వరకు, ఉన్నత విద్య నుంచి ప్రభుత్వ సంస్థల వరకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. అందుకుగాను ప్రత్యేక కోటాలను, చర్యలను చేపట్టాలి.
రెండవది - సంరక్షణ, సామాజిక భద్రతకు సంబంధించి పెట్టుబడులు గణనీయంగా వుండాలి. ఇంటి పని కనిపించేలా, లెక్కించేలా స్థూల జాతీయోత్పత్తిని తిరిగి నిర్వచించాలి.
మూడవది - ఆర్థిక వ్యవస్థలో మహిళలు పూర్తిగా భాగస్వాములు కావాలి. కార్మిక శక్తిలోనూ, ఆస్తులు, అప్పులు, పెట్టుబడులలోనూ వారి భాగస్వామ్యం వుండాలి.
నాల్గవది - కార్మిక హక్కులు, భూమి హక్కుల నుంచి వ్యక్తిగత హోదా, హింస నుంచి రక్షణ వంటి అంశాలన్నిట్లోనూ వివక్షాపూరిత చట్టాలను రద్దు చేయాలి.
ఐదవది- మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసకు వెనువెంటనే స్పందించేలా ప్రతి దేశం ఒక ప్రణాళికను రూపొందించాలి. అందుకు తగిన నిధులు, విధానాలు ఏర్పాటు చేసుకోవాలి. రాజకీయ చిత్తశుద్ధితోనే ఈ హింసను అంతం చేయగలం.
ఆరవది - ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. ఆలోచనా విధానాన్ని మార్చాలి. వ్యవస్థీకృత వివక్షను వివరించి రూపుమాపాలి.
అందుకుగాను ప్రపంచం ముందు ఒక అవకాశం వుంది. సమానత్వంతో కూడిన భవితను నిర్మించుకునే సమయమిదే.
                                   బాల్య వివాహాలు, లైంగిక దోపిడీ, అక్రమ రవాణా, గృహ హింస      - ఆంటోనియో గుటెరస్/ వ్యాసకర్త ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి /