దేశంలో సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలతో ఆస్పత్రుల్లోని పడకలన్నీ నిండిపోయాయి. దీంతో బాధితులు ఏ ఆస్పత్రికి వెళ్లాలో... ఏ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ ఉన్నాయో తెలీక అనేక అవస్థలు పడ్డారు. ఏ రోగికైనా సరైన సమయంలో వైద్యం అందకపోతే మృత్యువాత పడక తప్పదు. అలాంటి ఆఖరి సమయాల్లో సమయాన్ని వృథా కాకుండా కాపాడేందుకు ఓ హైదరాబాదీ యువతి కేవలం రెండు గంటల్లోనే యాప్‌ను రూపొందించింది. కేవలం ఒకే ఒక్క యాప్‌తో హైదరాబాద్‌లోని ఆస్పత్రుల సమాచారాన్నంతా చూసేందుకు వీలుగా దీన్ని రూపొందించింది. అంతే కాదు... ఈ యాప్ కేవలం ఐదు రోజుల్లోనే లక్ష మందికి చేరువైంది..తక్కువ సమయంలో యాప్ రూపొందించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు వెన్సీ కృష్ణ.
కరోనా రెండో వేవ్ తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎంతోమంది కరోనా రోగులకు, వైద్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. అనేక మంది బాధితులు ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, రక్తం, ప్లాస్మా అందుబాటులో లేక నానా అవస్థలు పడ్డారు. అయితే కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు పడిన హైదరాబాదీ యువతి దీనికి పరిష్కారంగా ఆస్పత్రుల సమాచారాన్ని ఓ యాప్ రూపంలో అందుబాటులో తెచ్చింది. అనేక మంది బాధితులకు అండగా నిలిచింది. అయితే తన తల్లికి కరోనా సోకడంతో బాధితులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అనుభవించింది. తన తల్లికి ఆస్పత్రిలో బెడ్ దొరక్క తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంది. ఓ వైద్యుడి సాయంతో ఎలాగొలా ఆమె తల్లి హోం ట్రీట్‌మెంట్‌తో కరోనా నుండి గట్టెక్కింది. ఈ అనుభావాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు చెందిన వెన్సీ కృష్ణా అనే యువతి ఏ ఆస్పత్రిలో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని అందరికీ తెలియచేయాలని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడవుగా రెండు గంటల్లోనే ఈ యాప్‌ని రూపొందించింది. hydcovidresources పేరుతో (ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్‌లకు అనుకూలంగా) రూపొందించిన ఈ యాప్‌ని కేవలం ఐదు రోజుల్లోనే రెండు లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్ర స్తుతం ఈ యాప్‌కి మూడు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
మిత్రుల సహకారం...
కోవిడ్ కాలంలో ఆస్పత్రుల సమాచారం అందించేందుకు అనేక మంది.. టెకీలు అనేక ప్రయత్నాలు చేశారు. ఎవరికి తోచిన విధంగా వారు సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు కృషి చేశారు. ఆ విధంగానే తన స్నేహితుడైన మేధా కద్రీ, అభిషేక్ అనిరుధ్‌లు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న ఆస్పత్రుల సమాచారంతో ఒక స్ప్రెడ్‌షీట్ ప్రారంభించారు. మేధా సహకారంతో ఆ సమాచారాన్ని తన యాప్‌లో నిక్షిప్తం చేసి, తన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లినట్లు వెన్సీ కృష్ణ తెలిపారు. యాప్ రూపొందించిన మొదటి 12 గంటల్లోనే 10వేల మంది యాప్‌ను ఉపయోగించారని తెలిపారు. సులువుగా ఉపయోగించే ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని, కేవలం స్మార్ట్‌ఫోన్‌లో, కంప్యూటర్‌లోని బ్రౌజర్‌లో ఓపోన్ చేయవచ్చని, అవసరాన్ని బట్టి హోం స్క్రీన్‌కి కూడా పిన్ చేసుకోవచ్చని తెలిపారు.
అన్ని అవసరాలూ ఒకే వేదికపైకి
హెచ్‌వైడికోవిడ్‌రిసోర్సెస్.కామ్ కోవిడ్ అవసరాలన్నింటినీ ఒకే వైదికపైకి తీసుకొస్తుందని, ఆక్సిజన్, ప్లాస్మా, రెమ్‌డ్‌సివిర్, అంబులెన్స్, భోజనం, బ్లడ్‌బ్యాంకులు వంటి వివరాలన్నీ ఇందులోనే అందుబాటులో ఉంటాయని తెలిపారు వెన్సీ. దీనికోసం సుమారు 50 మంది స్వచ్ఛంద సేవకుల బృందం పనిచేస్తుందని, ఎప్పటికప్పుడు సర్వీసు ప్రొవైడర్లు, వారి వివరాలను ఈ బృందం అప్‌డేట్ చేస్తుందని తెలిపారు. ఇందులో డాక్టర్ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉంటుందని, పెయిడ్, ఫ్రీ కన్సల్టెషన్ అందుబాటులో ఉన్నట్లు వివరించారు.
మరింత విస్తరించేందుకు కృషి...
తాము రూపొందించిన ఈ యాప్‌ను మరిన్ని నగరాలకు విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎవరైనా ఔత్సాహికులు ముందుకొస్తే, వారికి స్వీయ బోధన ద్వారా వారికి అవగాహన కల్పిస్తామని, దీన్ని ప్రజలకు ఎలా చేరువ చేయాలో నేర్పించడమే కాకుండా, ఆయా నగరాల సమాచారాన్ని కూడా ఒకే యాప్ ద్వారా ఎక్కువ నగరాలకు విస్తరించే వెసులుబాటు కలుగుతుందన్నారు. అయితే ఒక్కో నగరంలో ఒక్కో సమస్య ఉంటుందని, దీన్ని స్థానికీకరించి పరిష్కారాలను గంటల వ్యవధిలో చేరవేయగలిగితేనే ఉపయోగం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం తాము హైదరాబాద్‌పై దృష్టి పెట్టినందున మిగతా వాటిపై దృష్టిపెట్టలేకపోతున్నామని, అయితే దీనికి సంబంధించిన వివరాలను వెబినార్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచుతామని వివరించారు.
అతి తక్కువ కాలంలోనే ఎక్కవ మంది ఆదరణ పొందిన ఈ యాప్ అనేక మంది ప్రముఖల దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ యాప్‌ను లాంచ్ చేసిన మూడు రోజుల్లోనే ప్రియాంక చోప్రా, టాలీవుడ్ నటుడు ఆదివి శేష్ తమ ఇన్‌స్టాగ్రామ్ సైట్లలో అప్లికేషన్ గురించి సమాచారాన్ని పంచుకున్నారు. అనేక ఇతర నటీనటులు కూడా యాప్ గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు.