కరోనా వైరస్ రెండవ దశ (సెకెండ్ వేవ్) ఉధృతి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆ ప్రాంతం ఈ ప్రదేశం అనే తేడా లేకుండా యావత్ దేశాన్నీ చుట్టచుట్టింది. పట్టుమని పది రోజుల్లో యాభై లక్షల క్రియాశీల కేసులు నమోదయ్యాయంటే, రోజుకు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల పాజిటివ్ కేసులస్తున్నాయంటే పరిస్థితి ఎంత భీతావహమో అర్ధమవుతుంది. ఆక్సిజన్ కొరత, ప్రాణాధార మందులకు కటకట, సరైన వైద్య సదుపాయాలు అందక రోజుకు 3,500 నుండి 4 వేల మంది వరకు మృత్యువాత పడుతున్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయకుంటే వైద్య సదుపాయాలకు ఇబ్బందులేర్పడటం అనివార్యమని ఎయిమ్స్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) సహా పలు సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నియంత్రణకు దేశ వ్యాప్త లాక్‌డౌన్ విధించబోమంటున్న కేంద్రం, కట్టడి చర్యల బాధ్యతను రాష్ట్రాలకే వదిలేసి తమాషా చూస్తోంది. పలు రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు ఏదో ఒక పేరుతో జన సమూహాల కదలికలను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాయి. మరో వైపు సర్వోన్నత న్యాయస్థానం మొదలుకొని ఢిల్లీ, అలహాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మద్రాస్ సహా పలు రాష్ట్రాల హైకోర్టులు కరోనా వ్యాప్తి, తదనంతర పరిణామాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభిశంసించాయి. కేంద్ర వ్యాక్సినేషన్ విధానం సహా వైరస్ నియంత్రణ చర్యలపై పాలకులను ఎండగట్టాయి.
కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రపంచం ఎంచుకున్న మార్గాల్లో లాక్‌డౌన్లు, ఆంక్షలు ఒక ముఖ్యమైన అనివార్యతతో కూడిన మార్గాలు తప్ప అవే సర్వస్వం కాదన్నది ప్రపంచ అనుభవం. ప్రస్తుతం దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఉధృతిని కట్టడి చేయాలంటే కొన్ని రోజుల పాటు పరిమిత స్థాయిలో ఆంక్షలు అమలు చేయడం మంచిదే. అయితే ఇదే సమయంలో ప్రజల దైనందిన కార్యక్రమాలపై కఠిన ఆంక్షల మూలంగా వారి ఉపాధి అవకాశాలకు గండి పడుతుంది. జీవనం అస్తవ్యస్తమవుతుంది. కరోనా తొలి దశ సమయంలో అనాలోచిత లాక్‌డౌన్‌ల వలన కోట్లాది మంది వలస కూలీలు ఎంతగా క్షోభకు గురయ్యారో దేశం చూసింది. అది మొదలు ప్రజల జీవన స్థితిగతులు కుదుట పడింది లేదు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కరోనా విలయాలు, ఆర్దిక సంక్షోభాలు దెబ్బతీస్తూనే ఉన్నాయి. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పేదలు, శ్రామికులపై కరోనా రెండవ దశ ఆంక్షలు గోరుచుట్టుపై రోకటి పోటు చందం. కరోనా కట్టడికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షల పరంపరలో పేదల ఆకలిపై ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పది కిలోల బియ్యం అందిస్తున్నాయి. ఆ సహాయం ఒక్కటే పేదల ఆకలి తీర్చదు. బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసరాలను ఉచితంగా అందించాలి. ఆదాయ పన్ను చెల్లింపుదారులను మినహాయించి తతిమ్మా అన్ని కుటుంబాలకూ రూ.7,500 చొప్పున నగదు సహాయం అందిస్తేనే పేదలు, రోజువారీ పొట్టపోసుకునే శ్రామికులకు కొంతలో కొంతైనా ఆసరా అవుతుంది.
పట్టణాలు, నగరాల్లో అప్రకటిత లాక్‌డౌన్‌ల వలన నిర్మాణ, ఇతర రంగాల్లో పని చేసే కూలీలు లక్షలాది మంది ఊళ్ల బాట పట్టారు. మామూలుగానే గ్రామాల్లో ఉపాధి పనులు లేవు. వలస కార్మికులు తిరిగొస్తే పరిస్థితేంటో ఊహించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పనులను ఏడాదికి 200 రోజులకు పెంచాలి. రోజువారీ వేతనాన్ని రూ.600 చెల్లించాలి. అర్బన్ ప్రాంతాలకు ఉపాధిహామీ పనులను విస్తరించాలంటూ కొంత కాలంగా డిమాండ్ వస్తోంది. కరోనా సెకెండ్‌వేవ్ సంక్షోభ సమయానన్నా ఆ డిమాండ్‌ను నెరవేర్చాలి. ప్రజల జీవనోపాధిని పట్టించుకోకుండా, ప్రజల ఆకలిని తీర్చే కనీస సహాయం చేయకుండా కరోనాను అదుపు చేయడం అసాధ్యం. కేంద్రం ఆ దిశగా ఆలోచించి రాష్ట్రాలకు నిధులివ్వాలి. రాష్ట్రాలు సైతం కేంద్ర సహాయంతో నిమిత్తం లేకుండానే కేరళ తరహాలో ప్రజలను అన్ని విధాలా ఆదుకునే చర్యలు చేపట్టాలి. కేంద్రంపై నిధుల కోసం ఒత్తిడి చేయాలి. కేవలం వ్యాక్సినేషన్‌తోనే కరోనా కట్టడి అనడం పాక్షిక ఆలోచనే తప్ప శాశ్వత పరిష్కారం అనిపించుకోదు. ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్‌కు, ప్రజల జీవనోపాధికి పాలకులు పూచీ పడ్డప్పుడే కరోనా వంటి మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుంది.










