ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ శ్మశాన వాటికలు, సమాధి స్థలాలు కళేబరాలతో నిండిపోయాయి. తమ ప్రియమైన వారి దహన సంస్కారాలకు కుటుంబాలు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. శవ దహనాలు రెట్టింపు చేసి, అరవైకి పైగా దహనాలు నిర్వహించినప్పటికీ ఏప్రిల్ 18న ఢిల్లీ లోని చాలా పెద్ద శ్మశానవాటిక నిగమ్ బోధ్ ఘాట్‌లో శవాలు ఉంచటానికి స్థలం లేకపోయింది.
ఏప్రిల్ 17న పశ్చిమ బెంగాల్ లోని ఒక ఎన్నికల సభలో మాస్కులు లేకుండా పోగయిన జనాలు తోసుకుంటుండగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ ''ఇంతటి భారీ జనాలను నేనెప్పుడు చూడలేదు'' అని గర్వంగా ప్రకటించారు. అయన ముఖానికీ మాస్కు లేకపోవటం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదేరోజు భారతదేశం 2,34,000 కొత్త కరోనా కేసులను నమోదు చేసుకుంది. 1,341 మరణాల సంఖ్య ఆ రోజుకి లెక్క తేలింది. అప్పటి నుంచి కొత్త కేసులు, మరణాల సంఖ్యా పెరుగుతూనే ఉంది. ఇంతకుమునుపు ఏనాడూ చూడని విషాద ఛాయల్లోకి దేశం తరలిపోతున్నది. ఒక్క వారంలో 16 లక్షల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య కోటి 50 లక్షల పైబడింది. కేవలం 12 రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్ రేట్ రెండింతలయి 17 శాతానికి చేరింది.
భారతదేశంలో కరోనా కొత్త అవతారం ఎత్తిందని, దానికి త్వరగా అంటుకుపోయే లక్షణం ఉన్నదని ఒక సాకుగా చెపుతున్నప్పటికీ... దేశంలో అత్యున్నత నాయకత్వ స్థానంలో వున్న మోడీ ప్రభుత్వపు రాజకీయ మార్గదర్శక వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది. కరోనా కట్టడిలో వివిధ పార్టీల చేతుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మెతక ధోరణి అవలంబిస్తున్నాయి. ఆపై ఆరోగ్య శాఖాధికారుల నిర్లక్ష్య వైఖరి వెరసి భారతదేశం కరోనాను ఓడించిందనే భావన తప్పని తేలింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె. శ్రీకాంత్ రెడ్డి ''ఈ మహమ్మారి దేశం వదలి వెళ్లిపోలేదని దేశ నాయకత్వం ప్రజలకు అర్థమయ్యే విధంగా సరిగ్గా వివరించలేదు'' అన్నారు. ''విజయాన్ని సాధించకుండానే, అపరిపక్వతతో గెలిచామని ముందుగానే ప్రకటించి దేశమంతటా సంబరాలు చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆర్థిక వ్యవస్థ సజావుగా నడుస్తున్నది కాబట్టి తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకోవటం దీనికి కారణం. దీంతో వైరస్ మరోసారి విజృంభించే అవకాశం వచ్చింది.''
పశ్చిమ బెంగాల్‌లో బిజెపి గెలుస్తుందని ఆశతో వున్న మోడీ ప్రభుత్వం అక్కడి ఎన్నికల దశలను కుదించటానికి నిరాకరించింది. ఒక పక్కన దేశంలో ఆస్పత్రుల ఎదుట అంబులెన్సులు బారులు తీరివుంటే, అక్కడ మోడీ, అమిత్‌షా బహిరంగసభలు, రోడ్ షోలు ఒక పరంపరగా కొనసాగించారు. మోడీ ర్యాలీ నిర్వహించిన ఏప్రిల్ 17న బెంగాల్‌లో 7,713 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మొదలైన తరువాత ఇదే అప్పటికి అక్కడ అత్యధిక సంఖ్య. ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులు కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. ఏప్రిల్ 18న 'మోడీ మేడ్ డిజాస్టర్' అనే హాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ హోరెత్తింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత సంసిద్ధతతో లేనందువలన, బెడ్ల కొరతతో కోవిడ్ పేషంట్లకు వైద్యం అందించలేకపోతున్నామని కరోనా రోగులు కోకొల్లలుగా చనిపోతున్నారని ఫ్రంట్‌లైన్‌లో పని చేసే వైద్యులు విలపిస్తున్నారు.
కరోనా రెండవ దశ ఉగ్ర రూపంలో విరుచుకు పడనున్నదని తాము ఫిబ్రవరి లోనే హెచ్చరించామని, ఆ హెచ్చరికలన్నీ నిర్లక్ష్యం చేశారని ముంబై లోని నిరామయ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అమిత్ థఢాని అంటున్నారు. ముంబై లోని ఈ నిరామయ హాస్పిటల్ కరోనా పేషంట్లకు మాత్రమే వైద్యం చేస్తుంది. ''ఇప్పుడు మా ఆస్పత్రి పేషంట్లతో నిండిపోయింది. ఎవరైనా డిశ్చార్జి అయితే మరుక్షణం ఆ బెడ్ నిండుతుంది'' అని డాక్టర్ థఢాని అన్నారు. పది రోజుల క్రితం ఆ హాస్పిటల్‌కు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. అయితే తగిన సమయంలో ఇతర మార్గాల్లో ఆక్సిజన్ తెచ్చుకున్నారు. డా|| థఢాని ఇలా అన్నారు... 'హాస్పిటల్ బయట బెడ్ కోసం ప్రయత్నిస్తున్న ప్రజలు బారులు కట్టి నిలబడి వున్నారు. 'మాకు దయచేసి బెడ్ ఇవ్వండి' అనే విజ్ఞాపనలతో ప్రతి రోజూ ప్రతి 30 సెకన్లకు మాకు ఫోన్లు వస్తూనే వున్నాయి. వీటిలో ఎక్కువ భాగం క్లిష్టమైన అనారోగ్య స్థితిలో ఉన్న పేషంట్ల నుంచి వస్తున్నాయి. వారికి ఆస్పత్రి సంరక్షణలో వైద్యం అందటం అవసరం. కానీ మా దగ్గర వారిని చేర్చుకునే చోటు లేదు. దానితో మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతివారు తమ శక్తికి మించి పని చేస్తున్నారు. ఈసారి వచ్చిన వైరస్ ఎంతో భీకరంగాను, త్వరత్వరగా వ్యాపించేదిగాను ఉన్నది''.
దేశ రాజధానిలో ఈ మూల నుంచి ఆ మూల దాకా అంబులెన్సుల సైరన్ మోత నిర్విరామంగా వినిపిస్తున్నది. ఢిల్లీ లోని అతి పెద్ద కోవిడ్ సదుపాయాలున్న లోక్‌నాయక్ ప్రభుత్వ ఆస్పత్రి సామర్థ్యానికి మించిన అధిక భారంతో పని చేస్తున్నది. ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ఒక బెడ్‌కు ఇద్దరు చొప్పున పేషంట్లను పెట్టి ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆస్పత్రి బయట స్ట్రెచర్ల మీద, అంబులెన్సులలో శ్వాస కోసం కింద మీదా అవుతున్న పేషంట్లు, వారి పక్కన శోకాలతో వెక్కిళ్ళు పెడుతున్న బంధువులు కనపడతారు. కొంతమంది తాము సొంతంగా తెచ్చుకున్న ఆక్సిజన్ సిలిండర్లతో ఆస్పత్రి బయట అడ్మిషన్ కోసం పడిగాపులు కాయటం కనపడే దృశ్యం. హాస్పిటల్ కారు పార్కింగ్‌లో అడ్మిషన్ల కోసం ఎదురు చూసి మరణించిన వారున్నారు. కరోనా రెండవ దశను చవిచూసిన మొదటి నగరం ముంబై. ''మొత్తం వైద్య సంరక్షణ వ్యవస్థ కుప్పకూలిపోయింది. డాక్టర్లు నిస్పృహకు లోనవుతున్నారు'' అని ముంబై లోని లీలావతి హాస్పిటల్ వైద్యుడు డా|| జలీల్ పార్కర్ అన్నారు. ''బెడ్లకు కొరత, ఆక్సిజన్‌కు కొరత, మందులకు కొరత, వ్యాక్సిన్లకు కొరత, తక్కువ కరోనా పరీక్షలు...ఇది ఇక్కడి పరిస్థితి'' అని కూడా అన్నారు. ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ కుప్పకూలకుండా ఆపే ప్రయత్నంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 19న ఆరు రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు.
కరోనా వైరస్ వల్ల సంభవించిన మరణాల వాస్తవ సంఖ్యను దాచి పెడుతున్నారని గుజరాత్, ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ మార్చురీలలో ఉన్న శవాల సంఖ్య ప్రభుత్వం చెపుతున్న మతుల సంఖ్యను మించి ఉన్నది. ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్ వలన బాగా దెబ్బతిన్న నగరం లక్నో. అంబులెన్సు డ్రైవర్‌గా పని చేస్తున్న సరోజ్ కుమార్ పాండే ఎంత ప్రయాస పడినా తన పెంపుడు కుమార్తె దీప్తి మిస్త్రి ని కోవిడ్ బారి నుంచి రక్షించుకోలేకపోయాడు. కరోనా సోకిన దీప్తిని కాపాడుకునేందుకు ఒక డజన్ ప్రయివేటు, గవర్నమెంటు హాస్పిటళ్ల చుట్టూ తిరిగాడు. ఆక్సిజన్ అందుబాటులో లేక ఆమె చివరికి ప్రాణాలు విడిచింది. హాస్పిటళ్లలో బెడ్ల కోసం, ఆక్సిజన్, ప్లాస్మా, కోవిడ్ పేషంట్లకు క్లిష్ట సమయాలలో వాడే రెమ్‌డెసివిర్ మందు కోసం ట్విట్టర్, ఫేస్‌బుక్ లలో వేలాది విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ శ్మశాన వాటికలు, సమాధి స్థలాలు కళేబరాలతో నిండిపోయాయి. తమ ప్రియమైన వారి దహన సంస్కారాలకు కుటుంబాలు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. శవ దహనాలు రెట్టింపు చేసి, అరవైకి పైగా దహనాలు నిర్వహించినప్పటికీ ఏప్రిల్ 18న ఢిల్లీ లోని చాలా పెద్ద శ్మశానవాటిక నిగమ్ బోధ్ ఘాట్‌లో శవాలు ఉంచటానికి స్థలం లేకపోయింది.
మే 1 నుండి 18 ఏళ్ల పైబడ్డ వారందరూ వ్యాక్సిన్‌కు అర్హులని వ్యాక్సిన్ విస్తరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుండగా కొద్ది నెలల ముందు ఎత్తివేసిన తాత్కాలిక కోవిడ్ సదుపాయాల వసతులను తిరిగి నిర్మించటానికి ఢిల్లీ, ముంబై లోని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాస పడుతున్నాయి. కాకపొతే వ్యాక్సిన్ కొరత మాత్రం అదేవిధంగా ఉన్నది. దేశంలోని హాస్పిటళ్ల నుంచి మునుపు ఎదుర్కోని డిమాండ్‌ను అందుకోవటానికి పారిశ్రామిక అవసరాలకు వాడే ఆక్సిజన్‌ను వైద్య అవసరాలకు మళ్ళించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్‌ను, ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేయటానికి 'ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్'ల పేరుతో ప్రత్యేకమైన రైళ్ళు నడపటానికి భారత రైల్వే సిద్ధమవుతోంది. రైల్వే కంపార్టుమెంట్లను వేలాదిమంది పేషంట్లకు ఉపయోగపడే విధంగా కోవిడ్ బెడ్లుగా మార్చింది.
అయినప్పటికీ, చేసింది చాలా తక్కువ, చాలా చాలా ఆలస్యంగా చేస్తున్నట్టు అనేకమంది భావిస్తున్నారు. ''ప్రమాదకర పరిస్థితిని ఎన్నో నెలల ముందే గ్రహించి ఉండాలి. కానీ ప్రభుత్వాలు వాస్తవ స్థితిని పట్టించుకోవటానికి నిరాకరించాయి. ఈ వైరస్ ఇక ఎంత మాత్రమూ ప్రమాదకరమైనది కాదనే సందేశాన్ని వదిలాయి. ఇంతకంటే భయానకమైన పరిస్థితిని చూడనున్నామని నేను ఆందోళన పడుతున్నాను'' అంటారు డాక్టర్ థఢాని.
/ 'ది గార్డియన్' పత్రిక సౌజన్యంతో /
హన్నా ఎల్లిస్ పిటర్సన్











