రాష్ట్ర వ్యాప్తంగా 950 పైగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 97.6 శాతం కేంద్రాలలో వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. కేవలం 2 శాతం మాత్రమే భర్తీ కావాల్సి వుంది. జిల్లా స్ధాయి ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా దాదాపు అన్ని స్పెషలిస్టు వైద్య సేవలు పూర్తి స్ధాయిలో అందుతున్నాయి. ప్రైవేటు రంగంలో వైద్య సేవల వలన ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం 'ఆర్ద్రం' పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కుటుంబ ఆరోగ్య కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ పథకంలో భాగంగా జిల్లా ఆసుపత్రులలో కార్డియాలజి, నెఫ్రాలజి, న్యూరాలజి వంటి స్పెషాలిటి వైద్య చికిత్సలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. కేరళ రాష్ట్రం కోవిడ్ పై జరిపిన పోరులో ఇంతటి పటిష్టమైన మూడంచెల ప్రజారోగ్య వ్యవస్ధ కీలక పాత్ర వహించింది.
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కోవిడ్-19 పై పోరులో అత్యంత క్రియాశీలతతో వ్యవహరించి...రాజకీయ నాయకత్వం, అధికార యంత్రాంగం, ప్రజానీకం మధ్య అసామాన్యమైన సమన్వయంతో ముందడుగు వేసింది కేరళ రాష్ట్రం. తక్కువ భూభాగంలో అధిక జనసాంద్రత కల్గినప్పటికీ కోవిడ్ కేసుల కట్టడిలో పురోగతి సాధిస్తూ నేటికీ కోవిడ్ మరణాల రేటు 0.5 శాతం కంటే మించకుండా చర్యలు తీసుకోవడంలో సఫలమైంది.
ఫస్ట్ వేవ్ లోనే పకడ్బందీగా '3 టి' విధానం
మన దేశంలో మొట్టమొదటి కోవిడ్-19 కేసు కేరళ రాష్ట్రం లోని త్రిస్సూరు జిల్లాలో నిర్ధారించబడింది. చైనా లోని వూహాన్ నుండి ప్రయాణం చేసివచ్చిన ఒక 20 సంవత్సరాల యువతి గొంతు నొప్పి, పొడి దగ్గు వంటి లక్షణాలతో 2020 జనవరి 27న త్రిస్సూరు జనరల్ ఆసుపత్రికి రాగా ఆమెకు జరిపిన ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలో కోవిడ్-19 వ్యాధి ఉన్నట్లుగా 2020 జనవరి 30న నిర్ధారించారు. త్రిస్సూరు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆమెను పూర్తిస్ధాయి ఐసొలేషన్ బ్లాక్‌లో ఉంచి చికిత్స అందించింది. అంతేగాక కాంటాక్ట్ ట్రేసింగ్‌లో ఆమెకు ప్రైమరీ కాంటాక్ట్‌గా గుర్తించిన వ్యక్తులను 28 రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉంచి మానిటర్ చేసింది. అప్రమత్తమయిన అధికారులు 24 గంటలలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి సంచరించిన రూట్ మ్యాప్ తయారు చేసి బహిరంగ ప్రకటన చేశారు. పాజిటివ్ వ్యక్తితో కాంటాక్ట్ లోకి వచ్చినట్లు అనుమానం కల్గిన ప్రజలు కూడా స్వచ్ఛందంగా టోల్ ఫ్రీ నెంబరుకు సమాచారమిచ్చి ట్రేసింగ్, టెస్టింగ్ విజయవంతమయ్యేలా సహకరించారు. ఇదే ఒరవడిని అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజలు తర్వాత కాలంలో కూడా కొనసాగించడంతో కేరళ రాష్ట్రంలో కాంటాక్ట్ 'ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్' అన్న విధానం విజయవంతంగా అమలయి వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం సులభతరమైంది. 'వైరస్ వ్యాపించే గొలుసును ఛేదిద్దాం' అన్న పిలుపుతో వైరస్ కట్టడి విధానపు అవగాహనను జిల్లా స్ధాయికి, తాలుకా స్ధాయికి, గ్రామ స్ధాయికి అంచెలవారీగా బదలాయించి ఆచరణలో ఫలితాలు రాబట్టడంలో ప్రభుత్వానికీ, అధికార యంత్రాంగానికీ, అట్టడుగున ప్రజా బాహుళ్యానికీ మధ్య ఏర్పడ్డ సమన్వయం కీలకపాత్ర పోషించింది. కేసులు అత్యధికంగా ఉన్న ఒక దశలో 1,70,000 ఐసొలేషన్ కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించింది.
అధికార వికేంద్రీకరణ
గ్రామ స్ధాయిలో ప్రజల భాగస్వామ్యం
వామపక్ష ప్రభుత్వం అమలులోకి తెచ్చిన 'ప్రజా ప్రణాళిక' ద్వారా 30 నుండి 45 శాతం ప్రణాళికా నిధులు గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో ఖర్చు చేస్తున్నారు. వికేంద్రీకరణ వలన కింది స్ధాయిలో గ్రామ సభలు, పంచాయితి కమిటీలు స్ధానిక ఆరోగ్య ప్రాధాన్యతల్ని గుర్తించడంలో, సమర్ధవంతంగా నిధుల్ని వినియోగించుకునేలా చేయడంలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయగల్గాయి. ఈ విధమైన సమిష్టి సహకార భాగస్వామ్యం వలన గ్రామ స్ధాయిలో పారిశుధ్యం, పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం, వైద్యారోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు ఎంతగానో మెరుగ్గా ఉన్నాయి. వికేంద్రీకరణలో స్ధానిక ప్రజల భాగస్వామ్యం కాగితాలకు, మాటలకే పరిమితం గాకుండా కార్యాచరణలో కేరళ రాష్ట్రం సజీవ నమూనాగా నిలిచింది. ఫలితంగా కేరళ రాష్ట్రంలో కోవిడ్-19 పై పోరును ప్రజలే సేనానులుగా విజయపథంలో నడిపించగల్గారు.
కేరళలో పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుండి పనుల నిమిత్తం వచ్చిన వలస కార్మికులున్నారు. అంతే గాక, సుమారు 23 లక్షల మందికి పైగా ప్రజలు గల్ఫ్ వంటి ఇతర దేశాలలో వివిధ వృత్తులలో పని చేస్తున్నారు. విదేశాలలో ఉంటున్న కేరళ రాష్ట్రీయులు విదేశాల నుండి గ్రామాలకు తిరిగివచ్చిన వారికి క్వారంటైన్ కల్పించడంలో ప్రతి గ్రామ పంచాయితి చురుకుగా వ్యవహరించింది. క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల ఆహారాది అవసరాలను పర్యవేక్షించాయి. క్వారంటైన్ ప్రాంతంగా ప్రకటించిన ఇళ్లలోని వ్యక్తుల బాధ్యత తీసుకుని వారికి అవసరమైన రేషన్, ఇతర అవసరాలను ఇళ్ల వద్దకే సరఫరా చేశాయి. లాక్‌డౌన్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 87 లక్షల కుటుంబాలకు నెల రోజులకు సరిపడా (17 రకాల సరుకులు కల్గిన) రేషన్ కిట్ ముందుగానే అందజేశాయి. ఐసొలేషన్ కేంద్రాలలో సరైన మందులు వాడేలా, ఆరోగ్య సూచీలు పర్యవేక్షించేలా స్ధానిక వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఐసొలేషన్ కేంద్రాలలోనే గాక, అనేక గ్రామాలలో స్ధానిక హెల్ప్‌లైన్, వాట్సప్ గ్రూపుల ద్వారా ఇళ్లలో భౌతికదూరం పాటించే వసతి లేని వారికి అదే గ్రామంలోని ఇతర నివాసాలలో ఐసొలేషన్ కోసం ఆశ్రయం పొందేలా కూడా స్వచ్ఛందంగా ప్రోత్సహించారు.
పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్ధ
కోవిడ్ పై పోరులో కీలక పాత్ర
కేరళ ప్రభుత్వం మొత్తం రాష్ట్ర స్ధూల జాతీయోత్పత్తిలో 6.5 శాతం ఆరోగ్య సంరక్షణా వ్యవస్ధ పైన ఖర్చు పెడుతుండటం గమనార్హం. ఇది కేంద్రం ఖర్చుపెడుతున్న 1.5 శాతం కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా, గ్రామ స్ధాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని జిల్లా స్ధాయిలో ఉండే టీచింగ్ ఆసుపత్రి దాకా పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్ధ వేళ్లూనుకుంది. కేంద్ర సంస్ధ నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించిన ప్రకారం స్ధూల ఆరోగ్య సూచీల పని తీరులో కేరళ స్కోరు 74.01 గా ఉండగా, ఉత్తర ప్రదేశ్ స్కోరు 28.61గా ఉండటం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 950 పైగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 97.6 శాతం కేంద్రాలలో వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. కేవలం 2 శాతం మాత్రమే భర్తీ కావాల్సి వుంది. జిల్లా స్ధాయి ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా దాదాపు అన్ని స్పెషలిస్టు వైద్య సేవలు పూర్తి స్ధాయిలో అందుతున్నాయి. ప్రైవేటు రంగంలో వైద్య సేవల వలన ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం 'ఆర్ద్రం' పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కుటుంబ ఆరోగ్య కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ కుటుంబ ఆరోగ్య కేంద్రాలు ప్రతిరోజూ ఎక్కువ గంటలు పని చేయడంతో పాటు, వెబ్-ఆధారిత అప్పాయింట్‌మెంట్లతో కూడిన సౌకర్యాలు కూడా కల్పిస్తాయి. మరింతమంది సిబ్బందిని సమకూర్చుకున్న ఈ కేంద్రాలు బి.పి, షుగర్, డిప్రెషన్ వంటి వ్యాధులకు వ్యక్తిగత ప్రత్యేక చికిత్సలు అందిస్తాయి. అంతేగాక 'ఆర్ద్రం' పథకంలో భాగంగా జిల్లా ఆసుపత్రులలో కార్డియాలజి, నెఫ్రాలజి, న్యూరాలజి వంటి స్పెషాలిటి వైద్య చికిత్సలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. కేరళ రాష్ట్రం కోవిడ్ పై జరిపిన పోరులో ఇంతటి పటిష్టమైన మూడంచెల ప్రజారోగ్య వ్యవస్ధ కీలక పాత్ర వహించింది.
సంసిద్ధత-నిబద్దత-సమాచార పారదర్శకత
కోవిడ్ మొట్టమొదటి కేసు బయటపడ్డ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పూనుకుని ఇతర మంత్రులు, అధికారుల సమక్షంలో వైద్య, ఆరోగ్య రంగ నిపుణులతో చర్చించారు. రాజకీయ నాయకత్వం మరియు ఐ.ఎ.యస్ వంటి కార్యనిర్వాహక అధికారులు కూడా ఎపిడమాలజిస్టులు, వైరాలజిస్టులు వంటి సంబంధిత వైద్య రంగ నిపుణుల సూచనలు పరిగణన లోకి తీసుకుని కోవిడ్ పాండమిక్ ను ఎదుర్కోవడానికి తగిన ప్రణాళిక రూపొందించి ముందడుగు వేయడం గమనార్హం. ప్రతి రోజు సాయంత్రం టెలివిజన్ ద్వారా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలనుద్దేశించి మాట్లాడి, వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పరిస్ధితులు వివరించి అవగాహన కల్పించారు. కేరళ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లో రోజువారీ వివరాలను క్రమం తప్పకుండా పొందుపర్చడం ప్రజలకు పారదర్శక సమాచారాన్ని చేరవేసింది. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష నాయకుడిని సైతం ఆహ్వానించి ఉమ్మడిగా ప్రెస్‌మీట్ పెట్టి కోవిడ్ నియంత్రణ గురించి ప్రజలనుద్దేశించి ప్రసంగించడం రాష్ట్ర ప్రజలలో భరోసాను నింపింది.
లాక్‌డౌన్ సమయంలో కమ్యూనిటీ కిచెన్లు
'లాక్‌డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలి బాధకు గురికాకూడదు' అన్న ముఖ్యమంత్రి విజయన్ పిలుపుకు స్పందనగా రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజూ రెండున్నర లక్షల ఆహారపు పొట్లాలు సరఫరా చేశారు. పేదలు, లబ్ధిదారులకు ఉచితంగా ఇంటివద్దకే రోజూ మూడు పూటలా అందించారు. ఇతర ప్రజలు కూడా ఈ ఆహారాన్ని రూ. 20 నామమాత్రపు ధరకు పొందే అవకాశం కల్పించారు. స్ధానిక ప్రజాప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ''కుడుంబశ్రీ ప్రాజెక్టు'' నెట్‌వర్క్ సభ్యులైన మహిళల భాగస్వామ్యంతో ఆహారం వండి సరఫరా చేశారు. కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇందుకు కావాల్సిన సరుకులను అందజేసింది. 'ఆరోగ్య సేన' పేరిట వాలంటరీ గ్రూపులు, ఆశా వర్కర్లు, గ్రామీణ బాల సంరక్షణా కేంద్ర టీచర్లు, వాట్సప్ గ్రూపుల సభ్యులు, స్ధానిక యువత... ఇలా అనేక సెక్షన్ల ప్రజలు ఈ కమ్యూనిటి కిచెన్ నిర్వహణ, ఆహార పంపిణీలో సహకారం అందించారు. ప్రతి గ్రామ పంచాయితి పరిధిలో నిర్దేశించబడ్డ ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి ఈ ఆహారాన్ని సమీపం లోని కమ్యూనిటీ కిచెన్‌లో పొందేలా అమలు జరిపారు. కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో 1255 కమ్యూనిటీ కిచెన్లు ఈ విధంగా నిర్వహించారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి అతి ముఖ్యమైన భౌతిక దూరం పాటించడం అనే సూత్రాన్ని ఈ కమ్యూనిటి కిచెన్ ప్రక్రియ సులభతరం చేసింది.
కేరళ పోలీస్ క్రియాశీలక పాత్ర
క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీస్ శాఖ అనేక ప్రాంతాలలో జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. హై రిస్క్ క్వారంటైన్ ప్రాంతంలో జి.పి.యస్, ఆర్.ఎఫ్.ఐ.డి ట్యాగ్స్, వైఫై, మొబైల్ ఫోన్ ట్రాకింగ్ వంటి అంశాలతో నిర్వచించిన కృత్రిమ సరిహద్దు రేఖ వద్ద వ్యక్తుల కదలికల్ని వెనువెంటనే పసిగట్టి హెచ్చరించడం జియో ఫెన్సింగ్ ప్రత్యేకత. కేరళ పోలీస్ యంత్రాంగం రాష్ట్రం నలుమూలలా సుమారు 300 డ్రోన్స్ ను ఉపయోగించి వీటి ద్వారా గమనించడం, హెచ్చరికలను బహిరంగంగా ప్రకటించడం వంటివి చేపట్టింది. ''బ్లూ టెలి-మెడ్'' అనే మొబైల్ యాప్ ద్వారా ఉచిత వీడియో కన్సల్టేషన్ సౌకర్యం కల్పించింది. కేరళ పోలీస్ మీడియా సెల్ ఆధ్వర్యంలో పాపులర్ మలయాళ సినిమా పాటల రూపంలో, వీడియోల రూపంలో ప్రజలకు సోషల్ మీడియా ద్వారా కోవిడ్ 19 అవగాహనను పెంపొందించింది. ''చేతులు శుభ్రపరచుకునే విధానం'' గురించి అవగాహన కల్పిస్తూ రూపొందించిన వీడియో అంతర్జాతీయంగా ప్రశంసలు పొందింది. అలాగే ''బ్రేక్ ది చైన్'' అనే వీడియో కూడా విస్త్రుతంగా ప్రచారమయ్యింది.
'స్టార్ట్-అప్'ల క్రియాశీలక పాత్ర
కేరళ స్టార్ట్-అప్ మిషన్ ''బ్రేక్ కరోనా'' పేరిట వినూత్నమైన ఐడియాలకు పిలుపునివ్వగా సుమారు 1947 ఐడియాలు, 351 పరిష్కారాలు ఆవిష్కృతమయ్యాయి. ఇందులో భాగంగా ఆవిష్కరించబడ్డ సాంకేతిక పరికరాలు కోవిడ్19 కట్టడిలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఉదాహరణకు అసిమోవ్ రోబోటిక్స్ అభివృద్ధి చేసిన రోబోలు. ఈ రోబోలు ఆఫీసులు, షాపింగ్ మాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల ప్రవేశాల వద్ద హాండ్ శానిటైజర్లు చల్లడం, ఐసొలేషన్ వార్డులలో పేషెంట్ల వద్దకు ఆహారం, మందులు, ఇతర వస్తువులు అందించడం, ఉపయోగించి పడవేసిన వస్తువుల్ని డిస్-ఇన్ఫెక్ట్ చేయడం, పేషెంట్లకు డాక్టర్లతో మాట్లాడేలా సహాయపడటం వంటి పనులు చేయగల్గాయి. 'ఖోపీ' అనే ఆన్‌లైన్ సర్వీస్ సంస్ధ జిఒకె (గవర్నమెంట్ ఆఫ్ కేరళ) డైరెక్ట్ యాప్ ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా మొబైల్ ఫోనులో కేరళ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం అప్‌డేట్స్, కోవిడ్-19 అలర్ట్స్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 'క్విక్ డాక్టర్ హెల్త్ కేర్' యాప్ ద్వారా ప్రభుత్వం టెలి మెడిసిన్ ద్వారా ఉచితంగా వైద్యుల సలహా పొందే సౌకర్యం ప్రజలకు అందుబాటు లోకి తెచ్చింది.
కోవిడ్-19 చికిత్సలో ప్రొటోకాళ్లపై
వైద్యులకు అవగాహన
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం కోవిడ్ చికిత్స అవగాహన జూమ్ మీటింగ్ ల ద్వారా కల్పించింది. సీనియర్ వైద్య నిపుణుల సహకారంతో రోగ లక్షణాలలో వస్తున్న మార్పులు, చికిత్సలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలలో కనబడ్డ బ్లాక్ ఫంగస్ వంటి కాంప్లికేషన్లు కేరళ రాష్ట్రంలో కానరాలేదు. అంతేగాక ప్రతి జిల్లాలోనూ సీనియర్ పల్మనాలజిస్టులు, ఇన్ఫెక్షస్ డిసీజెస్ స్పెషలిస్టులతో అడ్వయిజరీ సెల్ ఏర్పాటు చేశారు. కోవిడ్ చికిత్సలో ఏ విధమైన సందేహాలు కల్గినా ఆ జిల్లాలోని వైద్యులు ఆ సెల్ గైడెన్స్ తీసుకోవచ్చు. ఈ చర్యల ఫలితంగా కోవిడ్ చికిత్సలో కేరళ రాష్ట్రంలో గుణాత్మకమైన మెరుగుదల ఏర్పడి మరణాల రేటు తగ్గించడానికి తోడ్పడింది.
సెకండ్ వేవ్ కు సంసిద్ధత
సెకండ్ వేవ్ కు ముందుగానే ప్రతి గ్రామ పంచాయితీలో కోవిడ్ చికిత్సా కేంద్రంగా మార్చదగ్గ అర్హతలున్న ఏదో ఒక భవనాన్ని గుర్తించారు. ఆ భవనంలో పేషెంట్ బెడ్లు, పల్స్ ఆక్సీమీటర్లు, ధర్మామీటర్లు, మందులు, ఆక్సిజన్ వంటి ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని కోవిడ్ ప్రథమ చికిత్సా కేంద్రాలుగా ప్రకటించింది. ఇదిగాక ఆసుపత్రులలో సౌకర్యాలను మెరుగుపర్చే ప్రయత్నాలలో భాగంగా కేరళ ప్రభుత్వం వెంటిలేటర్లను (ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 3,776 వెంటిలేటర్లు), ఐ.సియు బెడ్లను (ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 9,735 బెడ్లు ) రెట్టింపు సంఖ్యలో అందుబాటు లోకి తెచ్చింది.
ఆక్సిజన్ ఉత్పత్తిని రోజుకు సగటున 219.22 మెట్రిక్ టన్నుల సామర్ధ్యానికి పెంచింది. సెకండ్ వేవ్‌లో సగటు ఆక్సిజన్ డిమాండ్ కేరళ రాష్ట్రంలో రోజుకు 74 మెట్రిక్ టన్నులు కాగా, మిగులు ఆక్సిజన్ ను కొన్ని రోజుల పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసి ఆదుకోగల్గింది. 2020 ఏప్రిల్ నెలలో కేరళ రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి సగటున 50 ఎల్‌పిఎం (లీటర్స్ పర్ మినిట్) కాగా, 2021 ఏప్రిల్ నెల నాటికి 1,250 ఎల్‌పిఎం కు పెంచుకోగల్గింది. ప్రస్తుతం 23 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పుకోగల్గింది. సామర్ధ్యం కల్గిన ప్రైవేటు ఆసుపత్రులలో 50 శాతం పడకలు కోవిడ్ కేసులకు కేటాయించేలా, ప్రైవేటు మెడికల్ కాలేజి ఆసుపత్రులలో సైతం 75 శాతం పడకలు కోవిడ్ కేసులకు కేటాయించేలా చర్యలు తీసుకున్నది. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా దేశంలోనే జీరో వేస్టేజి ఘనతను కేరళ రాష్ట్రం సాధించింది.
150 సంవత్సరాల సామాజిక న్యాయ ఉద్యమాల చరిత్ర కల్గిన కేరళ గత కొన్ని దశాబ్దాల క్రితమే దేశంలోనే అత్యధిక అక్షరాస్యత సాధిం చింది. పటిష్టమైన ప్రజారోగ్య సంరక్షణా వ్యవస్ధను కల్గివుండి అచ్చమైన అధికార వికేంద్రీకరణతో నిజమైన ప్రజల భాగస్వామ్యంతో సంసిద్ధత, నిబద్ధత కల్గిన రాజకీయ నాయకత్వంలో కోవిడ్ పై పోరు జరిపింది. దాని నుంచి విలువైన పాఠాలు నేర్చుకుని కోవిడ్ పై పోరాటాన్ని ముందుకు తీసుకు పోవాల్సిన ఆవశ్యకత మిగతా రాష్ట్రాల పైన, ప్రపంచ దేశాల పైన ఎంతైనా ఉన్నది.

/ వ్యాసకర్త గౌరవాధ్యక్షులు, జన విజ్ఞాన వేదిక, సంగారెడ్డి జిల్లా కమిటీ, తెలంగాణ/
డా|| కె.శివబాబు











